ఎన్నికల్లో ఓడిపోయిన నాటినుంచి పొరుగురాష్ట్రం బెంగుళూరులోనే ఎక్కువగా గడుపుతున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విజిటర్ వీసా ఇవ్వాలని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. బెంగుళూరు యలహంక ప్యాలెస్ లో విలాసాల మధ్య తేలియాడుతూ బతుకుతూ ఉండడం.. మధ్య మధ్యలో కాస్త మెలకువ వచ్చినప్పుడు.. ఏపీలో ఏ అంశంమీద తాను గొడవ చేయవచ్చునా అని పరిశీలించడం.. లోకల్ లీడర్లను పురమాయించడం.. మందిని పోగేయించడం.. వారందరినీ రెచ్చగొడుతూ యాత్ర చేయడం గురించి పరిశీలించడం.. ఒకరోజు అటు వెళ్లి వచ్చేయడం మాత్రమే జగన్ చేస్తున్నారు. అలాంటి జగన్మోహన్ రెడ్డికి విజిటర్ వీసా ఇవ్వాలనే హేళన ప్రజల్లో ధ్వనిస్తోంది.
ఇప్పటిదాకా రాష్ట్రంలో ప్రజలను పరామర్శించడానికి జగన్ చేసిన యాత్రలు అన్నీ కూడా బెంగుళూరు ప్యాలెస్ విలాసాల మధ్య ఆటవిడుపుగా సాగినవి మాత్రమే. మొన్నటికి మొన్న రెంటపాళ్ల తర్వాత కూడా జగన్ బెంగుళూరు వెళ్లిపోయారు. అక్కడినుంచి హైకోర్టులో కేసు నడిపారు. అక్కడ స్టే వచ్చిన తర్వాత.. బెంగుళూరు నుంచి తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చి.. తన కారు కింద పడి చచ్చిపోయిన సింగయ్య భార్యకు పదిలక్షల రూపాయల ముడుపులు ఇచ్చి.. తనకు అనుకూలంగా మాట్లాడించుకుని మళ్లీ బెంగుళూరు వెళ్లిపోయారు.
అంతకు ముందు అనంతపురంజిల్లా పాపిరెడ్డి పల్లిలో మరణించిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లినప్పుడు కూడా అటునుంచి అటే బెంగుళూరుకు వెళ్లిపోవడం మీదనే జగన్ దృష్టిపెట్టుకున్నారు. ఇప్పుడు బంగారు పాళెం మామిడి రైతులను పరామర్శిస్తానని కొత్త డ్రామా ఆడుతున్న జగన్మోహన్ రెడ్డి బెంగుళూరు ప్యాలెస్ నుంచి రోడ్డు మార్గంలోనే రానున్నారు.
నిజానికి 2024 ఎన్నికలకు ముందు.. చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ ల గురించి జగన్ అనేక సందర్భాల్లో హేళన చేశారు. వారిని గెలిపిస్తే ఇక్కడ ఉంటారు.. గెలిపించకపోతే వెళ్లి హైదరాబాదులో కూర్చుంటారు అని ఎద్దేవా చేశారు. వారికి రాజధానిలో సొంత ఇల్లు లేదని అన్నారు. తాను ఇల్లు కట్టుకున్నానని పైకి చెబుతూ అమరావతికి ద్రోహం తలపెట్టారు.
కానీ ఏమైంది. అమరావతి రాజధానిలోని ఇల్లు కట్టుకుంటానని ప్రకటించిన చంద్రబాబునాయుడు, ఇప్పుడు అమరావతి రాజధాని పనులన్నీ ఊపందుకున్న తరువాత.. తన ఇంటి నిర్మాణం కూడా అక్కడ ప్రారంభించారు. పవన్ కల్యాణ్ ఆల్రెడీ ఇల్లు కట్టుకున్నారు. కేవలం ఇల్లును ఇక్కడ కలిగి ఉన్నప్పటికీ.. జగన్ మాత్రం.. బెంగుళూరు ప్యాలెస్ లోనే ఉంటూ పార్టీని రిమోట్ తో ఆపరేట్ చేస్తున్నారు. వారిమీద నిందలు వేసిన దానికంటె ఎక్కువగా ఆయన బెంగుళూరులో గడుపుతున్నారు. అందుకే ఆయనకు విజిటర్ వీసా అవసరం ఉందని ప్రజలంటున్నారు.
