దేశం మొత్తం నివ్వెరపోయేంతటి తీవ్రమైన ఆర్థిక నేరాలు, క్విడ్ ప్రోకో దందాలలో ఏ1 నిందితుడు అయినప్పటికీ కూడా.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. చిన్నపాటి శిక్షకు కూడా గురికాకుండా ఎలా మనగలుగుతున్నారనే విషయంలో ప్రజల్లో చాలా రకాల సందేహాలు సాగుతూ ఉంటాయి. వక్ఫ్ బిల్లు పార్లమెంటు ఆమోదం పొంది చట్టం రూపం దాల్చిన నేపథ్యంలో ఒక వైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు తెలుగుదేశాన్ని మాత్రం నిందిస్తూ.. తాము ముస్లింలకు ఫేవర్ చేశాం అని అర్థం వచ్చేలాగా బిల్లును వ్యతిరేకించాం అని చెప్పుకుంటున్నారు. అయితే.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాత్రం.. జగన్మోహన్ రెడ్డి దొంగాటలను బయటపెట్టారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వక్ఫ్ బిల్లు విషయంలో దొంగాట ఆడిందని ఆయన అంటున్నారు. లోక్ సభలో ఒక రకంగా, రాజ్యసభలో ఇంకో రకంగా వ్యవహరించిందని, ఇలాంటి దొంగాటలు ప్రజాస్వామ్యానికి మేలు చేయవు అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సీపీఐ నారాయణ జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన తీరు మీద తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ప్రధాని నరేంద్రమోడీ ప్రాపకం కోసం తపన పడుతూ.. బిజెపి విధానాలను పల్లెత్తు మాట అనకుండా ఉండడం వల్లనే జగన్ జైలుకు పోకుండా బయట ఉండగలుగుతున్నారని ఆయన విమర్శించారు. మన దేశంలో పన్నెండేళ్ల పాటూ బెయిలు మీద బయటే ఉండి.. ముఖ్యమంత్రి కూడా అయిన నాయకుడు మరొకడు ఉన్నారా అటూ ఎద్దేవా చేశారు. మోడీ అమిత్ షాలతో మంచిగా ఉంటూ తన సొంత పనులు చక్కబెట్టుకుంటున్నారని.. తమలపాకుతో మంత్రించినట్టుగా వారి మీద విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు.
ప్రధాని నరేంద్రమోడీ విషయంలో జగన్ ఎంతటి తిరుగులేని భక్తి ప్రపత్తులు చూపిస్తూ ఉంటారో అందరికీ తెలుసు. ముఖ్యమంత్రిగా తాను ఉన్నంతకాలమూ రాష్ట్ర పర్యటనకు ఎప్పుడు నరేంద్రమోడీ వచ్చినా సరే.. ఎయిర్ పోర్టులోనే ఆయన పాదాలమీద పడిపోతూ.. ఆయన తనకు తండ్రి సమానుడని అంటూ జగన్ పదేపదే కీర్తిస్తూ ఉండేవారు. ఈ పొగడ్తలన్నీ కూడా తన మీద ఉండే సీబీఐ కేసులను, ఆర్థిక నేరాలను ఒక కొలిక్కి తెచ్చి తన మీద శిక్ష పడకుండా చూడడానికి మాత్రమే అనే విమర్శలు సర్వత్రా ఉన్నాయి. అదే క్రమంలో.. మోడీ ప్రభుత్వం రాజ్యసభలో కాస్త బలహీనంగా ఉన్న సమయాల్లో ఏ వివాదాస్పద బిల్లు అక్కడ గట్టెక్కాలన్నా సరే.. వైసీపీ పూర్తిగా వారికి సహకరిస్తూ సాగిలపడేది అని సీపీఐ నారాయణ అంటున్నారు.
అలాగే.. పాపిరెడ్డి పల్లి పర్యటన తర్వాత.. పోలీసులను అసభ్యంగా జగన్ దూషించడాన్ని కూడా నారాయణ తప్పు పడుతున్నారు. జగన్ అధికారంలో ఉన్నంత కాలమూ ఆయన ప్రభుత్వం చెప్పినట్టే పోలీసులు పనిచేశారని.. పోలీసులు అంటే ప్రభుత్వమేనని.. ధైర్యముంటే ప్రభుత్వాన్ని ఏమైనా విమర్శించాలి తప్ప.. పోలీసుల్ని అసభ్యంగా నిందించడం, వారితో తిట్టించుకోవడం సరికాదని నారాయణ అంటున్నారు.
వైసీపీ దొంగాటలను బయటపెట్టిన ఎర్రనేత!
Sunday, April 27, 2025
