ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ఆకతాయి ఎవరో రాయి విసిరిన కేసులో విచారణ నిష్పాక్షికంగా జరగాలంటే.. సీబీఐ ద్వారా జరగాలనే డిమాండ్ క్రమంగా ఊపందుకుంటున్నది. ప్రస్తుతం ఈసీ పర్యవేక్షణలో విజయవాడ నగర కమిషనర్ ప్రత్యేకంగా ఆరు బృందాలను ఏర్పాటుచేసి దర్యాప్తును సాగిస్తున్నారు. ఇప్పటికే నలుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా పుకార్లు వినిపిస్తున్నాయి గానీ.. పోలీసులు ధ్రువీకరించలేదు. పోలీసులు ఏ సంగతీ తేల్చడానికి ముందే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దళాలు, వారి అనుకూల మీడియా దాడి ఎలా జరిగిందో తామే నిగ్గుతేల్చేసి చెప్పేస్తున్నారు! ఈ నేపథ్యంలో రాష్ట్రపోలీసుల ఆధ్వర్యంలో జరిగే దర్యాప్తు ప్రభావితం అయ్యే అవకాశం ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు స్వయంగా ఒక కాట్ బాల్ ఉపయోగించే నిపుణుడికి గానీ, ఎయిర్ గన్ పేల్చడంలో సిద్ధహస్తుడికి గానీ సుపారీ ఇచ్చి జగన్ ని చిన్న గులకరాయితో కొట్టి చంపేయాల్సిందిగా పురమాయించినట్లు తేల్చాయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దళాలు, సాక్షి మీడియా చాలా తపన పడిపోతున్నాయి. రాయి పడిన రోజునే తెలుగులోని అన్ని మీడియా సంస్థలు రాయి విసిరినట్టుగా కవరేజీ ఇస్తూపోగా, ఒక్క సాక్షి మీడియా సంస్థ మాత్రం అప్పటికప్పుడే దానిని హత్యాయత్నంగా నిర్దారించేసి ఆ దిశగా తమ వార్తలను ప్రసారం చేసింది. సాక్షి కథనాల్ని వైసీపీ నేతలు కూడా అందుకున్నారు. అందరూ రాయితో దాడి చేశారనే మాట మానేసి.. హత్యాయత్నం చేశారనే మాట్లాడడం ప్రారంభించారు. ఒక్కరోజు గడిచేసరికి పోలీసులు కూడా అదే పాట పాడసాగారు. హత్యాయత్నం కిందనే కేసులు నమోదు చేశారు.
ఈ వ్యవహారం మొత్తం గమనించినప్పుడు.. ఏపీ పోలీసుల విచారణ ఎంతగా ఈసీ పర్యవేక్షణలోనే జరుగుతున్నప్పటికీ.. వారు సాక్షి కథనాలకు, వైసీపీ వారి వాదనలకు ఈజీగా ప్రభావితం అయ్యే అవకాశం ఉన్నదని పలువురి వాదన. అందుచేత విచారణ నిష్పాక్షికంగా ఉండాలంటే సీబీఐ ద్వారా చేయించాలని పలువురు కోరుతున్నారు. తెలుగుదేశం నాయకుల వాదన కూడా అలాగే ఉంది. రాష్ట్ర పోలీసులు విచారణ సాగిస్తే గనుక.. ఎవరో ఒకరిని బాధ్యులుగా అరెస్టు చేసి వారిద్వారా.. చంద్రబాబునాయడే ఈ రాయి విసిరి చంపేయమని అన్నట్టుగా ఒక ఆరోపణ బనాయించగలరని ప్రజలు అనుకుంటున్నారు. మరి సీబీఐ విచారణకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందో లేదో చూడాలి.
సీబీఐ విచారిస్తే తప్ప నిజం తేలదా!
Wednesday, January 22, 2025