వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన కాలంలో కొత్త లిక్కర్ విధానం తీసుకురావడం ద్వారా.. ఎన్ని రకాల అక్రమాలకు పాల్పడ్డారో.. ఎన్ని వేల కోట్లరూపాయలను స్వాహా చేశారో, ఏయే మార్గాల్లో హవాలా ద్వారా ఆ డబ్బులను దేశం దాటించారో.. పక్కా సాక్ష్యాధారాలతో సహా లోక్ సభలో ప్రస్తావించిన నాయకుడు నరసరావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు. తర్వాత పత్ర్యేకంగా హోంమంత్రి అమిత్ షా స్వయంగా లావును పిలిపించుకుని ఆ వివరాలన్నీ అడిగి తెలుసుకున్నారు. మద్యం అక్రమాలు జరిగిన తీరు తెన్నులను డాక్యుమెంటరీ ఎవిడెన్స్ సహా హోంమంత్రికి సమర్పించడం, ఆయన ఈడీ దర్యాప్తుకు కూడా పురమాయించడం జరిగింది. అలాంటి లావు శ్రీకృష్ణదేవరాయలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని తిరిగి జైలుకు పంపడానికి ఒక చక్కటి పాయింట్ పట్టుకున్నారు. బెయిలుమీద ఉన్న జగన్మోహన్ రెడ్డి.. పోలీసుల్ని బెదిరించడం అనేది.. బెయిలు నిబంధనల్ని ఉల్లంఘించడమే అని ఆయన పేర్కొంటున్నారు.
లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వైఎస్ జగన్ పాపిరెడ్డి పల్లి వెళ్లి అనేక రకాల చిక్కుల్లో చిక్కుకున్నట్టుగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన ఒక నాయకుడు బజార వ్యక్తి లాగా.. పోలీసుల్ని బట్టలు ఊడదీయించి కొడతా అని అసహ్యంగా మాట్లాడడం, చవకబారు వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అయింది. దానికి జవాబుగా, ముఖ్యమంత్రి గా చేసిన నాయకుడికి ఒక మామూలు ఎస్సై తీవ్రమైన పదజాలంతో వార్నింగ్ ఇవ్వడంతో ఆయన పరువు గంగలో కలిసి పోయింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తామే డబ్బులిచ్చి తోలించిన జనం హెలికాప్టర్ మీదపడి దాన్ని కాస్త ప్రయాణయోగ్యం కాకుండా చేయడం మరో ఎత్తు. తాను పోలీసులను బూతులు తిట్టిన వ్యవహారం బ్యాక్ ఫైర్ అయిందని జగన్ కు బాగా అర్థమైంది. దాని మీద నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి.. జగన్ కు భద్రత కల్పించలేదు.. చంపేయాలని అనుకుంటున్నారు.. అంటూ తన పార్టీ వారితో మాట్లాడించి డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారు.
లావు శ్రీకృష్ణ దేవరాయలు మాత్రం చాలా స్ట్రెయిట్ పాయింట్ పట్టుకున్నారు. ‘జగన్ వ్యాఖ్యలు పోలీసుల నైతికతను దెబ్బతీసేలా ఉన్నాయి.. బెయిలుపై ఉన్న జగన్ వ్యవస్థలను బెదిరించేలా వ్యవహరిస్తున్నారు. ఆయన వ్యవహారశైలి బెయిలు షరతులను ఉల్లంఘించడమే అవుతుంది. జగన్ ప్రసంగాలు శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లేలా, ప్రజాస్వామ్యానికి హాని కలిగించేలా ఉన్నాయి’ అంటూ హోం మంత్రికి లేఖ రాశారు. ఈ లేఖను కేంద్రం సీరియస్ గా తీసుకుంటే గనుక.. జగన్ కు క్లిష్టపరిస్థితులు ఎదురవుతాయని పలువురు అంచనా వేస్తున్నారు. ఒకవైపు పన్నెండేళ్ల నుంచి బెయిలుమీద ఉన్న నాయకుడిగా జగన్ రికార్డు సృష్టిస్తున్నారు. ఇలా బెయిలుపై ఉన్న నిందితుడు అయిన జగన్.. పోలీసులను నానా మాటలు తూలనాడుతూ, బెదిరిస్తూ ఉంటే దాని పర్యవసానంగా ఆయన బెయిలు రద్దయినా ఆశ్చర్యం లేదని పలువురు విశ్లేషిస్తున్నారు.
జగన్ ను జైలుకు పంపేందుకు మంచి పాయింట్ పట్టుకున్న లావు!
Friday, December 5, 2025
