తన పరువు కాపాడుకోవడం అనేది ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద సవాలుగా మారిపోతోంది. రాష్ట్రంలో ఆయన పార్టీ మళ్లీ నెగ్గకుండా ఓడిపోతే నష్టపోయే పరువు గురించి కాదు.. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నది. అలాంటి పరువు పోవడం పెద్ద విశేషం ఏమీ కాదు. ఎందుకంటే.. ఎన్నికలు అన్న తరువాత..ఎవరోర ఒకరు గెలుస్తారు- మిగిలిన వారు ఓడిపోయి తీరాల్సిందే. కానీ, కడప ఎంపీ ఎన్నిక అనేది జగన్ కు ఇజ్జత్ కా సవాల్ గా మారుతోంది. అక్కడ పార్టీ ఓడిపోతే.. అనగా, చెల్లెలు షర్మిల చేతిలో తమ్ముడు అవినాష్ రెడ్డి ఓడిపోతే.. ఆ పరువు పోవడం అనేది చాలా దారుణంగా ఉంటుంది.
రాష్ట్రంలో పార్టీ ఓడిపోతే పెద్ద ఘోరమేమీ కాదు. జగన్ విధానాలు ప్రజలకు నచ్చలేదని, లేదా, రాష్ట్రం కోసం చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకున్నారని దానికి అర్థాలు చెప్పుకోవచ్చు. కానీ కడప ఎంపీ నియోజకవర్గంలో అవినాష్ రెడ్డి ఓడిపోతే.. జగన్ మీద పడే మచ్చ పెద్దది. తన సొంత కుటుంబాన్ని, సొంత చెల్లెల్ని జగన్ వంచించారు, అందుకే వారు ఆయనతో వైరం పెట్టుకున్నారు అనే ప్రచారానికి మన్నన దక్కుతుంది. అలాగే, వైఎస్ వివేకానందరెడ్డిని చంపించింది అవినాష్ రెడ్డే అని ప్రజలందరూ కూడా నమ్ముతున్నట్టుగా నిరూపణ అవుతుంది. అవినాష్ ను నిందితుడని అనడం మాత్రమేకాదు..
ఇన్నాళ్లూ హంతకుడిని వెనకేసుకు వస్తున్నారనే నిందను కూడా జగన్ మోయాల్సి వస్తుంది. కేంద్రంలో బిజెపి ఎదుట సాగిలపడి మొక్కుతున్నందుకు ప్రధాన కారణం కూడా.. తమ్ముడు అవినాష్ రెడ్డిని హత్య కేసు నుంచి కాపాడడం కోసమే అని కూడా ప్రజలు నమ్ముతారు. సొంత చెల్లెలికి అన్యాయం చేశారని అక్కడి ప్రజలు నమ్ముతున్నట్టే అవుతుంది. సొంత చెల్లెలికి అంత అన్యాయం చేసేవాడు.. ఇక రాష్ట్రమంతా అందరు ఆడవాళ్లని అక్క చెల్లెమ్మలు అని అనడం, మీ జీవితాలను ఉద్ధరిస్తా అనడం, మీ బిడ్డలకు నేను మేనమామని అనడం.. ఇవన్నీ కూడా మాయమాటలే అని నిరూపణ అవుతాయి.
ఇన్ని రకాలుగా పరువు మంటగలిసిపోయే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కడప ఎంపీ ఎన్నికను చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాల్సిందే. కానీ షర్మిల కూడా అంత తేలిగ్గా విడిచిపెట్టేలా లేరు. చిన్నాన్న వివేకా హంతకుల భరతం పట్టేందుకే తాను రాజన్న బిడ్డగా కడప ఎంపీ బరిలో పోటీచేస్తున్నానని ఆమె అంటున్నారు. రామలక్ష్మణుల్లాంటి వారని రాజశేఖర్ రెడ్డి, వివేకాల అనుబంధాన్ని అభివర్ణిస్తున్న ఆమె… అవినాష్ రెడ్డే హంతకుడు అని సూటిగా విమర్శలు చేస్తుండడం గమనార్హం. మొత్తానికి షర్మిల ఈ ఎన్నికల్లో జగన్ కు చాలా పెద్ద గండంగా మారే ప్రమాదం ఉన్నట్టు కనిపిస్తోంది.
కడపలో షర్మిల.. జగన్ ఇజ్జత్ కా సవాల్!
Wednesday, January 22, 2025