తెలంగాణ బీజేపీలో కోవర్టుల దుమారం!

Thursday, March 28, 2024

తెలంగాణాలో ఎట్లాగైనా అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్న బిజెపి నేతలలో ఎవ్వరిని నమ్మాలో, ఎవ్వరిని నమ్మకూడాతో తెలియక అధిష్టానం తికమక పడుతున్నది. ఇటీవల జరిగిన ఎమ్యెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఈ సమాచారాన్ని కేసీఆర్ ప్రభుత్వంకు ఏవిధంగా లీక్ అయిందనే విషయమై ఇంకా ఓ నిర్ధారణకు రాలేక పోతున్నారు. బీజేపీలోని వారే లీక్ చేసిన్నట్లు మాత్రం స్పష్టం అవుతున్నది. 

తాజాగా, టీఆర్ఎస్ ప్రభుత్వం  బీజేపీ నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేయిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ‘‘బీజేపీ నేతలు, పార్టీతో ముడిపడిన విషయాలన్నీ.. మన పార్టీ నేతల కంటే ముందే టీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలిసిపోతున్నాయి’’ అని రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ, పదాధికారుల సమావేశంలో ఆయన పేర్కొనడం గమనార్హం.

 అందుకనే బీజేపీ నాయకులంతా ఇప్పుడున్న పాత ఫోన్ల స్థానంలో కొత్త ఐఫోన్లు తీసుకోవాలని ఆయన సూచించారు. ఫోన్ ట్యాప్పింగ్ సంగతి ఏమో గాని, పార్టీలో కీలక నాయకుల నుండే అంతర్గత సమాచారం కేసీఆర్ ప్రభుత్వంకు చేరుతున్నట్లు స్పష్టం అవుతున్నది. 

ఎమ్యెల్యేల కొనుగోలు కేసు వచ్చిన్నప్పుడు మొదట్లో అంతకు ముందు తిరిగి టిఆర్ఎస్ గూటికి వెళ్లిన మాజీ శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ ద్వారా లీక్ అయుండవచ్చని అనుకున్నారు. ఎందుకనే ఆయన అప్పుడు రాష్ట్ర బిజెపి చేరికల కమిటీలో సభ్యుడు. 

అయితే ఆ తర్వాత కూడా మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి కీలక సమాచారం ఎప్పటికప్పుడు టిఆర్ఎస్ నేతలు చేరుతూ ఉండడాన్ని గమనించారు. ముఖ్యంగా బిజెపి పంపిన డబ్బు కోట్ల రూపాయలలో పోలీసులకు పట్టుబడింది. పోలీసులు అన్ని వాహనాలను తనిఖీ చేస్తుండగా, యాదృచికంగా పట్టుకోవడం కాకుండా, ముందే అనుకున్న సమాచారం ప్రకారం నంబర్లు చూసి వాహనాలను ఆపి తనిఖీ చేశారు. 

“ఏ కారులో ఎంత డబ్బు వస్తుందో మాకు ముందుగానే సమాచారం అందుతున్నది. అందుకనే మేము తేలికగా పట్టుకోగలిగాము” అంటూ ఓ పోలీస్ అధికారి చెప్పారు. అంటే బీజేపీలో కీలకమైన నాయకులలో కేసీఆర్ కోవర్టులు ఉన్నారని స్పష్టం అవుతున్నది.  

పలువురు సీనియర్ బిజెపి నాయకులకు కేసీఆర్ తో పరోక్షంగా సంబంధాలు ఉన్నాయని, వీరి మధ్య కొందరు కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు మధ్యవర్తులుగా ఉన్నారని తెలుస్తున్నది. అందుకనే కేసీఆర్ పై మీడియా సమావేశాలలో నిప్పులు గక్కుతున్నా ఆచరణలో ఆయనకు ఇబ్బంది కలిగే చర్యలు ఏవీ తీసుకోవడం లేదని భావిస్తున్నారు. 

తెలంగాణ బీజేపీలో కేసీఆర్ కోవర్టుల గురించి అమిత్ షా, జెపి నడ్డా వంటి వారి దృష్టికి కూడా వెళ్లినట్లు తెలుస్తున్నది. ఈ విషయమై కేంద్ర నిఘా సంస్థలు సహితం కూపీ లాగే ప్రయత్నం చేస్తున్నాయి.  టిఆర్ఎస్ నుండి బీజేపీలో చేరిన నాయకులపైననే కాకుండా కేసీఆర్ కు సన్నిహితులైన కాంట్రాక్టులు, పారిశ్రామిక వేత్తలతో ఆర్ధిక సంబంధాలు గల బిజెపి నాయకులపై నిఘా ఉంచుతున్నట్లు చెబుతున్నారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles