అమరావతి రైతులు అరసవిల్లి వరకు చేపట్టిన పాదయాత్ర పూర్తయింది. రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉండడంలో గల లాభాలను, రాష్ట్రానికి దక్కే గౌరవాన్ని ఐకాస ప్రతినిధులు అక్కడి అరసవిల్లి సూర్యనారాయణస్వామి సాక్షిగా ప్రజలకు వివరించారు. అమరావతి ఎదుగుదలను అడ్డుకుని, మూడు రాజధానుల పేరుతో నాటకాలాడుతూ, అసలు రాష్ట్రానికి రాజధానే లేకుండా చేసిన కుట్రలను కూడా వివరించారు. అయితే ఉత్తరాంధ్ర నడిబొడ్డున అరసవిల్లి లో ఐకాస ప్రతినిధులు వినిపింపజేసిన అమరావతి నినాదాల ప్రతిధ్వనులు పాలకులకు వినిపించాయో లేదో మరి.
అమరావతి రాజధాని డిమాండ్ తో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు అమరావతి రైతులు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో అమరావతి నుంచి తిరుమల వరకు పాదయాత్ర నిర్వహించారు. మధ్యలో అక్కడక్కడా స్థానికులు సహకరించకుండా, వారికి వసతి ఏర్పాట్లు భోజన ఏర్పాట్లకు కూడా ఆటంకాలు కలిగిస్తూ వైసీపీ శ్రేణులు ఇబ్బందులు సృష్టించినప్పటికీ.. వారు సక్సెస్ ఫుల్ గా యాత్ర పూర్తిచేశారు. ఆ తర్వాత అమరావతి రాజధానికి అనుకూలంగా హైకోర్టు తీర్పు కూడా వచ్చింది. ప్రభుత్వమే మూడు రాజధానుల బిల్లును వెనక్కు తీసుకుంది. అయితే అమరావతి అభివృద్ధి మీద మాత్రం దృష్టి సారించకుండా వేధింపులు కొనసాగిస్తోంది.
ఈ నేపథ్యంలో అమరావతి రైతులు.. ఉత్తరాంధ్రలోని అరసవిల్లికి పాదయాత్ర నిర్వహించారు. అమరావతి రాజధానిని నట్టేట ముంచేసి విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ రాజధాని అనే మాయమాటలు చెప్పడం ద్వారా.. ఏ ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం బుకాయిస్తున్నాదో.. దాని గురించి అక్కడి ప్రజల్లోనే చైతన్యం తీసుకురావడానికి అమరావతి రైతులు అరసవిల్లికే పాదయాత్ర సంకల్పించారు. అయితే యాత్ర ప్రారంభం అయిన నాటినుంచి ప్రతిచోటా వైసీపీ దళాలు అడ్డుపడడం, గొడవలు సృష్టించడం, ఉద్రిక్తతలు సృష్టించడం రివాజుగా మారిపోయింది. ఈ నేపథ్యంలో యాత్ర ఆగింది. పోలీసులు ధిక్కరించినా హైకోర్టు అనుమతితో జరుగుతున్న యాత్ర కావడంతో పోలీసులు ఇంచుమించుగా సహాయనిరాకరణ చేశారు. మొత్తానికి యాత్ర ఆగింది. కొన్నాళ్ల తర్వాత తిరిగి ప్రారంభం అయింది.
అమరావతి ఐకాస కోకన్వీనర్ గద్దె తిరుపతి రావు పాదయాత్ర కొనసాగించారు. ఆయన అరసవిల్లి చేరుకుని అక్కడి సూర్యనారాయణ స్వామికి పూజలు చేసి, అమరావతి రాజధానికోసం రైతులు పొలాలు ఇచ్చి చేసిన త్యాగాలను వివరించారు. అమరావతిలో రాజధాని ఉండడంవల్ల రాష్ట్రానికి జరిగే మేలు గురించి వివరించారు. అయితే ప్రజలనుంచి యాత్రకు ఎలాంటి ప్రతిఘటన లేకపోవడం గమనార్హం. మరి ఈ వైనం పాలకులకు కనిపిస్తోందో లేదో తెలియదు.
అరసవిల్లిలో అమరావతి ప్రతిధ్వనులు.. హెచ్చరికలే!
Tuesday, December 24, 2024