ఆయన కేవలం ఒక మాజీ ఎమ్మెల్యే. జగన్ మోహన్ రెడ్డి పంచన ఉన్నందుకు.. ఆయన పట్ల ఉన్న ప్రజా వ్యతిరేకత ప్రతిఫలించి తన సొంత నియోజకవర్గంలో కూడా గెలవలేకపోయారు. ఆయన ఇప్పుడు రాష్ట్రప్రజలకు ఒక పెద్ద సవాలు విసురుతున్నారు. కేవలం రాష్ట్రప్రజలకు మాత్రమే కాదు, రాష్ట్రంలో ఉన్న పోలీసు యంత్రాంగానికి అంతటికీ కూడా సవాలు విసురుతున్నారు. నాలుగేళ్ల తర్వాత.. వైఎస్సార్ కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చినప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే.. రాష్ట్రంలో ఒక వార్డు మెంబరు కూడా తెలుగుదేశం తరఫున గెలవరని, గెలవనివ్వం అని.. కడప జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే రాచమల్లు రామచంద్రారెడ్డి అంటున్నారు. అదేమాదిరిగా.. కడపజిల్లాలో ఉప ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేలా ప్రయత్నించిన పోలీసుల మీద కూడా ఆయన విషం కక్కారు. తాము అధికారంలోకి రాగానే ఈ పోలీసులు ఒక్కరికి కూడా తమ ఉద్యోగాలు ఉండవు.. అని ఆయన బెదిరిస్తున్నారు.
రాచమల్లు రామచంద్రారెడ్డి మాటలు విన్న వారికి మాత్రం ఆశ్చర్యం కలుగుతోంది. రాచమల్లు తన గురించి తాను ఏం అనుకుంటున్నారో కదా.. అని అంతా నవ్వుకుంటున్నారు. నాలుగేళ్ల తర్వాత అసలు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఉంటుందో లేదోనని పలువురు ఊహాగానాలు సాగిస్తున్న తరుణంలో.. తాము అధికారంలోకి రావడం అంటూ జరిగితే.. పోలీసుల ఉద్యోగాలన్నీ ఊడగొట్టిస్తానంటూ ఆయన బీరాలు పలకడం కామెడీగా ఉంది. పోలీసులమీద కక్ష కట్టి వ్యవహరించే జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అయినా సరే.. మహా అయితే.. పోలీసులను లూప్ లైన్లలో పెట్టి.. వారిని వేధించగలరు తప్ప.. వారికి ఉద్యోగాలు లేకుండా చేయడం అనేది ఆయనకు కూడా సాధ్యం కాదనే సంగతి.. ఒకసారి ఎమ్మెల్యేగా కూడా పనిచేసిన ఈ నాయకుడికి తెలియకపోవడం తమాషా అని ప్రజలు అనుకుంటున్నారు.
పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికల సందర్భంగా.. అల్లర్లు సృష్టించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కడప జిల్లా నాయకులందరూ రంగంలోకి దిగారు. అయితే పోలీసుల పటిష్టమైన ఏర్పాట్ల వల్ల వారి ఆటలు సాగలేదు. పలువురు వైసీపీ నాయకులు.. ప్రశాంతమైన ఎన్నికలను సహించలేక ఎక్కడికక్కడ రోడ్లపై కూర్చుని నిరసనలు తెలియజేయడం ఒక ఫ్యాషన్ గా మార్చుకున్నారు. ఈ క్రమంలో తాను కూడా చిన్న ధర్నా చేసిన రాచమల్లు రామచంద్రారెడ్డి.. తమ పాలన వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే.. ఒక్క వార్డు మెంబరు కూడా తెలుగుదేశం తరఫున గెలవబోరని హెచ్చరించడం కామెడీగా ధ్వనిస్తోంది. రాచమల్లు లాంటి వాళ్ల మాటలు.. జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి రావడం అంటూ జరిగితే.. ఈ రాష్ట్రం రావణకాష్టంలా మారిపోతుందనే భయాన్ని ప్రజలకు కలిగిస్తున్నట్టుగా ఉంది. జగన్ అధికారంలోకి వస్తే.. ఇక జనజీవితం మొత్తం సర్వనాశనం అవుతుందనే భయం ప్రజల్లో పెరగడానికి ఇలాంటి మాటలే కారణమవుతున్నాయని పలువురు అంటున్నారు.
