చంద్రబాబునాయుడు తాను రాష్ట్రంలోని మహిళలకు ఏ హామీనైతే ఇచ్చారో.. అంతకు అనేక రెట్లు ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తున్నారు. మహిళలను స్వావలంబన సాధికారత దిశగా నడిపించడంలో వేస్తున్న అడుగులలో కూటమి సర్కారు మరింత విశాల హృదయాన్ని ప్రదర్శిస్తోంది. చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలనే నిలబెట్టుకోవడం లేదు.. అని ఒకవైపు విపక్షం కుటిలప్రచారం సాగిస్తున్న తరుణంలో.. ఇచ్చిన హామీని అమల్లో పెట్టడం మాత్రమే కాదు కదా.. ప్రజలకు చెప్పిన దానికంటె అనేక రెట్లు ఎక్కువ మేలు చేయడం అనేది చంద్రబాబుకు మాత్రమే సాధ్యమవుతోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం విషయంలో కూటమి సర్కారు తాజా నిర్ణయం ప్రజల్లో హర్షాతిరేకాలకు కారణం అవుతోంది. మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా అయిదు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తిస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించడమే ఇందుకు ఉదాహరణ.
2023 మహానాడు సందర్భంగా తెలుగుదేశం సూపర్ సిక్స్ హామీలను ప్రకటించింది. అందులో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం కూడా ఒకటి. ఉచిత ప్రయాణం సదుపాయం కల్పిస్తే మహిళలు తమ పొరుగున ఉన్న ఇతర ప్రాంతాలకు, పట్టణాలకు కూడా వెళ్లి, ఉద్యోగ ఉపాధి అవకాశాలను పొందగలరని, అందుకు ఆర్థిక భారం కూడా లేకపోతే.. వారి వికాసం సాధ్యమవుతుందని చంద్రబాబునాయుడు సంకల్పించారు. ఆ మేరకు మహిళలకు వారి వారి సొంత జిల్లాల్లో వర్తించేలా ఉచిత ప్రయాణం కల్పిస్తామని అన్నారు. ఆ తర్వాతి కాలంలో ఈ పథకం గురించి విస్తృతంగా ప్రచారంలో పెట్టినప్పుడు కూడా.. మహిళలకు ఉమ్మడి జిల్లాలు ప్రాతిపదికగా వారి సొంత జిల్లాలో ఈ అవకాశం వర్తిస్తుందని అంతా అనుకున్నారు.
అయితే ఈ ఆగస్టు 15వ తేదీనుంచి ఈ పథకం కార్యరూపంలోకి రానుంది. ఇక్కడి దాకా వచ్చేసరికి ఎన్డీయే కూటమి సర్కారు తమ విశాల హృదయాన్ని చాటుకుంది. మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ప్రయాణ అవకాశం కల్పించడానికి నిర్ణయించారు. ఈ నిర్ణయంపై ఇప్పటికే మంత్రి నారా లోకేష్ సంబంధిత ఆర్టీసీ అధికారులతో మాట్లాడడం కూడా జరిగింది. ఈ విషయాన్ని మంత్రి అచ్చెన్నాయుడు ‘సుపరిపాలనలో తొలిఅడుగు’ కార్యక్రమంలో భాగంగా అన్నవరంలో జరిగిన కార్యక్రమంలో వెల్లడించారు.
నిజానికి ఒక జిల్లా వరకు ఉచిత ప్రయాణానికి హామీ ఇచ్చి, రాష్ట్రమంతా ప్రయాణించేలా ఆచరణలో పెట్టడానికి ప్రభుత్వం పూనుకోవడం పట్ల మహిళల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. కూటమి ప్రభుత్వం హామీలను నిలుపుకోవడంలో చిత్తశుద్ధితో లేదని ఆరోపిస్తూ, రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో డ్రామాలాడుతున్న విపక్షానికి ఈ తాజా నిర్ణయం చెంపపెట్టు. కూటమి సర్కారు తాము ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను ఒక్కటొక్కటిగా, మరింత మెరుగ్గా నెరవేర్చడానికి కృతనిశ్చయంతో ఉన్నదని ప్రజలు నమ్మడానికి ఇది కారణమవుతోంది.
హామీ కంటె గొప్పగా అమలు.. ఉచితప్రయాణం!
Friday, November 14, 2025
