బీఆర్ఎస్‌గా మారిన టీఆర్ఎస్… నేడే ఆవిర్భావ వేడుకలు 

Friday, May 3, 2024

టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చుతూ ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పంపిన ప్రతిపాదనకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలపడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకొంటున్నాయి. ఈ మేరకు కేసీఆర్‌కు గురువారం కమీషన్ లేఖ పంపడంతో, శుక్రవారం మధ్యాహ్నం లాంఛనంగా ఆవిర్భావ వేడుకలకు సమాయత్తం అవుతున్నారు. 21 ఏళ్లుగా ప్రాంతీయ పార్టీగా జాతీయ స్థాయిలో తనకంటూ ఓ గుర్తింపు పొందిన టిఆర్ఎస్ ఇక నుండి అధికారికంగా జాతీయ పార్టీగా బి ఆర్ ఎస్ పేరుతో మారనుంది. 

పైగా, శుక్రవారం కేసీఆర్ దీక్ష విరమించిన విజయ్ దివస్ కూడా కావడంతో అప్పుడే బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని సిద్ధమవుతున్నారు.   తెలంగాణ భవన్ లో శుక్రవారం ఒంటిగంట 20 నిమిషాలకు, తనకు అందిన అధికారిక లేఖపై రిప్లై సంతకం చేసి ఎన్నికల సంఘానికి అధికారికంగా పంపించనున్నారు. 

అనంతరం సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ జండాను ఆవిష్కరిస్తారు. తెలంగాణ భవన్ లో రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కావాలని ముఖ్యమంత్రి కోరారు. వీరితోపాటు జిల్లా పరిషత్ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీబీ అధ్యక్షులు డీసీఎంఎస్ అధ్యక్షులతో పాటు పార్టీ ముఖ్యులు అందరూ శుక్రవారం మధ్యాహ్నం లోపు తెలంగాణ భవనకు చేరుకోవాలని పార్టీ అధినేత సీఎం కేసిఆర్ పిలుపునిచ్చారు.

అక్టోబర్ 5న దసరా రోజు పార్టీ సమావేశం ఏర్పాటు చేసి పార్టీ పేరును బీఆర్ఎస్‌గా మార్చుతూ తీర్మానం పెట్టి ఆమోదించారు. టీఆర్‌ఎస్‌ జనరల్‌ బాడీ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ పార్టీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. పార్టీ కార్యకలాపాలను జాతీయ స్థాయిలో విస్తరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా వెల్లడించింది. పార్టీ నియమావళిలో మార్పులు చేశామని టీఆర్‌ఎస్‌ స్పష్టం చేసింది. 

పార్టీ పేరు మార్పునకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.  ఈ విషయంపై టీఆర్‌ఎస్‌ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. మాజీ ఎంపీ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌రావు స్వయంగా సీఈసీని కలిసి దరఖాస్తు అందించారు.

నెల రోజుల తర్వాత పేరు మార్పుపై పబ్లిక్‌ నోటీస్‌ ఇవ్వాలని ఎన్నికల సంఘం టీఆర్‌ఎస్‌కు లేఖ రాసింది. దీంతో నవంబర్‌ 7న టీఆర్‌ఎస్‌ పేరును బీఆర్‌ఎస్‌ గా మారుస్తూ.. టీఆర్‌ఎస్‌ పబ్లిక్‌ నోటీస్‌ ఇచ్చింది. ఈ మేరకు అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లో సెక్రటరీ, ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా, నిర్వాచన్‌ సదన్, అశోకా రోడ్, న్యూఢిల్లీ అడ్రస్‌కు కారణాలతో సహా అభ్యంతరాలను పంపాలని పబ్లిక్‌ నోటీసులో టీఆర్‌ఎస్‌ పేర్కొంది.

డిసెంబర్‌ 7తో ఇందుకు సంబంధించిన గడువు ముగిసింది. దీనిపై పెద్దగా అభ్యంతరాలు రాకపోవడంతో కేంద్రం ఎన్నికల సంఘం టిఆర్ఎస్ ను బీఆర్ఎస్‌గా మారేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయడం దాదాపు లాంఛనమే కానుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles