పరారీలో రాజ్ కసిరెడ్డి.. వైసిపి అండదండలు పుష్కలం!

Monday, December 15, 2025

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటిదాకా అనేకమంది మీద కేసులు నమోదు అయ్యాయి. విచారణలు నడుస్తున్నాయి. కొందరు అరెస్టు అయ్యారు, మరికొందరు రిమాండ్ లో కూడా ఉంటున్నారు. ఇంకా అనేకమంది నాయకుల మీద కేసులు నమోదు అవుతున్నాయి.. వాటి బారినుంచి తప్పించుకోవడానికి ఎవరి పాట్లు వాళ్లు పడుతున్నారు.  అయితే.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఇప్పటిదాకా ఎవరి విషయంలోనూ జరగనంతగా, ఒక వ్యక్తిని కాపాడడానికి మాత్రం పార్టీ శత విధాలా ప్రయత్నిస్తున్నది. ఆ వ్యక్తి అసలు పోలీసు విచారణకే వెళ్లకుండా చూడాలని నానాపాట్లు పడుతున్నది. విచారణ పర్వం దాకా వెళ్లి నోరు తెరిచే పరిస్థితి రాకుండా ఆయనను కాపాడుకోవడం తమందరి తక్షణ కర్తవ్యం అన్నట్లుగా జగన్ పార్టీలోని పెద్దలు వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆ వ్యక్తి మరెవరో కాదు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి.

జగన్మోహన్ రెడ్డి పరిపాలన రోజులలో కొత్తగా తీసుకువచ్చిన మద్యం విధానం ద్వారా వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిన వ్యవహారంలో రాజ్ కసిరెడ్డి కీలక నిందితుడు. ఆయనను విచారించడానికి పోలీసులు ఇప్పటికే మూడుసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన వాటికి స్పందించకుండా బేఖాతరు చేశారు. విచారణకు హాజరు కాకుండా పరారయ్యారు. ఆయన పరారు కావడం వెనుక వైసీపీ నాయకుల పుష్కలమైన అండదండలు ఉన్నట్లుగా.. జగన్ ప్రభుత్వ కాలంలో ఒక వెలుగు వెలిగిన ఐపిఎస్ అధికారి దగ్గరుండి ఆయన భద్రత ఏర్పాట్లు చూస్తున్నట్లు గా తెలుస్తోంది.

వైయస్ జగన్ ప్రభుత్వం కాలంలో ప్రభుత్వ ఐటి సలహాదారుగా నియమితులైన రాజ్ కసిరెడ్డి ఆస్థానం నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దందాలకు సహకరించడం మాత్రమే కాదు.. ఆ సర్కార్ తీసుకువచ్చిన కొత్త లిక్కర్ పాలసీ ప్రకారం విచ్చలవిడిగా దోచుకోవడంలో కూడా కీలక భూమిక పోషించారు. మద్యం ధరలను విపరీతంగా పెంచేసిన తర్వాత ఆ పెంచిన ధరలను తమకు లంచాలుగా ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసిన సంస్థలకు మాత్రమే పంపిణీ ఆర్డర్లు ఇవ్వడం.. వారి నుంచి తమ వాటా డబ్బులు అడ్డదారుల్లో తీసుకొని వాటిని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి చేరవేయడం తదితర వ్యవహారాలను రాజ్ కసిరెడ్డి రోజు వారీగా స్వయంగా పర్యవేక్షించినట్లుగా సమాచారం.

అక్కడి నుంచి వైసీపీలోని ఏయే పెద్దలకు ఏ స్థాయిలో వాటాలు వెళ్లాయో మిథున్ రెడ్డి చూసుకునే వారని చెబుతున్నారు. రాజ్ కసిరెడ్డి పోలీసులు విచారణకు హాజరై నోరు తెరిస్తే గనుక వైసీపీలోని చాలామంది కీలక నాయకుల బండారం బయటకు వస్తుందని, అందుకే అందరూ కలిసి ఆయన పరారీకి సహకరిస్తూ ఉన్నారని తెలుస్తోంది. జగన్ ప్రభుత్వ హయాంలో కీలకంగా చక్రం తిప్పిన ఒక ఐపీఎస్ అధికారి.. స్వయంగా హైదరాబాదులో మకాం వేసి రాజ్ కసిరెడ్డి అజ్ఞాతజీవితానికి సంబంధించిన సకల వ్యవహారాలు చూస్తున్నట్టు తెలుస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles