టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన `యువగళం’ పాదయాత్ర సోమవారం 100 రోజులు పూర్తవుతున్న సందర్భంగా క్షేత్రస్థాయిలో 7 కి.మీ. పాదయాత్రతో పాటు పలు కార్యక్రమాలకు టీడీపీ పిలుపు ఇవ్వడంతో ప్రజల దృష్టి అటువైపు నుండి మళ్లించడం కోసం వైసీపీ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడింది.
ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఉంటుంని, ఉమ్మడిగా వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు పోరాడేందుకు సిద్దపడుతున్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న ప్రకటనలతో ఆందోళనలో పడ్డ వైసీపీ నాయకత్వం ప్రజల దృష్టి మళ్లించేందుకు రాజధాని అమరావతి కేసును తెరపైకి తీసుకు వచ్చింది.
లింగమనేనికి కుటుంబ సభ్యుల పేరుతోనే గెస్ట్ హౌస్ కరకట్టపై ఉంది. ప్రతి నెలా గెస్ట్ హౌస్ కు టిడిపి చంద్రబాబు నాయుడు కుటుంబం అద్దె చెల్లిస్తున్నది. అయితే ఇంతవరకు అసలు రూపుదిద్దుకోని ఇన్నర్ రింగ్ రోడ్ పై చర్యలు అంటూ దానిని అటాచ్ చేస్తున్నామని ప్రకటించడం విస్మయం కలిగిస్తోంది.
గతంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణల పేరుతో కక్ష సాధింపు రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్స్‌కు జగన్ ప్రభుత్వం తెరలేపింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, మంత్రిగా నారాయణ ఉన్న సమయంలో తమ పదవులను దుర్వినియోగం చేసి క్విడోప్రోకోకు పాల్పడ్డారని ఏపీ సిఐడి ఆరోపిస్తున్నది.
ఇందులో భాగంగా సీఆర్డీయే మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్‌రోడ్ అలైన్‌మెంట్లలో అవకతవకలకు పాల్పడి బదులుగా కరకట్టపై లింగమనేని గెస్ట్‌హౌస్ పొందారని అభియోగాలు నమోదు చేసింది. వ్యాపారి లింగమనేనికి అనుకూలంగా వ్యవహరించి ప్రతిఫలంగా గెస్ట్‌హౌస్ తీసుకున్నారని చంద్రబాబుపై గతంలో ఆరోపణలు చేశారు.
దీనిపై విచారణ చేపట్టిన సీఐడీ.. క్రిమినల్ లా అమెండమెంట్ 1944 చట్టం ప్రకారం అటాచ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. సీఐడీ సూచనలను పరిశీలించిన జగన్ సర్కార్.. చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్‌హౌస్‌ను అటాచ్ చేస్తూ నోటీసులు జారీ చేసింది.
గతంలో ఇదే గెస్ట్ హౌస్‌ను నదీపరివాహక ప్రాంతంలో ఉందని ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. పక్కనే ఉన్న ప్రజా వేదికను కూల్చివేసింది. నేటి వరకు కనీసం శిధిలాలను కూడా ప్రభుత్వం తొలగించలేదు. లేని, వెయ్యని ఇన్నర్ రింగ్ రోడ్డుపై చర్యలు ఏంటని టీడీపీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వ చర్యలపై కోర్టును ఆశ్రయించాలని టీడీపీ నిర్ణయించింది.
కాగా గతంలో చంద్రబాబు గెస్ట్‌హౌస్‌ను కూల్చేసేందుకు అధికారులు సిద్దమయ్యారు. ఈ మేరకు ఖాళీ చేయాల్సిందిగా ఇంటికి నోటీసులు అంటించారు. వారం రోజుల్లో ఇంటిని ఖాళీ చేయాలని, ఇంటిని కూల్చేస్తామంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇల్లు ఖాళీ చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు.
ఆ సమయంలో చంద్రబాబు గెస్ట్‌హౌస్ పక్కన ఉన్న ఇళ్లను అధికారులు కూల్చేశారు. దీంతో చంద్రబాబు ఇంటిని కూడా కూల్చేసేందుకు సిద్దమవ్వగా ఆ తర్వాత ఎందుకోగానీ వెనక్కి తగ్గారు.