ఏపీ విభజనపై సజ్జల `సెంటిమెంట్ అస్త్రం’

Friday, April 26, 2024

వీలైతే ఏపీ మళ్లీ ఉమ్మడిగా ఉండాలన్నదే తమ పార్టీ విధానం అని, రెండు రాష్ట్రాలు కలిసిపోతే మొదట స్వాగతించేది వైఎస్‌ఆర్‌సిపియేనని  ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించడం రాజకీయ దుమారం రేపుతోంది. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా ఉమ్మడి రాష్ట్రానికే తమ ఓటు అని, ఏ వేదికపై అయినా ఇదే మాట చెబుతామని ఆయన స్పష్టం చేశారు. 

2024 అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధపడుతున్న వైసిపి అరుణ్ కుమార్ పిటీషన్ పై సుప్రీంకోర్టులో విచారణను ఆసరాగా తీసుకొని రాష్ట్ర ప్రజలపై `సెంటిమెంట్ అస్త్రం’ ప్రయోగించేందుకు ఆయన ఇటువంటి వాఖ్యలు చేసిన్నట్లు స్పష్టం అవుతుంది. విభజన చట్టంలో చేసిన హామీల  అమలుపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయలేని వైసిపి ప్రభుత్వ  ధోరణి పట్ల ప్రజలలో నెలకొన్న అసంతృప్తిని తొలగించడం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది.  

ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం, పార్టీ వైఖరి ఇదేనని కూడా ఆయన తేల్చి చెప్పారు. రాష్ట్ర విభజన జరిగిన తీరును సవాల్ చేస్తూ మాజీ కాంగ్రెస్ ఎంపీ, వై ఎస్ రాజశేఖరరెడ్డి సన్నిహితుడు ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన పిటిషన్ ప్రస్తుతం విచారణకు వచ్చిన సందర్భంగా ఆయన చేసిన వాఖ్యలు ప్రాధాన్యతను సంతరింప చేసుకున్నాయి. 

పైగా, రాష్ట్ర విభజనను తిప్పి పంపాలని.. లేదా సర్దుబాట్లు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విభజనకు వ్యతిరేకంగా అత్యున్నత న్యాయస్థానంలో తమ వాదనలు స్పష్టంగా వినిపిస్తామని చెబుతూ రాష్ట్ర విభజనను పునఃసమీక్షించాలని, లేదా, సరిదిద్దాలని కోరతామని వెల్లడించారు. రెండు రాష్ట్రాలు కలిసుండాలని సుప్రీం కోర్టు ఆదేశిస్తే అంతకంటే కావాల్సింది ఏముంటుందని తెలిపారు. 

విభజన అంశాలను ఇక వదిలేయాలంటూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఎవరి ప్రయోజనం కోసం ఈ అఫిడవిట్ వేశారని ఉండవల్లి ప్రశ్నించారు. ఏపీకి అన్యాయం జరుగుతోందని తెలిసి కూడా జగన్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఆయన నిలదీశారు. 

 పోరాటం చేసి సీఎం అయిన జగన్ ఇప్పుడెందుకు వెనుకంజ వేస్తున్నారని ఉండవల్లి ఎద్దేవా చేశారు.  ఇప్పుడా విషయాన్నే విస్మరిస్తూ, విభజన గురించి వదిలేయండంటున్నారని విమర్శించారు. ఈ విధంగా చేస్తే చరిత్ర క్షమిపబోదని కూడా హెచ్చరించారు. 

ఇలా ఉండగా, సజ్జల వాఖ్యలపై తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ స్పందిస్తూ ఆ వాఖ్యాలను ఖండించే ప్రయత్నం చేయకుండా, వాటిని తెలంగాణ సీఎం కేసీఆర్ పలికించిన మాటాలు అంటూ పేర్కొన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అండదండలతోనే తనపై నమోదైన సీబీఐ, ఈడీ కేసుల విచారణ ముందుకు సాగకుండా జగన్ తప్పించుకో గలుగుతున్నారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న సమయంలో సంజయ్ ధోరణి సహితం ఆసక్తి కలిగిస్తుంది. 

 సజ్జల చేసిన ఈ వ్యాఖ్యలు కేసీఆర్ ఆడిస్తున్న డ్రామాగా అభివర్ణించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ ముఖ్యమంత్రితో మాట్లాడి.. అక్కడి నాయకుడితో ఈ రకమైన వ్యాఖ్యలు చేయించారని బండి సంజయ్ ఆరోపించారు. 

ఇలా చేయడం ద్వారా మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేయొచ్చని.. తద్వారా కవిత లిక్కర్ స్కామ్ అంశంపై ప్రజల దృష్టి మరల్చవచ్చని ఆయన ప్లాన్ చేశారని బండి సంజయ్ ఆరోపించారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసే ఉన్నారని.. కమీషన్లు కూడా పంచుకుంటారని ఆరోపించారు.

అయితే, సజ్జల వాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ  పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మళ్లీ కలవడం కల, అది ఎప్పటికీ నిజం కాదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య బద్దంగా రెండు రాష్ట్రాలు విడిపోయిన తరువాత మళ్లీ కుట్రపూరిత వ్యాఖ్యలు చేయడంపై ప్రభాకర్ ఆయన మండిపడ్డారు.   

సమైక్యాంధ్ర అనేది ముగిసిన అధ్యాయం అని, ఇప్పుడు కలపాలనే కొత్త ఆలోచన చేయాలనే సజ్జల వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు పొన్నం ప్రభాకర్ తెలిపారు. రెండు రాష్ట్రాలు బాగుండాలని కోరుకోవాలి..కానీ మళ్ళీ తెలంగాణ లో రాజ్యాధికారం కోసం ప్రత్నిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. 

తెలంగాణలో మళ్ళీ ఆంధ్రానాయకులు విబేధాలు సృష్టించడానికి కుట్ర చేస్తున్నారని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. 60 ఏళ్ళు తెలంగాణను దోచుకున్నారు, వాళ్ళు తిన్నది చాలదట అని ఆయన మండిపడ్డారు. 9 ఏళ్లుగా ఆంధ్రా ప్రజలు తెలంగాణలో అన్నదమ్ముల్లా కలిసి ఉన్నారు. తెలంగాణపై కుట్రలు చేస్తే ఇక్కడే పాతర వేస్తామని హెచ్చరించారు. 

సజ్జల వ్యాఖ్యలు అర్థం లేనివి అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. సజ్జల రెండు రాష్ట్రాలను కలపడంపై ధ్యాస పెట్టడం మానుకుని ఏపీ అభివృద్ధిపై ధ్యాస పెట్టాలని ఆమె హితవు చెప్పారు. హక్కుల కోసం పోరాటం చేయాలని, మీ ప్రాంతానికి న్యాయం చేయాలని సూచించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడడం సజ్జలకు తగదని షర్మిల స్పష్టం చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles