వల్లభనేని వంశీ విషయంలో పోలీసులు తొలినుంచి వ్యక్తం చేస్తున్న అనుమానాలు అలాగే సజీవంగా ఉన్నాయి. ఆయన జైలునుంచి బెయిలు మీద బయటకు వస్తే గనుక.. సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తారని, ఆధారాలను తారుమారు చేస్తారని తొలినుంచి భయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. తన మీద నమోదు అయిన కేసుల విషయంలో ఆయన తొలినుంచి చేసిన వ్యవహారమే అది. ఆయన తొలినుంచి సాక్ష్యాలు తారుమారు చేయడం మీదనే ఉన్నారు. ఇప్పుడు కోర్టు ఏకంగా బెయిలు మంజూరు చేసిన తర్వాత.. ఏయే కేసుల్లో అయితే తాను ఇరుక్కుని ఉన్నాడో వాటన్నింటినీ మసిపూసి మారేడు కాయ చేయడనే గ్యారంటీ ఏమైనా ఉందా? అనేది ప్రజల్లో మెదలుతున్న సందేహం.
ఎందుకంటే.. వల్లభనేని వంశీ.. బెదిరింపులతోనూ, దందాలతోనూ.. రాజకీయం చేయడం నేర్చిన వ్యక్తి. తెలుగుదేశం ఆఫీసు మీదికి తన అనుచర గూండాలను పంపి విధ్వంసం సృష్టించిన కేసులో.. ఆయన నిందితుడు కాగా,, ఏకంగా కేసు పెట్టిన దళిత యువకుడినే నిర్భయంగా కిడ్నాపు చేసి.. తన ఇంటికి పిలిపించుకుని బెదిరించి.. అతడితో కేసు విత్ డ్రా చేయించిన ఘనత వంశీది. ఇదంతా కూడా తాను అధికారం కోల్పోయిన తర్వాత జరిగిన దందా. ఇలాంటి వ్యక్తి అసలే విద్వంసానికి చిరునామాగా చెలరేగిన కాలంలో ఇంకెంత దుర్మార్గంగా వ్యవహరించి ఉంటారో ఎవ్వరైనా ఊహించుకోగలరు. అలాంటి అనేక వ్యవహారాలకు సబంధించి కొన్నే కేసులు నమోదు అయ్యాయి. అందులోనూ ఇప్పుడు బెయిలు లభించింది. బుధవారం విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
వంశీకి ఇప్పటిదాకా బెయిలు రాకపోవడానికి కారణం.. ఆయన చేసిన నేరాల తీవ్రత ఎంతమాత్రమూ కాదు. ఆయన బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేయగలరనే పోలీసుల వాదనలతో కోర్టు ఏకీభవించడం మాత్రమే. చాలా ఆలస్యంగా వివిధ కేసుల్లో బెయిలు వచ్చినప్పటికీ.. ఇంటి పట్టాల కేసులో ఆయన నిన్నటిదాకా రిమాండులోనే ఉన్నారు. అందులో కూడా బెయిలు రావడంతో అన్ని కేసుల్లోనూ బెయిలు వచ్చినట్టయింది. అయితే బయటకు వచ్చిన తర్వాత ఆయన తన కేసులను రూపుమార్చడానికి ఏ వక్ర ప్రయత్నమూ చేయకుండా ఉంటారా? అనేదే సందేహం.
వంశీ విదేశాలకు పారిపోయే అవకాశం అయితే లేదు. కానీ.. కేసులు నమోదు అయిన తర్వాత.. ఆయన అనుచరులు ఎంచక్కా రోడ్డు మార్గంలో నేపాల్ వెళ్లిపోయి అక్కడ తలదాచుకున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. వంశీ అలా వెళ్లకపోవచ్చు గానీ.. అన్ని కేసులను నీరుగార్చే ప్రయత్నం చేయకుండా ఉండరు. గతంలో అలా చేసినందుకే పెద్ద కేసులో ఇరుక్కున్నారు. ఈసారి మళ్లీ అలాంటి తప్పుడు పనులు చేయకుండా ఉంటే ఆయనకే సేఫ్ అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
వంశీ కుదురుగా ఉంటారా? అతి చేస్తారా?
Friday, December 5, 2025
