కుదిరితే మళ్లీ రెండు తెలుగు రాష్ట్రాలు ఏకం కావాలని వైసీపీ కోరుకుంటోందని, ముఖ్యమంత్రి జగన్‌ది కూడా అదే అభిప్రాయమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ దుమారం రేపుతున్నాయి.
వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే ప్రజలపై సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించే ప్రయత్నం చేసిన్నట్లు పలువురు భావిస్తున్నారు. అయితే, ఈ వాఖ్యలో సొంత పార్టీ శ్రేణులనే ఆత్మరక్షణలో పడవేస్తున్నట్లు కనిపిస్తున్నది. రాష్ట్ర విభజనను సవాల్ చేస్తూ తాను సుప్రీంకోర్టులో వేసిన పిటీషన్ పై జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం స్పందించక పోవడంపై ఉండవల్లి అరుణకుమార్ ఘాటుగా స్పందించడంతో సమాధానంగా ఈ వాఖ్యలు చేస్తిన్నట్లు కనిపిస్తున్నా లోతయిన వ్యూహం ఉన్నదని స్పష్టం అవుతుంది.
గత ఎన్నికల్లో 22 ఎంపీ సీట్లు గెలిచినా రాష్ట్రం పట్ల వివక్షత ప్రదర్శిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రదర్షింపలేక పోవడంతో పాటు రాష్ట్ర ప్రయోజనాలను సొంత అవసరాల కోసం తాకట్టు పెట్టారనే విమర్శలను సొంత పార్టీ శ్రేణుల నుండి కూడా ముఖ్యమంత్రి జగన్ ఎదుర్కొంటున్నారు.
మరోవంక, జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల పొరుగున ఉన్న తెలంగాణాలో కేసీఆర్ ప్రభుత్వం అరెస్టులు చేస్తుండటం, ఆమె చేస్తున్న పాదయాత్రను అడ్డుకోవడంతో ఆమె పోరాటాలకు సిద్దపడినా జగన్ కనీసం స్పందించక పోవడం, కనీసం చెల్లెలును పరామర్శించకపోవడం వైసీపీ అభిమానులలో ఆవేదన కలిగిస్తోంది. ఈ పరిణామాలు పార్టీ మద్దతు దారులనే ఆత్మరక్షణలో పడేస్తున్నాయి.
అయితే, రాష్ట్ర విభజన జరిగిన తీరుపట్ల ఏపీ ప్రజలలో ఆగ్రవేశాలు వ్యక్తమైనా, తిరిగి తెలంగాణతో కలిసి ఉండాలని మాత్రం కోరుకోవడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి అంతా హైదరాబాద్ నగరం చుట్టూ కేంద్రీకృతం కావడంతో ఓ రాజధాని నగరం కూడా లేకుండా ఎంతగా నష్టపోయామో ఇప్పుడు రాష్ట్ర ప్రజలు గ్రహిస్తున్నారు.
అందుకనే, రాష్ట్రాన్ని తెలంగాణకు ధీటుగా అభివృద్ధి పరచుకోగల నాయకత్వం కోరుకొంటున్నారు గాని, తిరిగి `ఉమ్మడి రాష్ట్రం’ అనే ఎమోషన్ ప్రజలను ఏమాత్రం ప్రభావితం చేస్తుందన్నది సందేహాస్పదమే. చివరకు వైసీపీ శ్రేణులు సహితం ఉమ్మడి రాష్ట్రంగా తిరిగి ఏర్పడాలని కోరుకోవడం లేదు.
అదీగాక, చెల్లెలు షర్మిలను రాజకీయంగా అణచివేయాలని ప్రయత్నిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కు `తెలంగాణ సెంటిమెంట్’ లేవగొట్టే అవకాశం సజ్జల ఈ వ్యాఖ్యల ద్వారా ఇస్తున్నారనే అభిప్రాయం కూడా కలుగుతుంది. జగన్ ఆమోదం లేకుండా సజ్జల ఇటువంటి వ్యాఖ్యలు చేసే అవకాశం లేదు. అందుకనే వ్యూహాత్మకంగా తప్పటడుగు వేస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
జగన్ పాలనలో రాష్ట్రాభివృద్ధి కుంటుపడినదని, సంక్షేమ పధకాల పేర్లతో పేదలకు నగదు బదిలీ జరుగుతున్నా ఉద్యోగ కల్పన, పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధి పట్ల ప్రభుత్వం చెప్పుకోదగిన కృషి చేయలేక పోతున్నదని వైసిపి శ్రేణులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పైగా, ప్రభుత్వ పనులు ఏవీ జరగక పోవడంతో వాటిపై కాంట్రాట్ లు, వ్యాపారాలు చేసుకుంటూ ఆదాయం సమకూర్చుకోవాలనుకున్న పార్టీ నాయకులు సహితం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. దానితో గత ఎన్నికలో వలే ఈ సారి విరుచుకుపడి, సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని పార్టీ గెలుపు కోసం పనిచేసే పరిస్థితి కనపడటం లేదు.