ఎన్టీ రామారావు బుగ్గ మీద ఒక పుట్టుమచ్చ అతికించుకుని, కోరమీసం ప్లేసులో గుబురు మీసం అతికించుకోగానే.. వేషం మారిపోతుంది. అలా నేరుగా విలన్ డెన్ లోకి వెళ్ళిపోయి వాళ్ల భరతం పట్టేస్తాడు. వేషం మార్చినా సరే.. అక్కడున్నది ఎన్టీవోడే అనే సంగతి ప్రేక్షకులు అందరికీ అర్థమై పోతుంటుంది… ఒక్క విలన్ కు తప్ప.
ఇప్పుడు కూడా అదే ఎపిసోడ్ నడుస్తోంది. హై కోర్టు న్యాయమూర్తులను బండ బూతులు తిట్టిన, సోషల్ మీడియా పోస్టులు పెట్టిన కేసులో కీలక నిందితుడు మణి అన్నపురెడ్డి ఎన్టీవోడి టెక్నిక్ ఫాలో అయ్యారు. మీసం, వేషం మార్చారు. శివ అన్నపురెడ్డీ పేరుతో కొత్త ఫేస్ బుక్ అకౌంట్ మార్చారు. ప్రపంచంలో అందరికీ అది అర్థమైపోతుంది.. ఒక్క సీబీఐకు తప్ప!!
మణి అనే నిందితుడు అమెరికాలో ఉన్నాడని, ఇంటర్పోల్ సాయంతో పట్టుకుంటాం అని కోర్టుకు చెప్పిన సిబిఐ ఎన్ని ప్రయత్నాలు చేసిందో తెలియదు. కానీ ఆ నిందితుడు ఎంచక్కా ఇండియా వచ్చి, ఏకంగా జగన్ ప్రచార సభల్లో కీలకంగా వ్యవహరిస్తూ ఉన్న సంగతిని ఈనాడు బయట పెట్టింది.
ఆ వెంటనే ఒకరోజు తన కొత్త నకిలీ ఎఫ్బీ ఖాతాను స్తంభింప జేసిన సదరు నిందితుడు.. తరవాత మళ్లీ వాడుతూ పోస్టులు పెడుతున్నారు. ఈనాడులో తన గుట్టు బయటపడగానే తిరిగి అమెరికా పారిపోయినట్టు పలువురు భావిస్తున్నారు. అయితే నిందితుడు అంతర్జాతీయ విమాన ప్రయాణాలు చేస్తోంటే.. గుర్తించలేని స్థితిలో సిబిఐ ఏం చేస్తోంది అనేది ప్రజలకు అర్థం కావడం లేదు.
మణి ఆన్నపురెడ్డి నీ కాపాడడంలో విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ల పాత్ర ఉన్నదనే విమర్శలు వస్తున్నాయి. మరి సిబిఐ గానీ, పోలీసులు గానీ ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి.