వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు ఇసుక అక్రమ తవ్వకాల రూపేణా ఏటా వేల కోట్ల రూపాయల సొమ్ము కాజేస్తున్నదనే ఆరోపణలు చాలాకాలం నుంచి ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే.. కొత్త ఇసుకవిధానం తెస్తానంటూ.. రాష్ట్రంలో ఇసుక లభ్యత లేకుండా చేసిన జగన్.. నిర్మాణ రంగాన్ని కుదేలు చేసి.. కొన్ని వేల నిర్మాణకూలీల కుటుంబాలు రోడ్డునపడేందుకు కారణం అయ్యారు. తర్వాత కొత్త ఇసుక విధానం తెచ్చారు గానీ.. అదివరలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉన్న ధరకంటె అయిదురెట్లుపైగా ఇసుక రేటు పెరిగిపోయింది. దానికి తోడు.. పర్మిట్లు ఒకచోట ఉండగా మరొకచోట అనుమతులు లేకుండా.. ఎడాపెడా ఇసుకతవ్వకాలు సాగించి.. అడ్డదారుల్లో ప్రకృతి సంపదను దోచుకునే వైసీపీ నేతల దందాలు పెరిగిపోయాయి. ఇలాంటి అక్రమ వ్యవహారాలపై తాజాగా సుప్రీం కోర్టు కొరడా ఝుళిపించింది.
రాష్ట్రంలో అనుమతులు లేని ఇసుక తవ్వకాలను తక్షణం నిలిపేయాలంటూ సుప్రీం కోర్టు తాజాగా తీర్పు చెప్పింది. మే 9లోగా అక్రమ తవ్వకాలమీద అఫిడవిట్లు వేయాలని కేంద్రపర్యావరణ, అటవీశాఖను, రాష్ట్రప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది. ఎన్నికల కారణంగా సమయం కావాలని రాష్ట్రప్రభుత్వ న్యాయవాది చెప్పినప్పటికీ.. సుప్రీం కోర్టు ఒప్పుకోలేదు. ఎన్నికలకంటె పర్యావరణం ముఖ్యం అంటూ అఫిడవిట్ వేసి తీరాల్సిందేనని ఆదేశాలు ఇచ్చింది.
తాజాగా సుప్రీం కోర్టు తీర్పు కారణంగా.. రాష్ట్రం నలుమూలలా ఇసుక ముసుగులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న వేలాది కోట్ల రూపాయల దందా గురించిన చర్చ ప్రజల్లో జరుగుతోంది. ఏపీలో ఇసుక విక్రయాల విషయంలో ఏ స్థాయి దందా నడుస్తున్నదో.. విపక్షాలు అనేక మార్లు ఆరోపిస్తూనే ఉన్నాయి. దేశం మొత్తం మీద కిళ్లీ బంకుల్లో కూడా యూపీఐ, ఆన్ లైన్ పేమెంట్స్ నడుస్తాయి గానీ.. కేవలం ఏపీలో ఇసుక విక్రయాలు, లిక్కర్ విక్రయాలు మాత్రం కేవలం క్యాష్ రూపేణా మాత్రమే జరుగుతున్నాయి. ఈ ఒక్క రుజువు చాలు అక్రమాలకోసమే ఈ ఏర్పాటు అని! ఇసుక విషయంలో ఒకే పర్మిట్ మీద అనేక లారీలు తోలడం, అనుమతులు లేకుండా ఇసుకతవ్వకాలు ఇవన్నీ విచ్చలవిడి వ్యవహారాలుగా మారాయి.
ఇప్పుడు సుప్రీం కోర్టు కూడా వీటిని తప్పుపట్టడంతో.. జగన్ అనుచరగణం సాగిస్తూ వచ్చిన దందా గురించి ప్రజల్లో చర్చ నడుస్తోంది. సుప్రీం తీర్పుతో ఈ ఇసుకదుమారం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అరాచకత్వాన్ని ప్రజలముందు నిలబెడుతుందని అంతా అనుకుంటున్నారు. ఎన్నికల్లో దీని ప్రభావం తప్పకుండా ఉంటుందని భావిస్తున్నారు.
ఇసుక అరాచకాలపై సుప్రీం చెంపదెబ్బ!
Thursday, November 14, 2024