పదవి వచ్చిన తర్వాతనే యాక్టివ్ అయిన బుట్టా!

Thursday, May 2, 2024

పాపం బుట్టా రేణుక! పార్టీల మధ్య అటూ ఇటూ గెంతుతూ బతకడమే అనుకునే బ్యాచ్ నాయకుల్లో బుట్టా రేణుక కూడా ఉంటారు. ఈ గెంతులాటలు ఎలా ఉన్నప్పటికీ.. చాలా కాలంగా సైలెంట్ గా ఉన్న బుట్టా రేణుక.. ఇప్పుడే మళ్లీ తెరమీద కనిపిస్తున్నారు. వార్తల్లోకి వస్తున్నారు. పార్టీలో తనకు పదవి ఇచ్చిన తర్వాత మాత్రమే.. ఆమె అంతో ఇంతో యాక్టివ్ అయ్యారు. పదవి ఉంటే పనిచేస్తా.. పదవి లేకపోతే అసలు పార్టీని పట్టించుకోను అనే తరహా రాజకీయానికి చిరునామాలాగా బుట్టా రేణుక మారుతున్నారు. 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున 2014 కర్నూలు ఎంపీగా గెలిచిన బుట్టా రేణుక.. అప్పట్లో రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి రావడంతో పార్టీ మారారు. మారడం అంటే ఆమె భర్త తెలుగుదేశంలో చేరడమూ.. ఈమె పచ్చ కండువా కప్పుకోకుండా.. ఆ పార్టీ వైఖరికి అనుగుణంగా పనిచేయడమూ జరిగింది. అనర్హత వేటుకు దొరకకుండా పచ్చతీర్థం పుచ్చుకున్నారు. 2019 ఎన్నికల్లో ఆమె చాలా ఆశలు పెట్టుకున్నారు గానీ అవేమీ ఫలించలేదు. దాంతో తిరిగి  మళ్లీ వైసీపీలోకి చేరారు. 

సాధారణంగా తాను అవకాశం ఇచ్చి ఎంపీగా గెలిపిస్తే.. వంచించి తెలుగుదేశంలో చేరిన వారు మళ్లీ ఆ పార్టీ ఓడిపోయాక తన పంచన చేరడానికి వస్తే.. జగన్ అనుమతించడం అనేది కల్ల. ఆ విషయంలో ఆయన చాలా ఖచ్చితంగా ఉంటారు. కానీ, వందల కోట్ల రూపాయల విలువైన విద్యాసంస్థలకు అధిపతి అయిన బుట్టా రేణుకను తిరిగి పార్టీలో చేర్చుకోవడం వెనుక, ఆర్థిక వనరుల పరమైన కారణాలున్నాయని అంటుంటారు. ఆ సంగతి అటుంచితే.. వైసీపీలో పేరుకు చేరారన్నమాటే గానీ.. ఇన్నాళ్లుగా బుట్టా రేణుక ఎక్కడా వార్తల్లో కనిపించలేదు. 

ఎంపీ స్థాయిలో పనిచేసిన నాయకురాలు.. అంతగా సైలెంట్ అయిపోవడం అనేది చాలా చిత్రంగా జరిగింది. పార్టీలో చేర్చుకున్నారే తప్ప తనకు ఎలాంటి పదవులు ఇవ్వనందువల్లనే ఆమె స్తబ్ధంగా ఉండిపోయినట్టుగా, పదవి ఏదైనా ఇస్తే తప్ప పనిచేయనని భీష్మించుకున్నట్టుగా పుకార్లు వచ్చాయి. ఇలాంటి బెదిరింపు ధోరణుల్ని కూడా జగన్ సహించరు గానీ.. బుట్టా రేణుకకు కాస్త సడలింపు ఇచ్చారు. ఆమెను కర్నూలు జిల్లా వైసీపీ మహిళా విభాగానికి అధ్యక్షరాలిని చేశారు. నిజానికి ఎంపీగా చేసిన ఆమెకు ఇది చాలా చిన్న పదవి. అవమానకరమైన పదవి కూడా. కానీ.. ఒకసారి పార్టీ ఫిరాయించిన పాపానికి ఏదో ఒకటి దక్కింది అదే చాలు అనుకున్న రేణుక ఇప్పుడు యాక్టివ్ అవుతున్నారు. మూడురాజధానులకోసం కర్నూలులో జరగనున్న సీమగర్జన సభ కోసం ఆమె కూడా పనిచేస్తున్నారు. మరి ఇప్పుడు పార్టీకోసం పనిచేయడం ప్రారంభించి.. రాబోయే ఏడాదిలో ఏం సాధిస్తారో చూడాలి. 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles