రేవంత్ పై యుద్ధం ప్రకటించిన సీనియర్లు 

Saturday, January 18, 2025

ఏఐసీసీ నియమించిన తెలంగాణ పార్టీ కమిటీలతో చెలరేగిన సంక్షోభం తీవ్ర రూపం దాల్చి  ఏకంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై బహిరంగంగా యుద్ధం ప్రకటించేందుకు దారితీసింది.  పార్టీలో వలస వచ్చిన వాళ్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తూ  రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు ప్రకటించారు. పార్టీ అధిష్ఠానం వద్దకు వెళ్లి నాయకత్వ మార్పుకు పట్టుబట్టాలని నిర్ణయించారు. 

టీవల హైకమాండ్ ప్రకటించిన కమిటీల అంశం ఓ కొలిక్కి వచ్చే వరకు పీసీసీ చీఫ్ కార్యక్రమాలకు, సమావేశాలకు మూకుమ్మడిగా దూరం ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం జరిగే రేపటి ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశానికి కూడా దూరంగానే ఉంటామని స్పష్టం చేశారు. 

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇంట్లో శనివారం సమావేశమై పార్టీని కాపాడేందుకు `సేవ్ కాంగ్రెస్’ నినాదంతో ముందుకు సాగుదామని నిర్ణయించారు. సీనియర్లపై కోవర్టులనే ముద్ర వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసలైన ఒరిజినల్ తామే అని స్పష్టం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహా ప్రకటించారు.  

కమిటీల్లోని 108 మందిలో 58 మంది తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్లే ఉన్నారని కాంగ్రెస్ ఎంపీ, మాజీ పిసిసి చీఫ్  ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. నాలుగు పార్టీలు మారి వచ్చిన వ్యక్తి పార్టీని ఉద్దరిస్తాడా? అని ప్రశ్నించారు. 

‘‘తీన్మార్ మల్లన్న ఓ పోస్ట్ పెట్టాడు. పాత నాయకులను కోవర్టులుగా ముద్ర వేస్తున్నారు. ఆయనెవరు? సోషల్ మీడియాలో పేర్లు ఎందుకు పెట్టాలి?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
భట్టి విక్రమార్క నివాసంలో భేటీ అయిన నాయకులలో ప్రేమ్ సాగర్ రావు, జగ్గారెడ్డి, మధుయాష్కీ, కోదండరెడ్డి, మహేశ్వర్ రెడ్డి, కోదండరెడ్డి కూడా ఉన్నారు. 

కాంగ్రెస్ పార్టీని వేరే వాళ్లకు అప్పజెప్పే ప్రయత్నం జరుగుతోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. పార్టీని నమ్ముకొని పని చేసిన వారికి కమిటీల్లో అవకాశం రాలేదని విమర్శించారు. 

కాంగ్రెస్ పార్టీని నాశనం చేసే కుట్ర జరుగుతోందని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ హెచ్చరించారు. క్యారెక్టర్ లేనివాళ్లు పార్టీని నడిపిస్తున్నారని పేరొక్నటు తమను ప్రశ్నించే స్థాయి వారికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వలస వచ్చినోళ్లకు, కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ రోజు పంచాయితీ వచ్చిందని చెబుతూ ఇదంతా పార్టీని నాశనం చేసే ప్రయత్నమేనని ఆరోపించారు. 

సోషల్ మీడియాలో తమపై  తప్పుడు ప్రచారాలు జరుగుతున్నా వలస నాయకుడు కనీసం ఖండించడం లేదని  ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు.  మరోవైపు సీనియర్లంతా సమావేశంలో ఉండగానే ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫోన్ చేసి `మీరు ఏ నిర్ణయం తీసుకున్న మీ వెంటే నడుస్తా’నని ప్రకటించారు. 

ఇప్పటికే మర్రి శశిధర్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వంటి ప్రముఖ నేతలంతా బీజేపీలో చేరగా, తాజాగా ప్రధాని మోదీతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమావేశమయ్యారు. త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని వెల్లడించారు. అధిష్టానం జాగ్రత్త పడకపోతే తెలంగాణ లో కాంగ్రెస్ ప్రముఖ నేతలంతా బిజెపి మార్గం పెడతారనే హెచ్చరిక కూడా ఈ సందర్భంగా పరోక్షంగా చేసినట్లయింది. 

ఎమ్యెల్యేల కొనుగోలు కేసులో ప్రముఖ బీజేపీ నాయకుల పేర్లు రావడంతో, ప్రస్తుతంకు టీఆర్ఎస్ నేతలను ఆకర్షించడం పట్ల  బీజేపీ దృష్టి సారించడం లేదు. కేవలం కాంగ్రెస్ నేతలకే గాలం వేస్తున్నది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles