అవశేష ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్టు ఇక అర్ధాంతరంగా ఆగిపోయినట్లే అని స్పష్టం అవుతున్నది. రాష్ట్ర విభజన చట్టంలో కీలకమైన ఈ ప్రాజెక్ట్ పట్ల మొదటి నుండి నిర్లక్ష్య ధోరణిని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రదర్శిస్తుండడంతో పాటుగా ప్రస్తుత ఏపీ ప్రభుత్వం సహితం ఈ విషయమై కేంద్రాన్ని నిలదీయలేని నిస్సహాయ స్థితిలో చిక్కుకోవడంతో ఇక ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లే అవకాశాలు కనిపించడం లేదు.
పోలవరం ప్రాజెక్టు మౌలికంగా జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపబడి దాని నిర్మాణ బాధ్యత కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వెళ్లింది. ఈ జాతీయ హోదా 2014 విభజన చట్టం ద్వారా వచ్చింది. కానీ 2014కి ముందే నిర్మాణం ఉమ్మడి రాష్ట్ర ఆధ్వర్యంలో జరుగుతుండటంతో, అప్పటికే కొద్దో గొప్పో పురోగతి ఉండటంతో, అదే విధానాన్ని కొనసాగించడం ద్వారా త్వరితగతిన ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయాలని నాటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది.
దేశంలో ఇప్పటి వరకు మరే భారీ సాగునీటి ప్రాజెక్ట్ పూర్తికానంతా వేగంగా సుమారు 70 శాతం నిర్మాణపు పనులు రికార్డు సమయంలో పూర్తయ్యాయి. అయితే నిర్వాసితుల పరిహారం విషయంలో, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ చట్ట ప్రకారం పెరిగిన వ్యయంను భరించే విషయంలో కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కపెడుతూ అవసరమైన నిధులు మంజూరు చేయకుండా ఈ ప్రాజెక్ట్ కు దొంగ దెబ్బ తీయడంతో అనుకున్న విధంగా 2018 నాటికి నిర్మాణపు పనులు పూర్తి కాలేదు.
కనీసం 2020 నాటికి పనులు పూర్తిచేయాలని కృషి చేస్తున్న సమయంలో కాదు 2019 చివరకు పూర్తి చేస్తాం అంటూ 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కాంట్రాక్టుదారులను మార్చడం, డిజైన్ లో మార్పులు తీసుకొచ్చి ప్రాజెక్ట్ ప్రయోజనాలను కుదించే ప్రయత్నం చేయడమే గాని వేగంగా నిర్మాణపు పనులు చేయలేక పోతున్నది. ఇప్పటికి కూడా సవరించిన నిర్మాణవ్యయం ప్రకారం కేంద్రం నుండి నిధులు రాబట్టలేక అపోతున్నది.
ఇంతలో 2024 ఎన్నికల నాటికైనా ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో తేల్చి చెప్పడం తెలుగు ప్రజలకు అశనిపాతంగా మారింది. మార్చి 2024 నాటికి పోలవరం పూర్తి చేయాలనుకున్నామని.. అయితే 2020, 2022లో వచ్చిన భారీ వరదల కారణంగా మరింత జాప్యం జరుగుతుందని కేంద్రం లోక్‌సభలో వెల్లడించింది.
కాగా.. సవరించిన పోలవరం అంచనాల ఆమోదంపై కేంద్రం ఎటూ తేల్చేక పోవడం గమనార్హం. రూ.484 కోట్లు మాత్రమే ఏపీకి రీయింబర్స్‌మెంట్ చేయాలని కేంద్రం పేర్కొంది. లోక్‌సభలో ఎంపీలు కేశినేని నాని, కృష్ణదేవరాయ, కోటగిరి శ్రీధర్ ప్రశ్నకు కేంద్ర జలశక్తిశాఖ సహాయ మంత్రి భిశ్వేశ్వర్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. అంటే ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేసే ఉద్దేశ్యం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమాత్రం లేదని స్పష్టం అవుతుంది.