అకస్మాత్తుగా షర్మిలపై సానుభూతి ప్రదర్శిస్తున్న బిజెపి

Friday, April 19, 2024

తెలంగాణాలో ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి, పాదయాత్ర జరుపుతున్న వై  ఎస్ షర్మిలను ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడం కోసం కేసీఆర్ ప్రయోగించిన బాణం గానే బీజేపీ నేతలు భావిస్తూ వచ్చారు. పైగా ఆమె భర్త బ్రదర్ అనిల్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో మతమార్పిడులకు, క్రైస్తవ మత ప్రచారం కోసం, హిందువులకు పవిత్రమైన తిరుమలలో క్రైస్తవ మత ప్రచారంకోసం పనిచేశారంటూ విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. 

షర్మిల అమ్మగారైన వై  ఎస్ విజయమ్మ ఓ చేతిలో బైబిల్ పట్టుకొని, షర్మిల వెంట తిరుగుతూ మొదట్లో కొడుకు జగన్ మోహన్ రెడ్డికి,  ఇప్పుడు షర్మిలకు `క్రైస్తవ ప్రతినిధి’గానే మద్దతు ఇస్తున్నారంటూ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు.

అయితే సోమ, మంగళవారాల్లో ఆమె పాదయాత్రపై అధికార టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు దాడులకు పాల్పడటం, ఆమెను పోలీసులు అరెస్ట్ చేయడం వంటి నాటకీయ పరిణామాల నేపథ్యంలో అకస్మాత్తుగా ఆమె పట్ల బిజెపి నాయకులు సానుభూతి వ్యక్తం చేస్తుండటం విస్మయం కలిగిస్తోంది. 

రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర నుండి ప్రజల దృష్టి మళ్లించడం కోసమే అధికార పక్షం ఆమెను అరెస్ట్ చేసి, నాటకీయ పరిస్థితులు సృష్టించాయని బిజెపి శ్రేణులు ఓ ప్రక్క పేర్కొంటున్నా, నాయకులు మాత్రం ఆమెకు సంఘీభావం తెలిపేటట్లు వ్యవహరిస్తున్నారు. 

అధికార పక్షంపై విమర్శలకు ఎటువంటి అవకాశం లభించినా వెనుకడుగు వేయని గవర్నర్ డా. తమిళశై సౌందరరాజన్ సహితం ఈ ఘటనలను ఒక అవకాశంగా తీసుకున్నారు.  షర్మిల అరెస్ట్‌పై గవర్నర్ తమిళిసై ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె కారులో ఉండగానే లాగుతున్న దృశ్యాలు కలవరపెట్టాయని తెలిపారు. ఈ విషయంపై పిఎంఒ, డిజిపికి గవర్నర్ తమిళిసై ట్యాగ్ చేశారు.  

గవర్నర్ ట్వీట్ తో ఉత్సాహం కలిగిన షర్మిల గురువారం ఉదయం 11.30 గంటలకు రాజ్‌భవన్‌కు వెళ్లి సమావేశం కానున్నారు. పాదయాత్రలో తమ బస్సుపై దాడి ఘటన, హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన తీరును గవర్నర్‌కు షర్మిల వివరించనున్నారు. దీంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.

బీజేపీ నేతలు సహితం వెనుకడుగు వేయలేదు. శాంతిల కార్వాన్ ను టిఆర్ఎస్ కార్యకర్తలు తగలబెట్టడాన్ని బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నది కెసిఆర్ బృందం అంటూ ఒక మహిళా అని కూడా చూడకుండా షర్మిలను అరెస్ట్ చేయడం, ఆమె వాహనాన్ని తగలబెట్టడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు. 

ఆడబిడ్డ అని చూడకుండా పోలీసులు అడ్డుకున్నారన్నారాని అంటూ ఆమె అరెస్ట్ పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి భైంసా సమీపంలో జరిగిన బిజెపి బహిరంగసభలో నిరసన వ్యక్తం చేశారు.  పోలీసుల ముందు టీఆర్ఎస్ నాయకులు పెట్రోల్ పోసి తగలబెట్టే పరిస్థితి ఉందని అంటూ ఆమెపై జరిగిన దాడి పట్ల  ఆగ్రహం వ్యక్తం చేశారు.

 అసలు ఈ తెలంగాణలో శాంతి, భద్రతలున్నాయా? ఈ పోలీసులు శాంతి, భద్రతల కోసం ఉన్నారా..  ప్రతిపక్షాలను అణిచివేయడం కోసం ఉన్నారా? అని నిలదీశారు. ఇంతటి దుర్మార్గం ఎప్పుడూ లేదని మండిపడ్డారు.   వైఎస్సాఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిలతో పోలీసులు వ్యవహిరించిన తీరు సరిగా లేదని బిజెపి ఎమ్యెల్యే, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ సహితం ఆక్షేపణ వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి ఇట్లా చేస్తే తెలంగాణ ఉద్యమం నడిచేదా అని ప్రశ్నించారు. 

కవితతో ట్విట్ల వార్ 
ఈ నేపథ్యంలో షర్మిలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ ద్వారా తొలిసారి విమర్శలు ఎక్కుపెడుతూ బిజెపి కోవర్టు షర్మిల అని విమర్శించడం గమనార్హం. ‘తాము వదిలిన “బాణం”… తానా అంటే తందానా అంటున్న “తామర పువ్వులు”’ అని తొలుత షర్మిలను ఉద్దేశించి కవిత వ్యాఖ్యానించారు.  ఈ ట్వీట్ పై షర్మిల ఘాటుగా స్పందించారు. ‘పాదయాత్రలు చేసింది లేదు.. ప్రజల సమస్యలు చూసింది లేదు.. ఇచ్చిన హామీలు అమలు లేదు.. పదవులే కానీ పనితనం లేని గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు’ అని షర్మిల విమర్శించారు. షర్మిల వ్యాఖ్యలపై కవిత మరోసారి అదే స్థాయిలో రిప్లై ఇచ్చారు.

‘ అమ్మా.. కమల బాణం… ఇది మా తెలంగాణం… పాలేవో నీళ్ళేవో తెలిసిన చైతన్య ప్రజా గణం… మీకు నిన్నటిదాకా పులివెందులలో ఓటు… నేడు తెలంగాణ రూటు… మీరు కమలం కోవర్టు… ఆరేంజ్ ప్యారేట్టు… మీ లాగా పొలిటికల్ టూరిస్ట్ కాను నేను… రాజ్యం వచ్చాకే రాలేదు నేను… ఉద్యమంలో నుంచి పుట్టిన మట్టి ” కవిత” ను నేను !’ అంటూ షర్మిలపై విమర్శలు గుప్పించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles