వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అనర్హత వేటు పడుతుందనే చర్చ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్. శాసనసభకు కనీసం సహేతుక కారణంతో ఒక సెలవు చీటీ కూడా ఇవ్వకుండా అరవై రోజుల పాటు కంటిన్యువస్ గా గైర్హాజరైన వ్యక్తి ఎమ్మెల్యేగా అనర్హుడు అవుతాడు అనే చట్ట నిబంధనను ఏపీ డిప్యూటీ స్పీకరు రఘురామక్రిష్ణ రాజు లోకానికి తెలియజేశారు. దాంతో జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యంగా వస్తుందనే ఊహాగానాలు కూడా సాగుతున్నాయి. ఉపఎన్నికే జరిగితే గనుక.. గత ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు తమ పార్టీ కార్యకర్తల్లో పోరాట స్ఫూర్తిని నింపడానికి వాడిన నినాదం ‘వై నాట్ పులివెందుల’ అనేదానిని నిజం చేయడానికి పార్టీ పరిశ్రమిస్తుందని తెలుస్తోంది. ఉప ఎన్నికలో జగన్ ను ఓడించడానికి ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని కూడా తెలుగుదేశం భావిస్తోంది.
వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి పులివెందుల నియోజకవర్గంలో అపరిమితమైన ఆదరణ ఉంటుంది. కాబట్టే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించడం అంత ఈజీ కాదు. ఈజీ కాదు గనుకనే.. చంద్రబాబునాయుడు కూడా అలాంటి అసాధ్యమైన విషయమే తమ టార్గెట్ కావాలని గత ఎన్నికల సమయంలో పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఉప ఎన్నిక అంటూ వస్తే అప్పటికి పులివెందుల ప్రజల్లో కూడా జగన్ పట్ల వెగటు పుట్టి ఉంటుందనే అంచనాతో తెలుగుదేశం ఉంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ.. తన సొంత నియోజకవర్గంలో పనులు చేసిన చిన్న చిన్న కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు చెల్లించలేదు. అదే సమయంలో తనకు సన్నిహితులైన బడా బడా కాంట్రాక్టర్లకు మాత్రం అధికారంలోంచి దిగిపోయే ముందు వందల కోట్ల రూపాయల బిల్లుల చెల్లింపులు చేశారు. పార్టీ ఓడిపోవడంతో.. పులివెందుల నియోజకవర్గంలో పనులు చేసిన చిన్న చిన్న కాంట్రాక్టర్లు బిల్లులు రాక, చేసిన అప్పులు తీర్చలేక నానా పాట్లు పడుతున్నారు. పులివెందుల వచ్చిన జగన్ కు పలుసందర్భాల్లో మొర పెట్టుకున్నారు. కావాలంటే కోర్టుల్లో కేసులు వేయడం అంటూ ఆయన వారికి సలహా చెప్పారు తప్ప.. తాన చేయదగిన న్యాయం విస్మరించాననేే పశ్చాత్తాపం ప్రకటించలేదు. అలాంటి జగన్ పట్ల ప్రజలు ఇదివరకటి అభిమానం కనబరచడం అసాధ్యం అని తెలుగుదేశం భావిస్తోంది.
అదే సమయంలో.. ముఖ్యమంత్రిగా ఉండగా జగన్ ఎంతెంత ఘోరంగా అవినీతికి పాల్పడ్డారో కూడా ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తుంది. అనర్హత వేటు పడి.. జగన్ స్థానంలో ఉపఎన్నిక వస్తే.. ఆలోగా.. జగన్ పూర్తిగా తన ప్రజాదరణ కోల్పోతారనే నమ్మకం కూడా తెదేపాకు ఉంది. అందుకే వారు.. ఉప ఎన్నికఅంటూ వస్తే వైనాట్ పులివెందుల అనే నినాదాన్ని నిజం చేయాలని తపన పడుతున్నారు.
వై నాట్ పులివెందుల’.. ఈసారి తప్పదా?
Saturday, April 5, 2025
