పోలీసులు తమను విచారిస్తున్నప్పుడు.. నోరు మెదపకుండా ఉంటే చాలు. ‘తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా’ వంటి సినిమాటిక్ సమాధానాలను పదేపదే వల్లెవేస్తేచాలు.. ఇక ఏ గొడవా ఉండదు. తాము పూర్తిగా కేసు నుంచి తప్పించుకున్నట్టే. ఇక ఎవ్వరూ ఏమీ చేయలేరు.. అని ఏకసూత్ర ప్రణాళిక వైఎస్సార్ కాంగ్రెస్ దళాలందరూ కూడా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన దగ్గరినుంచి గత అయిదేళ్ల కాలంలో జరిగిన అనేకానేక పాపాలకు సంబంధించి.. అనేక కేసులు నమోదు అవుతున్నాయి. అనేకమందిని విచారిస్తున్నారు గానీ.. అందరూ పై తరహాలో ఒకే పాట పాడుతున్నారు. అయితే విచారణలో వారు సహకరించకపోయినంత మాత్రాన వదిలిపెట్టేది లేదని, వారి ఇళ్లలో ఆఫీసుల్లో సోదాలు నిర్వహించడం ద్వారా.. సాంకేతిక ఆధారాలను రాబట్టి అయినా.. వారి పాత్రను నిర్ధరిస్తామని తేలుస్తున్నట్టుగా సిట్ పోలీసులు వ్యవహరిస్తున్నారు. లిక్కర్ స్కామ్ కు సంబంధించిన కీలక నిందితుల ఇళ్లు, కార్యాలయాల్లో తాజాగా ఒక రోజంతా సోదాలు నిర్వహించడమే ఇందుకు తార్కాణం.
లిక్కర్ స్కామ్ లో డిస్టిలరీ లనుంచి వసూళ్లు రాబట్టిన మొత్తం నెట్ వర్క్ కు రాజ్ కెసిరెడ్డి సారథ్యం వహించిన సంగతి ఇప్పటికే విచారణలో తేలింది. అలాగే.. ఆయన స్నేహితుడు బూనేటి చాణక్య అంతే సమానంగా ఈ వసూళ్ల నెట్ వర్క్ కు కీలకంగా వ్యవహరించారు. ఒక లెవెల్ వరకు డిస్టిలరీల నుంచి వసూళ్లన్నీ వీరి ఆధ్వర్యంలో జరుగుతుండగా.. గోవిందప్ప బాలాజీ వ్యవహారం ఇంకో కథ. వైఎస్ భారతికి చెందిన భారతి సిమెంట్స్ లో పూర్తికాల డైరెక్టర్ అయిన గోవిందప్ప బాలాజీ వసూలు అయిన సొమ్ములను ఫైనల్ గా అందుకుని.. వాటిని అంతిమ లబ్ధిదారుకు చేర్చేవారని విచారణలో తేలింది.
అయితే ప్రధానంగా గోవిందప్ప బాలాజీ సిట్ అధికారులు కస్టోడియల్ విచారణ చేసినప్పుడు కూడా పెద్దగా సహకరించలేదని, నోరు మెదపలేదని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రిలిమినరీ చార్జిషీటు కూడా దాఖలు చేసిన తర్వాత.. శనివారం నాడు సిట్ పోలీసులు హైదరాబాదులోని వారి నివాసాలు ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు. రాజ్ కెసిరెడ్డికి చెందిన ఆఫీస్ రిసోర్స్ వన్ కార్యాయలంలోను, గోవిందప్ప బాలాజీ ఉండే భారతి సిమెంట్స్ కార్యాలయంలోను, బూనేటి చాణక్యకు చెందిన నానక్ రామ్ గూడ్ లోని టీగ్రిల్ రెస్టారెంట్ లోను సోదాలు నిర్వహించారు. ఈ సోదాలు కేసు విచారణలో కీలకంగా ఉపయోగపడగలవని భావిస్తున్న లాప్ టాప్ లను, డిజిటల్ సాక్ష్యాలను సేకరించినట్టుగా తెలుస్తోంది. రాజ్ కెసిరెడ్డి కార్యాలయాలకు, ఆయన ప్రారంభించిన సినీనిర్మాణ సంస్థకు డబ్బులు భారీ మొత్తాల్లో ఎక్కడెక్కడినుంచి వచ్చాయి.. లావాదేవీలు ఎలా జరిగాయి అనే దిశగా పోలీసులు విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. నిందితులు నోరు మెదపకపోయినంత మాత్రాన.. స్కామ్ లో వారిపాత్ర ని నిర్ధరించడం అసాధ్యం కాదని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.
లిక్కర్ స్కామ్ : విచారణలో నాటకాలు.. ఇళ్లలో సోదాలు!
Monday, December 8, 2025
