కొంప ముంచావ్ జగనన్నా : కార్యకర్తల విలాపం!

Wednesday, January 22, 2025

జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మీద ఆ పార్టీ కేడర్ లో పెద్దస్థాయిలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. అత్యంత పేలవంగా ఉన్న ఈ మేనిఫెస్టోను వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకవైపు చంద్రబాబునాయుడు సూపర్ సిక్స్ పేరుతో అత్యంత జనాకర్షకమైన హామీలను ప్రకటించేశారు. ఆ తర్వాత కూడా.. అనేకానేక హామీలతో అన్ని వర్గాలను మెప్పించేలా ప్రకటనలు చేస్తున్నారు. చంద్రబాబునాయుడు ఇస్తున్న హామీలు సాంప్రదాయ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లను కూడా పునరాలోచనలో పడేస్తుండగా.. జగన్మోహన్ రెడ్డి ఇంత నీరసమైన మేనిఫెస్టో తీసుకురావడంతో పార్టీ నాయకులు కంగారు పడుతున్నారు. కార్యకర్తలు నీరసపడుతున్నారు. ‘కొంప ముంచేశావ్ జగనన్నా.. ఇలాంటి మేనిఫెస్టోతో అసలు ప్రజల ఎదుటకు ఎలా వెళ్లగలం?’ అని వారు ప్రశ్నిస్తున్నారు.

ఆరుపేజీల సుదీర్ఘమైన మేనిఫెస్టోను జగన్ కేవలం సొంతడబ్బాకు మాత్రమే పరిమితం చేశారు. ప్రతి సభలోనూ చెబుతూ వస్తున్నట్టుగానే ఈ మేనిఫెస్టో కూడా ఉంది. ఆయన అన్ని సభల్లోనూ అదిచేశాం ఇది చేశాం అనడమే తప్ప.. మళ్లీ గెలిస్తే ఏం చేస్తాం అనేది చెప్పడమే లేదు. ఈ మేనిఫెస్టో కూడా దాదాపుగా అలాగే ఉంది. ఏవో అతి పరిమితంగా కొన్ని విషయాలకు సంబంధించి మాత్రమే ఒకటి రెండు కొత్త పాయింట్లను జత చేశారు.

ఈ మేనిఫెస్టోలో పూర్తిగా కొత్త పథకం అంటూ ఒక్కటి కూడా లేనేలేదు. ఒకటిరెండు పథకాల విషయంలో లబ్దిని కాస్త పెంచారు. మిగిలినవన్నీ ‘కొనసాగిస్తాం’ అనడం తప్ప మరేం లేనేలేదు.

ఈసారి జరుగుతున్న ఎన్నికలు చావో రేవో తేల్చుకునే ఎన్నికలు కావడంతో జగన్మోహన్  రెడ్డి జనాన్ని సమ్మోహితుల్ని చేసే అత్యంత ఆకర్షణీయమైన హామీలను ప్రకటిస్తారని పార్టీ కేడర్ చాలా ఆశలు పెట్టుకుంది. అలాంటి ఒక్కటి కూడా లేదు సరికదా.. కనీసం చంద్రబాబునాయుడు ప్రకటించిన వాటిలో పదోవంతు ఆకర్షించేలా కూడా జగన్ హామీలు లేవు అనేది పార్టీ కేడర్ లో నిరాశను నింపేస్తోంది.

తమ అధినేత చేసిన పనులు పట్ల చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారని, అమలవుతున్న పథకాలను తలదన్నేలా చంద్రబాబునాయుడు ప్రకటించిన అంశాలను విస్మరించి.. ఇంత పేలవమైన మేనిఫెస్టో తేవడం వారికి మింగుడుపడడం లేదు. చంద్రబాబు హామీలను ఎవరూ నమ్మరు- అనే ఆత్మవంచనతో జగన్ ఉంటే.. ఓట్లు రాలడం కష్టమేనని పార్టీ కేడర్ బాధపడుతోంది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles