పొదిగే పిట్టకు తెలీకుండా గుడ్డును కొట్టేసే ఘనులు!

Wednesday, November 27, 2024

ముందుగా ఒక కథ చెప్పుకుందాం..

అనగనగా ఇద్దరు దొంగలున్నారు. వారిలో ఎవరు గొప్ప దొంగ అనే పోటీ ఏర్పడింది. సవాలు చేసిన దొంగ.. ఓ పెద్ద చెట్టు ఎక్కి.. చెట్టు కొమ్మ మీద గూడు కట్టుకుని అందులో గుడ్లు పెట్టి వాటిమీద కూర్చుని పొదుగుతున్న పిట్టకు తెలియకుండా ఆ గుడ్లను దొంగిలించి తీసుకు వస్తానని పందెం కట్టాడు. ఆ మేరకు చెట్టెక్కి గుడ్లు తీసుకుని వాటిని జేబులో వేసుకుని దిగివచ్చాడు. తీరా కిందికి వచ్చాక రెండో దొంగకు చూపించడానికి జేబులో చేయిపెట్టి గుడ్లు తీయబోతే అవి కనిపించలేదు. నివ్వెరపోయాడు. తీరా రెండో దొంగ.. తన జేబులోంచి వాటిని తీసి అతడికి చూపించాడు. తానే బెస్ట్ దొంగని అని నిరూపించుకున్నాడు. అంటే.. మొదటి దొంగ పొదిగే పిట్టకు తెలియకుండా గుడ్లు దొంగిలిస్తే.. రెండో దొంగ, మొదటి దొంగకు తెలియకుండా వాడి జేబులోంచే కొట్టేశాడన్నమాట…. ఈకథలోని తీరుగా కనిపిస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలన సాగిస్తున్న తీరు. ఒక డిపార్టుమెంటుకే తెలియకుండా.. ఆ డిపార్టుమెంటు ఆస్తులను కొట్టేసే దందాలు అధికారపార్టీ వారు విచ్చలవిడిగా కొనసాగిస్తుండడం విశేషం.

వివరాల్లోకి వెళితే..

కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత.. బాపట్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం కట్టేయాలని అనుకున్నారు. నగరం నడిబొడ్డులో విశాలంగా ఉన్న రెండెకరాల ఖాళీజాగాపై వారి కన్ను పడింది. కోట్లు విలువ చేసే జాగా అది. అక్కడ తమ పార్టీ ఆఫీసు పెడితే దివ్యంగా ఉంటుందని అనుకున్నారు. కానీ అది ఆర్టీసీ భూమి. అంతగా మనసుపడితే.. ఏ వేలం పాటకో వెళ్లి.. ఆర్టీసీనుంచి ఆ భూమిని కొనుక్కోవచ్చు. కానీ అధికారం తమ చేతిలో ఉన్నప్పుడు.. అంతగా నియమానుసారంగా వెళ్లాల్సిన అవసరం ఏముందని వారు రెచ్చిపోయారు. అడ్డగోలుగా దోచుకుంటే మాత్రం తమను నిలదీసేవారు ఎవరుంటారని వారు రెచ్చిపోయినట్టున్నారు. అందుకే.. ఆర్టీసికి చెందిన ఆ భూమికి ఏడాదికి వెయ్యిరూపాయలు అద్దె చెల్లించే విధంగా ఉత్తర్వులు పుట్టించారు. రెవెన్యూ శాఖ ద్వారా జీవో 363 ద్వారా మేనెల 18వ తేదీనే ఈ మేరకు ఉత్తర్వులు తయారయ్యాయి. ఈ మొత్తం ఎపిసోడ్ లో ట్విస్టు ఏంటంటే.. ఇలాంటి ఉత్తర్వులు తయారైన సంగతి అసలు స్థలం యజమాని అయిన ఆర్టీసీ శాఖకు తెలియనే తెలియదు. 

తాజాగా వైసీపీ నాయకులు ఇక్కడ జిల్లా కార్యాలయానికి శంకుస్థాపన చేయడానికి పూనుకున్నప్పుడు గానీ.. లోకల్ ఆర్టీసీ వారికి తమ స్థలం వైసీపీ పరం అయిపోతోందని అర్థం కాలేదు. వారు వెళ్లి.. అప్పటికే అక్కడకు చేరుకున్న వైసీపీ పెద్దలకు తమ గోడు మొరపెట్టుకున్నారు. ప్రభుత్వం జీవో రూపంలో ఇచ్చిన ఉత్తర్వులను వారు చూపించారు. చేసేది లేక.. వెళ్లి పోలీసులకు, తహసీల్దారుకు ఫిర్యాదులు ఇచ్చి ఆర్టీసీ అధికారులు వెనుతిరిగారు. 

ప్రభుత్వ శాఖలే అయినప్పటికీ.. ఆర్టీసికి తెలియకుండా వారి స్థలాన్ని కొట్టేయడానికి అధికార పార్టీ స్వయంగా పూనుకోవడం.. పిట్టకు తెలియకుండా గుడ్లు కొట్టేసే తీరుగానే కనిపిస్తోంది. కోట్లు విలువ చేసే స్థలానికి ఏడాదికి వెయ్యిరూపాయల అద్దె పేరుతో అడ్డగోలుగా దోచుకోవడానికి తెగబడడం పలు విమర్శలకు దారితీస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles