‘జెయింట్ కిల్లర్లు’ అనే కోటా హౌస్‌ఫుల్!

Sunday, June 23, 2024

రాజకీయాలలో ‘జెయింట్ కిల్లర్’ అనే మాట అతి తరచుగా వినిపిస్తూ ఉంటుంది. మంత్రి పదవులలో ఉన్న వారిని ఓడించిన సామాన్యులను జెయింట్ కిల్లర్ గా వ్యవహరిస్తుంటారు! ఇది చాలా అరుదుగా జరిగే వ్యవహారం గనుక, ఆ తర్వాత వచ్చే ప్రభుత్వం జెయింట్ కిల్లర్లకు మంత్రివర్గం కూర్పులో కాస్త ప్రాధాన్యం ఇస్తూ ఉంటుంది. కేవలం మంత్రులను ఓడించిన కారణంగా తర్వాతి ప్రభుత్వంలో మంత్రి పదవి పొందిన వారు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం ఎన్డీఏ కూటమి సాధించిన అపూర్వ విజయం తర్వాత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం మంత్రివర్గం మీద కసరత్తు చేస్తున్న సమయంలో జెయింట్ కిల్లర్ అనే ప్రత్యేకతను పరిగణనలోకి తీసుకునే అవకాశం లేకుండా పోతున్నది. ఎందుకంటే పార్టీలో వారి సంఖ్య ఎక్కువ గా ఉంది! వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో 25 మంది మంత్రులు ఉండగా ఇప్పుడు ఎన్నికలలో గెలిచింది ఒకే ఒక్కరు. అంటే ఇప్పటి ఎన్ డి ఏ కుటుంబంలో 24 మంది జెయింట్ కిల్లర్లు ఉన్నారన్నమాట! చాలా తమాషాగా అనిపిస్తున్న సంగతి ఇది.

జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో కొమ్ములు తిరిగిన వారు కూడా అనేకమంది ఉండేవారు. రెండున్నర సంవత్సరాల తర్వాత మంత్రివర్గాన్ని పూర్తిగా మారుస్తానని ముందే ప్రకటించిన, జగన్మోహన్ రెడ్డి ఆ పనిని పూర్తిగా చేయలేకపోయారు. ఎందుకంటే మంత్రివర్గంలో ఉన్న కొందరి మీద అప్పటికే ఆయన అతిగా ఆధారపడుతున్నారనే ప్రచారం జరిగింది. నిజానికి ఇద్దరు ముగ్గురు మినహా మొత్తం మంత్రివర్ధాన్ని మారుస్తారని ప్రచారం జరిగినా జగన్ ఆ పని చేయలేకపోయారు. అంటే జగన్ నే అనివార్యతలోకి నెట్టేసిన మొనగాళ్లు ఆయన క్యాబినెట్లో ఉన్నారన్నమాట!

అలాంటి వారిలో బొత్స, సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తదితరులు ఉన్నారు. పెద్దిరెడ్డి తప్ప వీరెవ్వరూ  కూడా ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించలేదు. దాంతో ఇప్పుడు మంత్రివర్గ కూర్పు సమయంలో జెయింట్ కిల్లర్లు అనే పదానికి విలువ లేకుండా పోయింది.
ఆ వ్యవహారాన్ని పక్కన పెట్టేసి కేవలం సమర్ధత చిత్తశుద్ధి కుల సమీకరణాలు ప్రాంతీయ సమీకరణాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సహచరులను ఎంపిక చేస్తున్నట్లుగా సమాచారం. ఇప్పుడు జిల్లాల సంఖ్య పెరిగినప్పటికీ, ఉమ్మడి జిల్లాలే ప్రాతిపదికగా మంత్రుల ప్రాతినిధ్యంలో సమతూకం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకవైపు సీనియారిటీ అనుభవజ్ఞులైన నాయకులను వాడుకుంటూనే, మరోవైపు యువశక్తికి కూడా చోటు కల్పించడం ద్వారా ఆ రకమైన సమతూకం కూడా క్యాబినెట్లో చూపించాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles