ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా చాలా విషయాల్లో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును అనుసరిస్తూ ఉంటారు. ఏపీలో గెలిచిన తర్వాత.. పొరుగురాష్ట్ర సీఎం కేసీఆర్ తనకు పెద్ద దిక్కు అన్నట్టుగా కేసీఆర్ ఆయనతో అత్యంత తీయనైన సత్సంబంధాలను కొనసాగించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయనను ప్రసన్నం చేసుకోవడం కోసం.. సెక్రటేరియేట్ పై ఏపీకి పదేళ్ల హక్కులు ఉన్నా కూడా.. బేషరతుగా వాటిని వదులుకున్నారు. కేసీఆర్ తో చాలా ప్రేమగా వ్యవహరించారు. ఎంతగా అంటే.. ఆయనను ఓడించి తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డిని అభినందించడానికి కూడా జగన్ కు మనసు రాలేదు.
అలాంటి జగన్.. ఇప్పుడు ఎన్నికల విషయంలో కూడా కేసీఆర్ బాటనే అనుసరించే మాదిరిగా కనిపిస్తోంది. ప్రత్యేకించి ఉద్యోగులకు కేటాయించే పోస్టల్ బ్యాలెట్ల విషయంలో గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ సర్కారు చాలా కిరికిరి చేసింది. తమ ఓటు హక్కు కోసం ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు చాలా పోరాడాల్సి వచ్చింది. రకరకాల మాయలు చేశారు, రకరకాల ఏర్పాట్లు ప్రకటించారు గానీ.. తీరా వేలాది మందికి పోస్టల్ బ్యాలెట్లు అందకుండానే చేశారు. ఉద్యోగ వర్గాల్లో కేసీఆర్ పరిపాలన పట్ల తీవ్రస్థాయి అసహనం ఉన్నదనే భయంతోనే పోస్టల్ బ్యాలెట్లు అసలు పోల్ కాకుండానే అడ్డుకోవాలని వారు మార్గాన్వేషణ చేశారు.
ఇప్పుడు జగన్ సర్కారు కూడా అచ్చంగా అలాంటి వ్యూహరచనతోనే ముందుకు వెళుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. జగన్ కు కూడా ఉద్యోగులంటే అపరిమితమైన భయం ఉంది. ఉద్యోగవర్గాల్లో నూటికి నూరుశాతం ఓట్లు తనకు వ్యతిరేకంగా పడతాయనే భయం వైసీపీలో ఉంది. ఉద్యోగులను జగన్ వేధించిన తీరుకు ఆ వర్గాల్లో చాలా నిరసన భావం ఉంది. అసలు ఉపాధ్యాయులనైతే ఎన్నికల విధుల్లోనే ఉండకుండా తప్పించడానికి కూడా జగన్ ప్లాన్ చేశారు గానీ.. ఈసీ ఆదేశాలతో ఆ పప్పులు ఉడకలేదు. ఉపాధ్యాయుల్లో తమ ప్రభుత్వం పట్ల ఉండే నిరసన తమకు చేటు చేస్తుందనే భయం వైసీపీలో బాగా ఉంది.
అందుకే కేసీఆర్ బాటలో పోస్టల్ బ్యాలెట్లు వారికి అందజేయడం ఆ ప్రాసెస్ ను పద్ధతిగా పూర్తిచేయడంలో జాప్యం చేయడం ద్వారా కాస్త నష్టనివారణ చేయాలని వారు భావిస్తున్నారు. అయితే తెలుగుదేశం ముందుగానే అలర్ట్ అయి, ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేసింది. ఈసీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా.. పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి ఇంకా కనీస ఏర్పాట్లు చేయలేదని వారంటున్నారు. ఉద్యోగులకు ఫాం 12 అందించడంలోనూ నిర్లక్ష్యం వహిస్తున్నారని వర్ల రామయ్య ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
జగన్ గనుక కేసీఆర్ స్ఫూర్తితో పోస్టల్ బ్యాలెట్ లో ఇలాంటి కిరికిరి చేస్తే.. అక్కడ కేసీఆర్ కు పట్టిన గతే పడుతుందని కూడా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
పోస్టల్ బ్యాలెట్లలో కిరికిరి చేస్తే కేసీఆర్ కు పట్టిన గతే!
Tuesday, November 19, 2024