బాలుడి స్టేట్మెంట్ ఒక్కటీ సరిపోతుందా?

Friday, May 3, 2024

అసలే జనం రద్దీ.. ఆపై చుట్టూచీకటి.. గాఢాంధకారం.. ఎటునుంచో తెలియకుండా ఒక రాయి వచ్చి బస్సుమీద నిల్చున్న జగన్ నుదుటికి తగిలింది. ఇలాంటి పరిస్థితుల్లో రాయి ఎవరు విసిరారో ఖచ్చితంగా తేల్చిచెప్పడం అంతసులభం కాదు. కొంచెం సమయం పడుతుంది. అన్ని రకాల సాంకేతిక ఆధారాలు, వీడియో సాక్ష్యాలు, సీసీటీవీ ఫుటేజీలు.. అన్నీ పరిశీలిస్తున్నాం.. అని విజయవాడ నగర పోలీసు కమిషనర్ కాంతి రాణా టాటా కేసు నమోదు చేసిన సందర్భంలో మీడియాకు చెప్పారు. కానీ ఎవ్వరూ ఊహించనంత వేగంగా దీనిని క్లోజ్ చేసేశారు. తమాషా ఏంటంటే.. కేవలం ఒక్క బాలుడు (తొమ్మిదో సాక్షి) ఇచ్చిన సాక్ష్యం ఆధారంగా వ్యవహారాన్ని ఒక కొలిక్కి తెచ్చేసినట్టుగా అర్థమవుతోంది. అయితే.. పోలీసులు అత్యుత్సాహంతోనే ఇలాంటి పనిచేశారా? కోర్టు ఎదుట ఇదంతా నిలబడకపోయే అవకాశం ఉందా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి.

పోలీసులు తమ రిమాండు రిపోర్టులో మొత్తం 12 మంది సాక్షులను చేర్చారు. వారందరూ ఎవరో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ జాబితాలో ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ రుహుల్లా, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి, వైకాపా నేత పోతిన మహేష్, జగన్ వ్యక్తిగత సహాయకుడు మనోహర్ నాయుడు ఉన్నారు. ఏడు, ఎనిమిదో సాక్షులు నందిగామ ఏసీపీ రవికాంత్, నందిగామ సీఐ హనీష్ పేర్లున్నాయి. వీఆర్వో స్వర్ణలత, ఓ బాలుడి తండ్రి దుర్గారావు, ఇద్దరు బాలుర పేర్లు కూడా సాక్షుల్లో ఉన్నాయి.

కేసు పెట్టినదే వెలంపల్లి శ్రీనివాస్ ఫిర్యాదు మీద! ఆయన మీద కూడా దాడి జరిగింది. ఆయనను సాక్షిగా పెట్టారు. మరి అలాంటప్పుడు.. వెలంపల్లి కంటె చిన్న గాయం అయిన జగన్ ను ఎందుకు సాక్షిగా పెట్టలేదో అర్థం కాని సంగతి. ఆ సమయానికి బస్సుమీద ఉన్న అందరి పేర్లను సాక్షులుగా రాసేసినట్టు అనిపిస్తోంది… జగన్ తప్ప! వీఆర్వో, పోలీసు అధికారులు అందరూ సాక్షులే. అయితే వీరందరూ కూడా ‘‘జగన్ మీద రాయి పడింది’’ అని చెప్పడానికి మాత్రమే పనికి వచ్చే సాక్షులు. ‘‘రాయి వేసింది ఎవరు’’ అని చెప్పగల సాక్షులు ఇద్దరు బాలురు. వారిలో ఒకరి తండ్రి! ఆ ఒక్క స్టేట్మెంట్ తోనే మొత్తం కేసు నడుపుతున్నారు. సతీష్ ను ఏ1గా తేల్చేశారు. ఈ ఒక్క సాక్ష్యం సరిపోతుందా అనేది ప్రజల సందేహం.
ఆ బస్సుకు సీసీ కెమెరాలు వంటివి ఉండగా ఆ ఫుటేజీలలో నిందితుడి పాత్ర ఉన్నదని తేల్చకుండా.. కేవలం ఒక బాలుడి స్టేట్మెంట్ ఆధారంగా ముగించేయాలనుకుంటే కోర్టు ఎదుట కుదురుతుందా? అని పలువురు భావిస్తున్నారు. ఈ కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles