అయిదేళ్లు వ్యవహరించినట్టుగానే ఈ రెండు నెలలు కూడా వ్యవహరిస్తే మొదటికే మోసం వస్తుంది. ఇన్నాళ్లూ అధికార పార్టీకి కొమ్ముకాస్తూ, ఆ పార్టీ నాయకుల అడుగులకు మడుగులొత్తుతూ, వారి ఆదేశాల మేరకు విపక్షాలమీదకు ఎగబడుతూ సాగించిన దందాలు కనీసం ఈ రెండునెలల్లో కట్టిపెట్టాల్సిందే. లేకపోతే వేటు పడుతుంది. అందుకు నిదర్శనంగానే.. ఏపీలో కలెక్టర్లు, ఎస్పీల మీద ఎన్నికల సంఘం బదిలీ వేటు వేయడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఈ అధికారులందరూ కూడా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టు చెడ్డపేరు తెచ్చుకున్నవారే కావడం విశేషం.
ఈసీ బదిలీ వేటు వేసిన వారిలో.. ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ జాషువా, అనంతపురం ఎస్పీ అన్బురాజన్, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి, గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు ఉన్నారు. అలాగే ఓటర్ల జాబితాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు కృష్ణా జిల్లా కలెక్టరు రాజబాబు, అనంతపురం కలెక్టరు గౌతమి, తిరుపతి కలెక్టరు లక్ష్మీషా కూడా వేటుకు గురయ్యారు. ఈ మేరకు సీఎస్ కు నోట్ పంపిన ఈసీ, ఈ అధికారులు అందరినీ ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని హెచ్చరించింది.
రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పిపోవడం మాత్రమే కాదు. ప్రతిచోటా విపక్షాలను అడ్డుకోవడానికి పోలీసు బలగాలు ఉపయోగపడుతున్నాయని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారు తమ ప్రత్యర్థులపై దాడులకు దిగుతున్నా, చంపేస్తున్నా కూడా పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారనే ఆరోపణలు బాగా వచ్చాయి. తెదేపా కార్యకర్తలు ఇద్దరు హత్యకు గురయ్యారు. ఒకరి కారును దహనం చేయడం జరిగింది. ఇలాంటి ఘటనలపై సీరియస్ అయిన ఈసీ, ఎస్పీలను పిలిపించి విచారించింది. వారి పరిధిలో శాంతి భద్రతలు హత్యలు, దాడుల దాకా దిగజారుతోంటే వారు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించింది. కొన్నిరోజుల్లోనే మొత్తం ఆరుగురు ఎస్పీలు, ముగ్గురు కలెక్టర్లపై వేటు పడింది.
కాగా ఈ వేటువేసే పరంపర ఇక్కడితో ముగియడం లేదని కూడా తెలుస్తోంది. ఇంకా అనేక ప్రాంతాల్లో పోలీసు అధికారుల తీరు మీద విపక్షాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నాయి. ఏకంగా డీజీపీని తప్పిస్తే తప్ప ఎన్నికలు పారదర్శకంగా జరగవని కూడా తెదేపా వారు వాదిస్తున్నారు. తెలుగుదేశం అభ్యర్థులకు ముందు ముందు ఇక్కట్లు రాకుండా.. రాష్ట్రంలో ఎక్కడెక్కడ వారిమీద ఎన్ని పోలీసు కేసులు నమోదై ఉన్నాయో వివరాలు అందించాలని కోరినా కూడా డీజీపీ పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఇది ఖచ్చితంగా తమను ఇబ్బందిపెట్టే కుట్ర అంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో త్వరలోనే డీజీపీ ని కూడా పక్కన పెట్టవచ్చుననే అంచనాలు సాగుతున్నాయి.
హెచ్చరికోయ్ హెచ్చరిక : అధికారులారా తస్మాత్ జాగ్రత్త!
Wednesday, January 22, 2025