కోర్టులో మొట్టికాయ పడాల్సిందే!

Monday, May 20, 2024

ముందుగా ఒక కథ చెప్పాలి. ఒక ఊళ్లో ఒక అత్తా కోడలు ఉండేవారు. ఆ కోడలు కాస్త బద్ధకస్తురాలు. దానికి తగ్గట్టుగానే ఆమె అత్త కొంత గయ్యాళి! అత్తా కోడళ్ల మధ్య నిత్యం ఏదో ఒక రచ్చ నడుస్తూ ఉండేది. ఆ కోడలికి పొద్దున్నే నిద్రలేచే అలవాటు లేదు. పొద్దున్నే లేచి ఇంటి పనులు చేసుకోకపోతే అత్తకు కోపం. ఆమె చీపురుకట్టతో పడుకున్న కోడలిని రెండు దెబ్బలు వేసి లేపేది. కొన్నాళ్లకు పరిస్థితి ఎలా తయారైందంటే.. ప్రతి రోజూ పొద్దునలేవగానే అత్త చీపురుకట్టతో కోడలిని రెండు దెబ్బలు వేయడం.. ఆమె వెంటనే లేచి ఇంటి పనులు చేసుకోవడం ఒక అలవాటుగా మారిపోయింది.
ఇలా ఉండగా.. ఒకనాడు ఆ కోడలి తల్లిదండ్రులు ఆ ఇంటికి అతిథులుగా వచ్చారు. ఆ ఇంట్లో బస చేశారు. వారి ఎదుట కోడలిని చీపురుతో కొడితే బాగుండదని అత్త మొహమాటపడింది. అయినా.. బద్దకిస్టు అయిన కోడలు ఎంత పొద్దెక్కినా నిద్రలేవలేదు. వియ్యంకుల ముందు ఎందుకని.. అనునయంగా అత్త వెళ్లి కోడలిని నిద్రలేపే ప్రయత్నం చేసింది. అయితే కోడలు లేవలేదు. ‘నాకిచ్చేది నాకు ఇస్తేనే లేస్తా’ అనసాగింది. ఎంతసేపు లేపడానికి ప్రయత్నించినా ఇదే తంతు. కాసేపు గమనించాక.. ఆ కోడలి తల్లిదండ్రులు అత్తతో.. ‘రోజూ ఏదో ఇస్తావంట కదమ్మా ఇచ్చేస్తే పోతుంది కదా.. బిడ్డ లేస్తుంది కదా’ అన్నారు. అప్పుడు అత్త చీపురుకట్ట తీసుకువచ్చి కోడలికి నాలుగు వడ్డించింది. వెంటనే ఆ కోడలు లేచి ఏదో అలవాటుగా పనుల్లోపడిపోయింది. ఆ అమ్మాయి తల్లిదండ్రులు మాత్రం ముక్కున వేలేసుకుని ఆశ్చర్యపోయారు.
ఇదీ కథ!

==

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహార సరళిని గమనిస్తే ఈ కథ గుర్తుకు వస్తోంది. తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, ఆ నిర్ణయాలకు బ్రేకులు పడడం అనేది జగన్మోహన్ రెడ్డికి కొత్త కాదు. అయితే తన నిర్ణయాలు తప్పుడువే అని తేలినా సరే.. ఆయన వెనక్కి తగ్గరు. కోర్టుకు వెళతారు. కోర్టుకూడా అక్షింతలు వేసి, మొట్టికాయలు వేస్తే తప్ప ఆయన వెనక్కి తగ్గరు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 59 నెలలు గడచిపోయిన సందర్భంలో కూడా జగన్ ప్రభుత్వ వైఖరిలో ఏమాత్రం మార్పు రావడం లేదు.
విద్యార్థుల ఫీజు రీఇంబర్స్ మెంట్, రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ తదితర వ్యవహారాలకు సంబంధించి.. జగన్ మార్చి నెల మొదటి వారంలోనే బనట్లు నొక్కే లాంఛనాన్ని పూర్తిచేశారు. రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటిదాకా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు పడలేదు. తీరా  ఇప్పుడు రెండు రోజుల్లో పోలింగు ఉందనగా.. ఇప్పుడు డబ్బులు వేయడానికి అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వం ఈసీని కోరింది. ఈ సమయంలో డబ్బు ఇవ్వడం అంటే.. ఓట్లను కొనే ప్రయత్నమే అని ఆగ్రహించిన ఈసీ అందుకు నిరాకరించింది. ప్రభుత్వం అక్కడితో ఊరుకుని ఉంటే బాగుండేది.

కానీ జగన్ సర్కారుకు కోర్టు మొట్టికాయలు పడితే తప్ప ఊరుకునే అలవాటు లేదు. అందుకే వారు కోర్టుకు వెళ్లారు. హైకోర్టులో అయిదుగంటల సుదీర్ఘ వాదోపవాదాలు జరిగాయి. పోలింగ్ కు రెండు రోజుల ముందు డబ్బు ప్రజల అకౌంట్లలో వేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇచ్చేది లేదని ఈసీ కోర్టుకు తేల్చి చెప్పింది. కోర్టు ప్రస్తుతానికి తీర్పు రిజర్వు చేసింది. అయితే ఇలాంటి డబ్బు పంచే దందాకు, అది కూడా పోలింగుకు ముందు అనుమతి రావడం అసాద్యం అనే నిపుణులు భావిస్తున్నారు. కోర్టు కూడా అక్షింతలు వేసిన తర్వాత మాత్రమే జగన్ సర్కారు మాట వింటుందని అంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles