వారి మధ్య వ్యక్తిగత ప్రేమానురాగాలు పుష్కలంగా ఉండవచ్చు గాక! వాటిని వ్యక్తిగతంగా చూపించుకుని ఉంటే బాగుండేది. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావలసిన హక్కులను- తమ విందు స్వీకరించి తమకు ధారా దత్తం చేసినందుకు మురిసిపోయారో ఏమో.. కల్వకుంట్ల కుటుంబం జగన్ పట్ల అపరిమిత ప్రేమానురాగాలను పెంచుకుంది. రాజశేఖరరెడ్డి పట్ల కేసీఆర్ అప్పట్లో చూపించిన శత్రుభావాన్ని, విచక్షణను కూడా మరిచిపోయి ఆ ప్రేమను రాజకీయంగా కూడా చూపించాలని అనుకుంది. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలలో ఆయన పరిపాలన పట్ల ఉన్న వ్యతిరేకతను గమనించడానికి వారి కండ్లకు పొరలు అడ్డు వచ్చాయి. ఏపీలో ఎన్నికలు జరగడానికి ముందు ఆ తరువాత కూడా.. జగన్మోహన్ రెడ్డి భారీ మెజారిటీతో గెలవబోతున్నట్లుగా తమకు సమాచారం ఉన్నదని కల్వకుంట్ల తండ్రీ కొడుకులు ఇద్దరూ పలుమార్లు ధ్రువీకరించారు. ఆనాడు వారు చేసిన భజన ఇప్పుడు వారి పరువే తీస్తోంది.
కేవలం తన సోదరుడు జగన్ ను మాత్రమే కాకుండా ఆయన పార్టీ వారిని కూడా వెనకేసుకు వచ్చారు కల్వకుంట్ల తారక రామారావు! ధర్మవరంలో బిజెపి నాయకుడు సత్యకుమార్ చేతిలో ఓడిపోయిన కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని కేటీఆర్ సమర్ధించారు. దీనికి స్పందిస్తూ మీ ఫ్రెండ్ కేతిరెడ్డి ఎలాంటి భూకబ్జాలకు పాల్పడ్డాడో తమకేమీ తెలిసినట్లుగా లేదని ఎద్దేవా చేశారు ఆయన. కేటీఆర్ కేతిరెడ్డి ఒకేచోటకు చేరి ఒకరినొకరు ఓదార్చుకుంటున్నారని విమర్శించారు. ఇలా ప్రజల మనోగతానికి దూరంగా పాలన సాగించినందునే తెలంగాణలో బారాసను ఏపీలో వైకాపాను ప్రజలు ఓడించారని మంత్రి సత్యకుమార్ అన్నారు.
మరోవైపు అప్పట్లో జగన్ మళ్ళీ గెలుస్తారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల గురించి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరో రకమైన భాష్యం చెప్పడం విశేషం. జగన్ మళ్ళీ గెలవాలని ఆయన చేతుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింతగా నలిగిపోవాలని, మరింత ఘోరమైన దుస్థితికి చేరుకోవాలని కేటీఆర్ కోరుకున్నారేమో అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు.
మరొకవైపు కేటీఆర్ జగన్ ఇద్దరూ ఓటమిలో కూడా మిత్రులే అంటూ ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు కూడా సెటైర్లు వేయడం విశేషం. జగన్ ఎందుకు ఓడిపోయాడో కేటీఆర్ కు అర్థం కాకపోయినా- వారిద్దరిని సమంగా ఓడించిన ప్రజలకు కారణాలు తెలిసినవే అని రఘురామకృష్ణరాజు అనడం విశేషం. తెలంగాణలో కేటీఆర్ ఓడిపోతే జగన్ సానుభూతి కూడా వ్యక్తం చేయలేదని.. కానీ జగన్ ఓడిపోయినందుకు కేటీఆర్ మాత్రం దుఃఖిస్తున్నారని రఘురామ ఎద్దేవా చేస్తున్నారు.
మొత్తానికి ఎన్నికల సమయంలో తమ వ్యవహారం తాము చూసుకోకుండా.. ఏపీ రాజకీయాలలో జగన్ గెలుస్తారంటూ పదే పదే ప్రకటనలు చేసిన పాపానికి.. ఇప్పుడు కేటీఆర్ ఇలాంటి ట్రోలింగుకు గురికావలసి వస్తోంది.
జగన్ భజన.. కేటీఆర్ పరువు తీస్తోంది!
Tuesday, January 21, 2025