కేసీఆర్ ఏం చెప్పినా జగన్ జై అంటారుగా!

Friday, May 17, 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి, రెండు ముక్కలుగా ఏర్పడి ఇప్పటికి 9 సంవత్సరాలు పూర్తవుతోంది. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకం ఇప్పటిదాకా పూర్తి కాలేదు. కీలకమైన ఢిల్లీ ఆస్తుల పంచాయతీ సహా అనేక అంశాలు ఇప్పటిదాకా ఒక కొలిక్కి రాకుండా.. తెలంగాణ అడ్డుపడుతోంది. చివరికి ఏపీ భవన్ ను కూడా విభజించుకోలేకుండా.. తొమ్మిదేళ్లుగా రెండు ప్రభుత్వాలు ఈసురోమంటూ కాలం గడుపుతున్నాయంటే అందుకు ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్పాలి.
ఉమ్మడి రాష్ట్రానికి ఉన్న సెక్రటేరియేట్ ను ఇరు రాష్ట్రాలు పదేళ్ల పాటు వాడుకోవడానికి విభజన చట్టం అవకాశం కల్పించింది. చంద్రబాబునాయుడు మొత్తం సెక్రటేరియేట్ ను వెలగపూడికి తరలించేసినప్పటికీ కూడా.. ఏపీకోసం కేటాయించిన హైదరాబాదులోని సెక్రటేరియేట్ బ్లాకులు అన్నీ అలాగే ఉండిపోయాయి. వాటిని తెలంగాణ సర్కారుకు అప్పగించలేదు. అన్ని ఆస్తుల పంపకమూ ఒకేసారి తేలాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు వ్యవహరించారు. ఈ సెక్రటేరియట్ వ్యవహారం కేసీఆర్ కు తలనొప్పిగా మారింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సేవలందించిన సెక్రటేరియేట్ లో కూర్చుని పనిచేయడానికి కేసీఆర్ భయపడ్డారు. ఆ సెక్రటేరియేట్ కు వాస్తు బాగాలేదనే ప్రచారమే అందుకు కారణం. అక్కడినుంచి పరిపాలన సాగించిన ముఖ్యమంత్రుల వారసులెవ్వరూ తర్వాత ముఖ్యమంత్రి కాలేకపోయారనే సెంటిమెంటు ప్రబల కారణం. కేసీఆర్ కూడా చాలా మంది ఇతర నాయకుల్లాగానే తన కొడుకు కేటీఆర్ ను వారసుడిగా ముఖ్యమంత్రిని చేయాలని కలగన్నారు. ఆ పాత సెక్రటేరియేట్ చుట్టూ ముసురుకున్న సెంటిమెంటు వలన అది సాధ్యం కాదని ఆయన భయపడ్డారు. అందుకే తెలంగాణ ఏర్పడినప్పటినుంచి ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ.. ఆయన సెక్రటేరియేట్ కు వచ్చిన సందర్భాలను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. కొత్త సెక్రటేరియేట్ కడితే తప్ప అక్కడ పనిచేసే ఉద్దేశం ఆయనకు లేదు. అయితే అప్పటికే ఉన్న పాత భవనాలను కూల్చి కొత్తది కట్టాలంటే.. ఏపీ వారి ఆధీనంలో ఉన్న వాటినన్నిటినీ అప్పగించాలి. అది పదేళ్లపాటు సాధ్యం కాదనే ఉద్దేశంతో.. తొలిసారి సీఎంగా ఉన్న రోజుల్లో కొత్త సెక్రటేరియేట్ కట్టడానికి అనేక ప్రత్యామ్నాయ స్థలాలను చూశారు. వర్కవుట్ కాలేదు. చివరికి జగన్ సీఎం కాగానే.. తన మాట వినే వ్యక్తి గనుక.. లావాదేవీలు ఉన్న వ్యక్తి గనుక.. జగన్ సంతకాలతో పాత సెక్రటేరియేట్ మొత్తం స్వాధీనం చేసుకుని కూల్చివేయగలిగారు. కొత్తది కట్టగలిగారు.
కానీ జగన్.. ఆ సెక్రటేరియేట్ ను అప్పగించడానికి, సమస్త ఆస్తుల పంపకాలను కండిషన్ గా పెట్టి ఉంటే ఎంతో బాగుండేది. అలా చేయకపోవడం వల్ల సమస్యలన్నీ అలాగే ఉన్నాయి.
ఇవాళ ఢిల్లీ ఏపీ భవన్ పంపకాల గురించి అధికారులు ఢిల్లీలో సమావేశమైతే.. మొత్తం ఏపీ భవన్ మాకే ఇచ్చేయండి.. మీకు వేరే స్థలం ఇస్తాం అని తెలంగాణ అధికార్లు బేరం పెట్టారు. మా సీఎం మీరు వేరేచోట ఉండాలని కోరుకుంటున్నారు అని కూడా చెప్పారు. ఏపీ అధికార్లు మాత్రం.. మా సీఎంను అడిగి చెప్తాం అని తిరిగి వచ్చారు. అయినా కేసీఆర్ ఏం చెప్పినా సరే.. అందుకే జగన్ తలాడిస్తారు కదా అనే అభిప్రాయం ఇప్పుడు ప్రజల్లో వ్యక్తం అవుతోంది. జగన్ తన వైఖరి కారణంగా.. ఢిల్లీ ఏపీ భవన్ ను కూడా తెలంగాణకు ధారాదత్తం చేసేస్తారనే అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి. మరి జగన్ ఏం చేస్తారో.. విభజన సమస్యలు అన్నీ తీరేలా మెలిక పెడతారో లేదా.. కేసీఆర్ అడగడమే మహాప్రసాదం అంటూ ఇచ్చేస్తారో చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles