ఆంక్షలు పెట్టే కొద్దీ రెచ్చిపోతున్న షర్మిల!

Wednesday, January 22, 2025

కడప ఎంపీ ఎన్నికలలో- ఎవరు అవునన్నా కాదన్నా వివేకానంద రెడ్డి హత్య వ్యవహారమే గెలుపు ఓటములను నిర్ణయించనుంది. అవినాష్ రెడ్డి మళ్లీ ఎంపీగా నెగ్గారంటే కనుక.. వివేకా హత్య వెనుక ఆయన హస్తం ఉన్నట్లుగా ప్రజలు నమ్మడం లేదని అర్థం చేసుకోవాలి. అయితే ఏకపక్షంగా గెలుపుతో మాత్రమే ముడి పెట్టకూడదు. గత ఎన్నికల కంటే అవినాష్ రెడ్డి మెజారిటీ గణనీయంగా తగ్గినా కూడా.. ఖచ్చితంగా హత్య వెనుక ఆయన హస్తం ఉన్నదని కడప నియోజకవర్గ ప్రజలను నమ్ముతున్నట్లుగా భావించాలి.
మరోవైపు వైయస్ వివేకా హత్య గురించి ఎన్నికల ప్రచారంలో మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు షర్మిల, సునీత, బీటెక్ రవి తదితరులకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. వారు హైకోర్టులో ఆప్పీలు చేసుకుని మళ్లీ జిల్లా కోర్టుకు వచ్చిన తర్వాత జరిమానా పడిందే తప్ప వారికి అనుమతి లభించలేదు. అయినా సరే, కోర్టు ఆంక్షలు పెరుగుతున్నా సరే.. షర్మిల మరింతగా రెచ్చిపోయి వివేకా హత్యను తన ప్రచారంలో వాడుతున్నారే తప్ప ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. సిబిఐ తమ దర్యాప్తులో తేల్చిన, వారు చేసిన ఆరోపణల ప్రకారమే అవినాష్ నిందితుడు అని మాట్లాడుతున్నామని, కాల్ రికార్డులు గూగుల్ మ్యాప్స్ వంటి ఆధారాలు అన్నీ కూడా అవినాష్ కు ప్రతికూలంగా ఉన్నాయని షర్మిల గుర్తు చేస్తున్నారు. చిన్నా నన్ను చంపిన హంతకులను జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నారని కూడా విమర్శించారు. ఒకప్పుడు అన్న కోసం పాదయాత్ర చేశా.. ఇప్పుడు న్యాయం కోసం నిలబడ్డా.. న్యాయం గెలుస్తుందా నేరం గెలుస్తుందా ప్రజలు తేల్చి చెప్పాలని షర్మిల అడుగుతున్నారు.

మరోవైపు సునీత కూడా ఏమాత్రం తగ్గడం లేదు. తన తండ్రి వివేకానంద రెడ్డి హత్య కేసు కు సంబంధించి కోర్టు తీర్పు ఆలస్యం కావచ్చు గాని.. ప్రజల కోర్టులో తీర్పు ఆలస్యం కాకూడదు అని విజ్ఞప్తి చేస్తున్నారు. కోర్టు తీర్పు కంటే ప్రజాతీర్పు పెద్దదని.. అందుకోసమే తన తండ్రి హత్య విషయంలో న్యాయం జరగడానికి షర్మిల ఎంపీగా పోటీ చేస్తున్నారని సునీత అంటున్నారు. రేపో మాపో జైలుకు వెళ్లే అవినాష్ రెడ్డిని ఇంకొకసారి ఎంపీగా గెలిపించడం అవసరమా అని ఆమె  ప్రశ్నిస్తున్నారు.

వివేకానంద రెడ్డి హత్య విషయాన్నీ ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించడంలో కోర్టు విధించిన ఆంక్షలు జగన్ చెల్లెళ్ళ ముందు ఏమాత్రం పనిచేయడం లేదు. వారు తాము తలచిన రీతిలోనే అవినాష్ రెడ్డి మీద విమర్శల జడివానతో దూసుకుపోతున్నారు. ఫలితంగా ఎలాంటి పర్యవసానాలు వచ్చినా సరే ఎదుర్కోవడానికి వారు సిద్ధంగానే ఉన్నట్లు కనిపిస్తుంది. మొత్తానికి కడప ఎంపీ రాజకీయాలు మొత్తం వైఎస్ వివేకా హత్య చుట్టూతా మాత్రమే తిరుగుతున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles