మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను అతిచేయడం కారణంగా, నిబంధనలన్నింటినీ ఉల్లంఘించి ర్యాలీ నిర్వహించిన కారణంగా.. తన అభిమాని అయిన దళితుడు చీలి సింగయ్యను బలితీసుకున్న కేసు ఇప్పుడు పెద్ద మలుపు తీసుకుంది. ఈ విషయంలో కారు డ్రైవరుతో పాటు అదే కారులో ప్రయాణిస్తున్న జగన్ ను ఏ2 నిందితుడిగా చేరుస్తూ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే.. జగన్ సహా ఇతర నిందితులందరూ కూడా తమ మీద కేసును కొట్టేయాలని, క్వాష్ చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా హైకోర్టు జగన్ మీద తదుపరి చర్యలు తీసుకోకుండా, ప్రస్తుతానికి స్టే విధించింది. అయితే ఇక్కడ గమనించాల్సినది ఏంటంటే.. తన మీద నమోదు చేసిన కేసులను పూర్తిగా కొట్టేయాలంటూ ఏ కోరికతో అయితే జగన్ కోర్టును ఆశ్రయించారో ఆ కోరిక మాత్రం తీరనేలేదు. కేవలం స్టే మాత్రమే విధించారు. అక్కడికే.. తాము మహాద్భుత విజయం సాధించినట్టుగా.. వైఎస్సార్ కాంగ్రెస్ దళాలు, జగన్ భజన బృందాలు పండగ చేసుకుంటున్నాయి.
తాను ప్రయాణిస్తున్న కారు కింద దళితుడైన వృద్ధుడు చక్రం కింద పడిపోతే.. కారు ఆపకుండా.. కొంతదూరం అలాగే కారుచక్రంతో పాటు ఈడ్చుకుపోయిన దుర్మార్గం ఆనాడు జరిగింది. మరణావస్థలో ఉన్న వృద్ధుడిని కార్యకర్తలు ఈడ్చి రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు. కారులో ప్రయాణిస్తున్న జగన్ కు తెలియకుండానే.. కారు ఆపించి.. వృద్ధుడిని పక్కకు లాగిపడేయడం జరుగుతుందా? కనీసం జగన్ మోహన్ రెడ్డి.. గాయపడిన వృద్ధుడిని ఆస్పత్రికి పంపడం గురించి అయినా పట్టించుకున్నారా? అప్పటికప్పుడు.. అదే సమయంలో ఆస్పత్రికి పంపే ఏర్పాట్లయినా చేశారా? అంటే అదేమీ జరగలేదు.
పోలీసులు కేసులు నమోదు చేసిన తర్వాత.. వాహనంలో ప్రయాణించిన అందరి మీదా కేసులు పెడతారా? ఇది ఎలా కరెక్టు? అని మాత్రమే కోర్టు ప్రశ్నించింది. ఇప్పుడు విచారణను నిలిపివేస్తూ, స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అంతమాత్రాన జగన్ కు పూర్తి స్థాయిలో ఊరట లభించినట్టు కూడా కాదు. ఎందుకంటే.. ఇది కేవలం ఒక కేసు మాత్రమే. కారులో ప్రయాణిస్తున్నందువలన.. తాను సింగయ్య మృతికి కారణమైనట్లుగా చెప్పడం కరెక్టు కాదని జగన్ వాదించగలరు. కానీ.. అసలు కేసులు ఇంకా చాలా ఉన్నాయి.
పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించడం.. కారులోంచి బయటకు నిల్చుని.. కార్యకర్తలకు షేక్ హ్యాండ్ లు ఇవ్వడానికి ప్రయత్నిస్తూ అందరూ ఎగబడేలా, తద్వారా తొక్కిసలాట జరిగేలా కారణం కావడం చాలా పెద్ద నేరాలు. నిబంధనల ఉల్లంఘన ఒక ఎత్తు అయితే.. దానివల్ల తొక్కిసలాట జరగడం చాలా తీవ్రమైనది. జరిగిన తొక్కిసలాటకు, ఆ రకంగా సింగయ్య తన కారు కింద పడిపోవడానికి తాను కారణం కాదని జగన్ ఎలా చెప్పగలరు? అందుకే.. ఈ స్టేతో మురిసిపోతే కుదరదని.. మొసళ్ల పండుగ ముందున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
జగన్ కోరిక తీరలేదు.. కోర్టు చెప్పినది స్టే మాత్రమే!
Friday, December 5, 2025
