రాజకీయ వ్యూహాలతో తనకెవ్వరు సాటిరారని పలు సందర్భాల్లో నిరూపించుకున్న బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తన ప్రభుత్వం పట్ల ప్రజావ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని గ్రహించి, ఎన్నికల నాటికి ఓటర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ట్రిక్ అమలు చేయడం ప్రారంభించారు. ప్రధాన ప్రతిపక్షాల మధ్య ఓట్ల చీలికే తనకు శ్రీరామరక్షగా ఒక వంక భావిస్తున్నా, దూరమవుతున్న వివిధ వర్గాల ప్రజలకు దగ్గరకు వెళ్లేందుకు భారీ కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఇటీవలనే పార్టీ ప్రధాన బాధ్యులు, శాసనసభా పార్టీతో కలిపి జరిపిన సంయుక్త సమావేశంలో ఎమ్యెల్యేలు అందరూ ఇప్పటినుండే తమ నియోజకవర్గాలకు పరిమితం కావాలని, ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసి ఎల్లప్పుడూ ప్రజలకు దగ్గరగా ఉండాలని ఆదేశం ఇచ్చారు. ఇప్పటికే పలు నియోజకవర్గాలలో ఈ కార్యక్రమం అమలుకు సన్నాహాలు చేస్తున్నారు.
మొదటి దశలో నియోజకవర్గ స్థాయిలో గ్రామ, మండల స్థాయి పార్టీ ముఖ్య కార్యకర్తలను కుటుంబాలతో సహా ఆహ్వానించి అటువంటి సమ్మేళనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమ్మేళనాలలో మంచి విందు, మందులతో పాటు ఓ గిఫ్ట్ బాక్స్ కూడా ఇవ్వనున్నారు. ఆ తర్వాత దశలో మండల లేదా నియోజకవర్గ స్థాయిలో కీలకమైన సామాజిక వర్గాలకు చెందిన ముఖ్యులతో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేయనున్నారు.
ఈ సందర్భంగా దళిత బంధు వంటి ముఖ్యమైన ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను ఆహ్వానించి, ఏవిధంగా ప్రయోజనం పొందుతున్నామో మిగిలినవారికి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమావేశాలకు హాజరయ్యే ప్రజలకు ప్రయాణ చార్జీలు, ఇతర సదుపాయాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఆ విధంగా చేయడం వల్లన మిగిలిన వారిలో సహితం తాము కూడా అటువంటి ప్రయోజనం పొందవచ్చనే ఆకర్షణ కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.
ఒకొక్క ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటుకు రూ 30 లక్షల నుండి రూ 50 లక్షల వరకు ఖర్చు కాగలదని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మొదటి ఒకటి, రెండు సమ్మేళనాల ఖర్చును ఆయా నియోజకవర్గాల ఎమ్యెల్యేలే భరించాలని చెప్పారు. ఆ తర్వాత పార్టీపరంగా ఖర్చు భరించే విషయం పరిశీలింపగలేమని పేర్కొన్నారు.
సామాజిక వర్గాల వారీగా జరిపే సమ్మేళనాలు రాష్ట్ర స్థాయిలో ఆయా సామాజిక వర్గాలకు చెందిన పార్టీ నేతలు, మంత్రులు పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేయనున్నారు. సాధారణంగా కార్తీకమాసంలో సామజిక వర్గాల వారీగా రాజకీయ నాయకులు సమ్మేళనాలు ఏర్పాటు చేసి, భోజనాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. కానీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, ఓటర్లకు దగ్గర అయ్యేందుకు ఈ విధమైన సమ్మేళనాలు రాష్ట్ర వ్యాప్తంగా జరపడం బహుశా మొదటిసారి కావచ్చు.
ఎన్నికలకు మరో ఎనిమిది నెలలకు పైగా సమయం ఉంది. ఈ సమయంలో ఇటువంటి సమ్మేళనాలు వరుసగా జరుపుతూ వివిధ సామజిక వర్గాలకు దగ్గర కావడం, మరోవంక పార్టీ శ్రేణులను క్రియాశీలకం కావించడం ఈ సమ్మేళనాల ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది.