పోలింగ్ కు ముందు జరగవలసిన ప్రక్రియలలో ఆఖరి ఘట్టానికి ఎన్నికలు చేరుకున్నాయి. ప్రచారం కూడా మరొక రోజులో ముగిసిపోనుంది. ఇక నాయకులు డబ్బు సంచులు ఇనప్పెట్టేల్లో నుంచి బయటకు తీయడం.. ఓటర్లకు పంచిపెట్టడం అనే లాంఛనం మాత్రమే మిగిలింది. అయితే ఈ కీలక సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక క్లిష్ట సమస్య ఎదురవుతోంది. ఈ ప్రచార పర్వం ముగిసే సమయానికి.. తమకు అంతగా విజయవకాశాలు లేవని భావిస్తున్న చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓట్ల కోసం పంచి పెట్టడానికి తమ డబ్బు మూటలను బయటకు తీయకుండా జాగ్రత్త పడుతున్నారు. జగన్ వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకున్నటువంటి నిఘా వర్గాలు అలాంటి నియోజకవర్గాల గురించి ఆయనకు సమాచారం అందిస్తున్నాయి. డబ్బు ఖర్చు పెట్టడానికి వెనకాడుతున్న అభ్యర్థుల మీద జగన్మోహన్ రెడ్డి ఉగ్రతాండవం చేస్తున్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది.
జగన్మోహన్ రెడ్డి టికెట్లు కేటాయించే సందర్భంలోనే ప్రతి ఒక్కరికి కూడా 20 నుంచి 50 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుందని హెచ్చరించి, అందుకు అంగీకరించిన వారిని మాత్రమే అభ్యర్థులుగా ఎంపిక చేసినట్లు అప్పట్లో గుసగుసలు వినిపించాయి. ధన వనరులపరంగా నమ్మలేని అభ్యర్థులను ముందుగానే 20 కోట్ల రూపాయలు పార్టీ వద్ద డిపాజిట్ చేసి టికెట్ పుచ్చుకోవాలని ఆంక్షలు పెట్టినట్లుగా కూడా అప్పట్లో పుకార్లు వచ్చాయి. మొత్తానికి టికెట్ దక్కించుకున్న అధికార పార్టీ అభ్యర్థి ప్రతి ఒక్కరూ కూడా భారీగా డబ్బు ఖర్చు పెట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేసిన వారే!
నిజానికి జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తారని.. పెట్టిన ప్రతి రూపాయికి భారీ మొత్తంలో వడ్డీలతో సహా తిరిగి వసూలు చేసుకోవచ్చని ఆశతోనే అభ్యర్థులు సిద్ధపడ్డారు. కానీ కాయ క్షేత్రంలోకి దిగి ప్రజలలో తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తూ ముందుకు వెళ్లిన తర్వాత మాత్రమే వారికి క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలు నెమ్మదిగా బోధపడసాగాయి. గెలుపు అంత ఈజీ కాదని, జగన్ ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత ఉన్నదని వారికి అర్థం కాసాగింది. కొన్ని నియోజకవర్గాలలో అయితే ఎంత డబ్బు ఖర్చుపెట్టినా సరే బూడిదలో పోసిన పన్నీరు అవుతుందే తప్ప గెలిచేది అసాధ్యమని కూడా అభ్యర్థులకు అర్థమైంది. అలాంటివారు అసలు ఓట్ల కోసం పంచిపెట్టడానికి నిధులు లేవని చెబుతున్నారు. ఈ పరిస్థితి పార్టీ పెద్దలకు కంటగింపుగా ఉంది. డబ్బుకు ఢోకా లేకుండా ఖర్చు పెట్టుకుంటారనే ఉద్దేశంతో టికెట్లు ఇస్తే.. కీలకమైన సమయంలో ఇలాంటి నాటకాలు మొత్తంగా పార్టీనే ముంచుతాయని జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అలాగే ఆ అభ్యర్థుల మీద ఉగ్రతాండవం ఆడుతున్నారని కూడా తెలుస్తోంది. మరి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్న మాటే నిజమైతే గనుక డబ్బు పంచినంత మాత్రాన వైసీపీ అభ్యర్థులు ఎలా గెలుస్తారు అనే చర్చ ప్రజలలో వినిపిస్తోంది.
డబ్బు సంచులు తీయకుంటే జగన్ ఉగ్రతాండవం!
Monday, October 14, 2024