ఒకరికి అనుకూలంగా మరొక వ్యక్తి మాట్లాడారు అంటే.. ఆ మాట్లాడిన వ్యక్తి తాహతు, స్థాయిని బట్టి కూడా మొదటి వ్యక్తికి గౌరవం దక్కుతుంది. ఇది చాలా సహజం. ఆ సిద్ధాంతం ప్రకారం చూసినప్పుడు.. పాపిరెడ్డి పల్లి పర్యటనకు వెళ్లి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా.. ఆయన మీద జాలి కురిపిస్తూ, ఆయన ప్రాణాలకు ప్రమాదం ఉన్నదని భయం నటిస్తూ.. హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడడాన్ని గమనిస్తే.. ఆ మాటల వల్ల జగన్మోహన్ రెడ్డి పరువు మరింతగా పోతుంది తప్ప.. దక్కే ప్రయోజనం ఏమీ ఉండదని వైసీపీ నాయకులే తమలో తాము అనుకుంటున్నారు.
వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఆ పార్టీకి చెందిన అత్యంత వివాదాస్పదమైన నాయకుల్లో ఒకరు. రాష్ట్రానికి ప్రతిష్ఠాత్మక సంస్థగా కియా ఇక్కడ తయారీ యూనిట్ ను నడుపుతూ ఉంటే.. ఆ సంస్థ యజమానులను ఎలా పడితే అలా నోటికొచ్చినంతా మాట్లాడి.. ఒక దశలో వారు ఇక్కడినుంచి తమ యూనిట్ ఇతర ప్రాంతాలకు తరలించుకు వెళ్లిపోవాలనుకునేంత ఆందోళన కలిగించిన వ్యక్తి మాధవ్. అలాగే.. నగ్న వీడియో కాల్స్ తో ఓ మహిళతో అసభ్యంగా మాట్లాడుతూ, ఆ వీడియో లీక్ కావడంతో.. మొత్తంగా.. పార్టీ పరువును కూడా భ్రష్టు పట్టించారు. గోరంట్ల దెబ్బకు పార్టీ పరువు మొత్తం పోయిందని అప్పట్లో అంతా అనుకున్నారు.
ఆ దెబ్బకు మాధవ్ కు మళ్లీ టికెట్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి సాహసం చాల్లేదు. 2019 ఎన్నికల్లో పోలీసు ఉద్యోగం మాన్పించి మరీ.. ఆయనకు టికెట్ ఇచ్చారు. 2024 ఎన్నికలు వచ్చేసరికి ఎంచక్కా పక్కన పెట్టారు. ఆ నియోజకవర్గం నుంచి జె.శాంతను పోటీచేయించారు. గోరంట్ల మాధవ్ ను ఆ రకంగా పక్కన పెట్టడం ద్వారా కొంత మేరకు పరువు కాపాడుకోవచ్చునని జగన్ భావించారు.
మళ్లీ ఇప్పుడు ఎలాంటి ఆలోచన వచ్చిందో ఏమో తెలియదు గానీ.. తాజాగా.. ఆయనను తాడేపల్లికి పిలిపించుకుని మరీ బ్రీఫింగ్ ఇచ్చి, అక్కడే పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టించి ప్రభుత్వమ మీద నిందలు వేయించారు.
దేశంలోనే అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుల్లో జగన్మోహన్ రెడ్డి ఒకరు అని ఈ నగ్న వీడియో కాల్స్ ఎంపీ చెబుతోంటే.. అందుకే కాబోలు.. ఆయనను 11 సీట్లు దాటకుండా అయిదుకోట్ల మంది ప్రజలు తీర్పు చెప్పారు.. అని ప్రజలు నవ్వుకుంటున్నారు. హెలికాప్టర్ మీద దాడిజరగడం ప్రభుత్వ స్కెచ్ అనీ, జగన్ రోడ్డు మార్గంలో వెళ్లేలా పరిస్థితులు సృష్టించి.. ఆయనపై దాడిచేసి ప్రాణాలు తీయాలని అనుకున్నారని గోరంట్ల మాధవ్ అంటోంటే.. ఎలా నవ్వాలో తెలియక జనం తికమక పడుతున్నారు. లింగమయ్య ఇంటిదగ్గర మెటల్ డిటెక్టర్ పెట్టలేదని, రామగిరి ఎస్సైని చూసి పోలీసు యూనిఫాం సిగ్గుపడుతోందని మాధవ్ చెబుతున్నారు. నిజానికి ఎస్సై సుధాకర్ చాలా మర్యాదకరమైన భాషలో జగన్ కు కౌంటర్ ఇచ్చారు. గోరంట్ల మాధవ్ నీచమైన భాషలో అప్పట్లో తెలుగుదేశం నాయకులను దూషించి.. ఎంపీ టికెట్ సంపాదించుకున్న సంగతి మర్చిపోయారా? అని జనం ప్రశ్నిస్తున్నారు.
అయినా.. పోలీసులను బట్టలూడదీయించి కొడతాను అన్న జగన్ మాటలకు పోలీసు యూనిఫాం గర్విస్తూ ఉంటుందా? మాజీ పోలీసుగారూ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఈ మాటల్తో జగన్ కు పోయేపరువే తప్ప.. దక్కే పరువు లేదు!
Friday, April 18, 2025
