వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాపాడుకోవడానికి పాపం నానా కష్టాలు పడుతున్నారు. పార్టీని ఒక్కరొక్కరుగా వీడి వెళ్లిపోతూ ఉంటే, కార్పొరేటర్లు ఇష్టానుసారం అధికార కూటమి పార్టీల్లో చేరిపోయి.. కార్పొరేషన్లను, మునిసిపాలిటీలను కూటమి చేతుల్లో పెట్టేస్తోంటే.. జగన్ ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నట్టుగా కనిపిస్తోంది. అందుకే ఈ ఫిరాయింపులకు అడ్డుకట్ట వేయడానికి ఆయన నానా పాట్లు పడుతున్నారు. వారికి నానా మాయమాటలు చెబుతున్నారు. వారిలో తన పట్ల పార్టీ పట్ల నమ్మకం కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన చెబుతున్న మాటల్లో అతిపెద్ద కామెడీ ఏంటంటే.. ఈసారి జగన్ 2.0 పరిపాలన వస్తే.. నా స్టయిలు మామూలుగా ఉండదు. కార్యకర్తల కోసం నేను ఎలా పనిచేస్తానో మీరు తప్పకుండా చూస్తారు. కార్యకర్తలు అందరినీ ఒక దశకు తీసుకువస్తాను అని ఆయన అంటున్నారు. అయితే ఈ మాటలు విన్న మామూలు జనం మాత్రం.. ‘‘తమరికి 2.0 పరిపాలన అవకాశం కూడా వస్తుందని ఆశపడుతున్నావా జగనన్నా.. ఇంతకీ ఎప్పటికీ వస్తుందనుకుంటున్నావు..’’ అంటూ జోకులు వేసుకుంటున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకూ మునుగుతున్న నావ చందంగా తయారవుతోంది. ఇప్పటికే చాలా మంది నాయకులు పార్టీని వదలి వెళ్లిపోయారు. ప్రత్యేకించి జగన్ . తర్వాత అంతటి నాయకుడిగా అందరి మీద పెత్తనం చెలాయించిన విజయసాయిరెడ్డి కూడా పార్టీని వీడి వెళ్లిపోవడం అనేకుల్ని అనుమానంలో పడవేసింది. ఈ పార్టీలో మనుగడ సాధ్యం కాదని భయపడుతున్నారు. వారి భయం యొక్క ఫలితం.. మునిసిపల్ ఉప ఎన్నికల్లో చాలా స్పష్టంగా కనిపించింది. వైసీపీ తరఫున గెలిచిన వారంతా ఫిరాయించి కూటమి పార్టీల్లో చేరిపోయారు.
ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడకు చెందిన కార్పొరేటర్లతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. మొన్నటిదాకా అధికారంలో ఉన్నప్పుడు.. తాను కార్యకర్తల్ని నిర్లక్ష్యం చేశానని, వారికోసం ఏమీ చేయలేకపోయానని జగన్ మొసలి కన్నీరు కార్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తమ పార్టీ కార్యకర్తల్ని పెడుతున్న ఇబ్బందులు చూస్తే బాధ కలుగుతోందని అన్నారు. మీ బాధలన్నింటినీ చూస్తున్నానని.. ఈసారి తాను అధికారంలోకి వచ్చినప్పుడు తన 2.0 పాలన వేరే లెవెల్లో ఉంటుందని జగన్ వారికి నచ్చజెబుతున్నారు. కార్యకర్తల కోసం తాను ఎలా పనిచేస్తానో మీరే చూస్తానని వారికి ఎర వేస్తున్నారు.
ఈ మెరమెచ్చు కబుర్లన్నీ కూడా.. కేవలం కార్యకర్తల్ని, కార్పొరేటర్లని పార్టీ వీడిపోకుండా కాపాడుకోవడం కోసం చెప్పే కంటితుడుపు మాటలేనని పార్టీ వారే వ్యాఖ్యానిస్తున్నారు. అధికారంలో ఉండగా.. ఎంపీలను ఎమ్మెల్యేలను కలవడానికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా.. అహంకారం ప్రదర్శించిన జగన్మోహన్ రెడ్డిలో అంత సులువుగా మార్పు వస్తుందా అని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
2.0.. అలాంటి ఆశ కూడా ఉందా జగనన్నా!
Thursday, March 20, 2025
