నిన్న శీను.. నేడు సత్తి.. చేతులు కడిగేసుకుంటున్నారా?

Sunday, December 22, 2024

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై గులకరాయి విసిరిన కేసులో పోలీసులు నిందితుడు ఎవరో ఒక నిర్ధరణకు వచ్చేశారు. విజయవాడ వడ్డెర కాలనీకి చెందిన యువకుడు సతీష్ అలియాస్ సత్తి ఈ పని చేసినట్టు తేల్చేశారు. సంఘటన జరిగిన మరురోజే అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు రిమాండ్ రిపోర్టును కోర్టుకు ఇచ్చారు. మరొక వ్యక్తి ప్రోద్బలంతో డబ్బులు వస్తాయనే ఉద్దేశంతోనే సతీష్ ఈ పనిచేసినట్టుగా అందులో వివరించారు.

అయితే రాష్ట్రవ్యాప్తంగా ఎంతో సంచలనం సృష్టించిన ఈ కేసుకు సంబంధించి.. పోలీసులు ఒక నిందితుడిని చూపించి.. ఇక్కడితే చేతులు దులిపేసుకునే ప్రయత్నంలో ఉన్నారా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అయితే పోలీసులు చూపించిన వాంగ్మూలాలు ఫాబ్రికేటెడ్ అయిఉండవచ్చుననే విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే సతీష్ రాయివిసిరినట్టుగా మరొక బాలుడు- తన తండ్రి ఎల్లయ్యకు చెప్పాడంటున్నారు. దానితో ఈ వ్యవహారం పెద్దదవుతుందని ఎల్లయ్య భయపడ్డాడట. అంతవరకు నిజమే అనుకున్నప్పటికీ.. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తుండగా ఎల్లయ్య పోలీసుల వద్దకు నేరుగా వెళ్లకుండా తహసీల్దారు ఆపీసుకు వెళ్లి అక్కడ వీఆర్వోతో చెప్పారట. వీఆర్వో తండ్రీ కొడుకులు ఇద్దరి వాంగ్మూలాలను నమోదుచేసి పోలీసులకు అందించారు. వాటి ఆధారంగానే సతీష్ పాత్రను పోలీసులు ధ్రువీకరిస్తున్నారు. అయితే వీఆర్వో ద్వారా పోలీసుల వద్దకు రావడడంలోనే మతలబు ఉన్నదని చర్చ జరుగుతోంది. వైసీపీ వారు కోరుకున్న విధంగా ఆ స్టేట్మెంట్లను రికార్డు చేయించడానికి అటునుంచి వచ్చారని భావిస్తున్నారు.

జగన్ మీద హత్యాయత్నం జరిగిందంటూ 2019 ఎన్నికలకు పూర్వం కోడికత్తి డ్రామా చోటుచేసుకుంది. కోడికత్తి శీనును అప్పట్లో అరెస్టు చేసి జైల్లో పెట్టారు. అయిదేళ్లపాటూ నేరం చేశాడా లేదా కూడా తేల్చకుండా జైల్లోనే మగ్గేలా చేశారు. విచారణ పూర్తి చేయడానికి కోర్టుకు వెళ్లడానికి కూడా ఖాళీ లేదని చెబుతూ జగన్మోహన్ రెడ్డి ఆ శీను జీవితంతో ఆడుకున్నారు. తెలుగుదేశం వాళ్లే చేయించినట్లుగా అప్పట్లోనూ బోలెడు పుకార్లు సృష్టించారు. వాటిలో  ఒక్క మాట కూడా నిజమని ఇప్పటిదాకా తేలలేదు.
తీరా ఇప్పుడు సీఎంపై చిన్న గులకరాయి పడినందుకు ఏకంగా హత్యాయత్నం అంటూ ఇంకో డ్రామా మొదలెట్టారు. ఇప్పుడువడ్డెర కుర్రవాడు సత్తిని బలి చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఈ మిషమీద అతడిని ఎన్నేళ్లు జైల్లో మగ్గిపోయేలా చేస్తారో అనే చర్చ సర్వత్రా నడుస్తోంది. పోలీసులు తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే.. సత్వరం అసలు దోషులను నిష్పాక్షికంగా తేల్చాలని, ఫాబ్రికేటెడ్ స్టేట్మెంట్లు కాకుండా, సరైన ఆధారాలతో నిరూపించాలని ప్రజలంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles