బిజెపి చేజారిపోతుందని వైసీపీ దళాల కంగారు

Wednesday, April 24, 2024

పవన్ కల్యాణ్ మాటలను గమనిస్తే.. ఈసారి ఎన్నికల్లో జగన్ సర్కారును పతనం చేయడానికి ఆయన చాలా పట్టుదలతో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వను అనే తన ఎజెండా అంశాన్ని ఆయన తొలిరోజునుంచి చెబుతూ వస్తున్నారు. వ్యతిరేక ఓటు చీలకపోవడం అంటే.. ప్రస్తుతం బిజెపితో పొత్తుల్లో ఉన్న పవన్ కల్యాణ్ వారితో కలిసి.. చంద్రబాబునాయుడును కూడా జట్టులో కలుపుకోవాలి. ఇండైరక్టుగా పవన్ ఈ విషయాన్ని సూచించారు కూడా. 2014లో మేం ముగ్గురం కలిసి పోటీచేసినప్పుడు జగన్ నెగ్గలేకపోయారు.. అని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు అదే స్ట్రాటజీని ఆయన రిపీట్ చేయాలని చూస్తున్నారు. సరిగ్గా ఈ అంశం దగ్గరే వైసీపీ దళాలకు కంగారు పుడుతున్నట్టుగా కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ తమ పట్టులోంచి జారిపోతుందని వైసీపీ దళాలు కంగారు పడుతున్నట్టుగా తెలుస్తోంది.
భారతీయ జనతా పార్టీలోని కొందరు కీలక నాయకులకు జగన్ తోను, వైసీపీ ఇతర సీనియర్లతోను కుమ్మక్కు అయి రాజకీయం నడిపిస్తున్నారనే పుకార్లు చాలా కాలంనుంచి ఉన్నాయి. తిరుపతిలో అమిత్ షా పార్టీ సమావేశం నిర్వహించినప్పుడు కూడా.. ఎవరెవరు జగన్ తో కుమ్మక్కయి ఉన్నారో తనకు తెలుసునంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సహా మరికొందరు నాయకుల్ని ఉద్దేశించి ఆ మాటలు అన్నట్టుగా అప్పట్టో ప్రచారం జరిగింది. తీరా ఇప్పుడు పవన్ కల్యాణ్ మాటల్లో పట్టుదల చూస్తే.. జగన్ ను ఓడించడానికి మోడీతో మంతనాలు జరిపి.. ఖచ్చితంగా మూడు పార్టీల కూటమిని మళ్లీ సాకారం చేస్తారేమో అని వైసీపీ వారు కంగారు పడుతున్నారు.
నిజానికి వైసీపీ కోరిక ఇంకో రకంగా ఉంది. పవన్ కల్యాణ్ బిజెపితో బంధం నుంచి బయటకు వచ్చి చంద్రబాబు జతకట్టాలనేది వారి కోరిక అలా జరిగితే.. పవన్ దత్తపుత్రుడు అనే ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయవచ్చునని, బిజెపి కూడా రాష్ట్రమంతా పోటీచేసేలా ప్రేరేపిస్తే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు భారీగా చీలుతుందని.. తాము తిరిగి గద్దె ఎక్కుతాం అని వారు లెక్కలు వేసుకుంటున్నారు. అయితే.. పవన్ కల్యాణ్ పట్టుదలగా మూడు పార్టీల కూటమిని తీసుకువస్తే గనుక.. ఆ పప్పులు ఉడకవనేది వారి భయం. అందుకే పవన్ కల్యాణ్ మీద వ్యక్తిగత నిందలకు దిగుతున్నారు. పవన్ రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో సొంతంగా పోటీచేస్తున్నారో లేదో చెప్పాలని అర్థం పర్థంలేని విమర్శలు చేస్తున్నారు. నేను పొత్తుల్లో మాత్రమే ఉంటా.. అందరం కలిసి పోటీచేస్తాం అని పవన్ అంటోంటే.. పవన్ కు క్లారిటీ లేదని, అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీచేస్తాడో లేదోనని వైసీపీ సందేహాలు వెలిబుచ్చడం చాలా కామెడీగా అనిపిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి సమైక్యగీతం ఆలపిస్తూ పవన్ కల్యాణ్.. అధికార పార్టీలో గుబులు పుట్టిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles