భారతీయ జనతా పార్టీ తన పట్ల తమలపాకుతో రెండు వడ్డించినట్లుగా సుతిమెత్తగా విమర్శలతో సరిపెట్టుకుంటుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి భావించినట్టుగా ఉన్నారు. కేంద్రంలోని భాజపా సర్కారు కీలక బిల్లుల విషయంలో అమిత్ షా ఫోను చేసినప్పుడెల్లా తమ పార్టీ తరఫున వారికి సంపూర్ణ మద్దతు ఉభయసభల్లో ఇచ్చాం కదా.. మోడీ ఎదురుపడిన ప్రతి సందర్భంలోనూ ఆయన పాదాలకు నమస్కరిస్తున్నాం కదా.. మన పట్ల ఎన్నికల సమరాంగణంలో కూడా ప్రేమగానే ఉంటారని తలపోసినట్లున్నారు. కానీ.. రాష్ట్రంలో కూటమి ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షా లదూకుడు, తన పాలనపై వారి విమర్శలు చూసి ఆయనలో కంగారు మొదలైంది. విపరీతమైన ఫ్రస్ట్రేషన్ కు గురవుతున్నట్టున్నారు. ఆ ఫ్రస్ట్రేషన్ లో ఆయన చేస్తున్న అతిపెద్ద పొరబాటు.. ప్రత్యేకహోదా అని కుంటిసాకును చూపి.. భారతీయ జనతా పార్టీని, అమిత్ షాను నిందించాలని ప్రయత్నించడం. ఈ ప్రత్యేకహోదా పాట అందుకోవడం.. బిజెపి మీద ప్రజల్లో కోపం పుట్టిస్తుందో లేదో గానీ.. జగన్ ప్రభుత్వం అయిదేళ్ల పాటు ప్రదర్శించిన అలసత్వాన్ని, వారి వైఫల్యాన్ని, అవకాశవాదాన్ని ప్రజలకు బాగా గుర్తు చేస్తుంది.
2019 ఎన్నికలకు ముందు జగన్ ప్రత్యేకహోదా పేరుతో చాలా డ్రామాలు ఆడారు. తన పార్టీకి చెందిన లోక్ సభ ఎంపీలతో మాత్రం.. పదవీకాలం ముగిసిపోవడానికి కొన్ని నెలల ముందు, ఎటూ ఖచ్చితంగా ఉప ఎన్నికలు రావు అని అర్థమైన తరువాతే రాజీనామాలు చేయించారు. అదే సమయంలో రాజ్యసభ ఎంపీలతో మాత్రం రాజీనామా చేయించలేదు. ఆ రాజీనామా డ్రామాలను ఆయన త్యాగాలుగా అభివర్ణించారు. హోదా తీసుకురాలేదని చంద్రబాబు మీద నిందలు వేశారు. ఇలాంటి చాలా ప్రహసనం నడిపించారు. 2019లో ఆయన ప్రభుత్వం ఏర్పడింది. అప్పటినుంచి ఈ అయిదేళ్లలో అనేక పర్యాయాలు ఆయన ఢిల్లీ యాత్ర సాగించారు. అనేక సార్లు మోదీ, అమిత్ షా ల అపాయింట్మెంట్ దొరకకుండా.. రోజుల తరబడి అక్కడ నిరీక్షించి ఉత్తచేతులతో తిరిగివచ్చారు. దొరికినప్పుడు.. తన సీబీఐ కేసుల గురించి.. వివేకా హత్య సీబీఐ కేసుల గురించి మాత్రమే మాట్లాడి.. సేఫ్టీ చూసుకుని వచ్చేశారనే విమర్శలను ఎదుర్కొన్నారు. ప్రతిసారీ.. ప్రత్యేకహోదా అడిగినట్టుగా, పోలవరం నిధులు అడిగినట్టుగా ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. ప్రత్యేకహోదా విషయంలో ఏం అడిగారో, వారు ఏం చెప్పారో.. ఏ ఒక్క సందర్భంలోనైనా ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు చెప్పవలసిన బాధ్యత ఉందని జగన్ అనుకోలేదు.
అలాంటిది ఇప్పుడు అమిత్ షా రాష్ట్రానికి వచ్చి వైఎస్సార్ సీపీ గూండా రాజ్యాన్ని, లిక్కర్ మాఫియాను అంతం చేస్తామని హెచ్చరించగానే.. జగన్ కు ప్రత్యేకహోదా గుర్తుకు వచ్చింది. అమిత్ షా రాష్ట్రానికి వస్తే ప్రత్యేకహోదా గురించి మాట్లాడాలని ప్రజలు కోరుకుంటున్నట్టుగా జగన్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అయిదేళ్ల పాటూ ఆ మాట ఎత్తడానికి కూడా భయపడిన జగన్మోహన్ రెడ్డి, ఎన్నికల సమయంలో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నందుకు బిజెపిని నిందించడానికి హోదా మాటెత్తడం అనేది ఆయనలోని నిలువెత్తు అవకాశవాదం అని ప్రజలు ఛీత్కరించుకుంటున్నారు.
ప్రత్యేకహోదా పాట.. జగన్ చేసే అతిపెద్ద వంచన!
Wednesday, September 18, 2024