పాపం అయిదేళ్లు పాటూ ప్రజల మధ్యలోకి అడుగు పెట్టకుండా.. ఏసీ కారుల్లో తిరగాల్సి వచ్చినా సరే రోడ్లకు ఇరువైపులా పరదాలు కట్టించుకుంటూ.. ఆకాశంలో హెలికాప్టర్లో వెళ్లాల్సి వచ్చినా సరే.. కింద రోడ్ల మీద చెట్లు కొట్టివేయిస్తూ.. మంత్రులకు కూడా అపాయింట్‌మెంట్లు ఇవ్వకుండా తాడేపల్లి ప్యాలెస్ ఏసీ గదుల్లోనే గడుపుతూ వచ్చిన జగన్మోహనరెడ్డి.. ఎండను లెక్క చేయకుండా ఒక నెలరోజుల పాటూ రాష్ట్రమంతా తిరగాల్సి వచ్చేసరికి విపరీతమైన అలసట కమ్మేసినట్టుంది. ఇప్పుడు ఆయన హాయైన విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నారు. అందుకే విదేశీయాత్రలు ప్లాన్ చేసుకున్నారు. కాకపోతే ఆయన బెయిలు మీద బయటి ప్రపంచంలో ఉన్న నిందితుడు గనుక.. తనకు బుద్ధిపుట్టగానే విదేశాలకు వెళ్లిపోవడం కుదరదు. అందుకే సీబీఐ కోర్టు ద్వారా అనుమతి కోరారు. న్యాయమూర్తి సీబీఐను అభిప్రాయం అడగడంతో వారు విదేశాలకు వెళ్లడానికి అనుమతి ఇవ్వవద్దని అభ్యంతరం తెలిపారు. దీంతో.. ఎన్నికల పర్వం ముగియగానే విదేశాలకు విహార యాత్ర వెళ్లాలనుకున్న జగన్ ఆశలకు గండి పడుతుందేమో అనిపిస్తోంది.
ఈ నెల 13న ఏపీలో పోలింగ్ ఒకే విడతలో జరగనుంది. ఏమైనా అనివార్య పరిస్థితులు ఎదురై, అవాంఛనీయ సంఘటనలు వాటిల్లి రీపోలింగ్ వచ్చినా సరే.. 15 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంటుంది. దీనికి తగినట్టుగా 11వ తేదీ సాయంత్రానికి ఏపీలో ఎన్నికల ప్రచారం కూడా ముగుస్తుంది. బహుశా ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నారో ఏమో తెలియదు గానీ.. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఈనెల 17వ తేదీనుంచి జూన్ 1 వతేదీ వరకు విదేశీయాత్రకు అనుమతి కావాలని సీబీఐ కోర్టును అభ్యర్థించారు. యూరప్ లో లండన్, ఫ్రాన్స్ లతో పాటు స్విట్జర్లాండ్ లలో పర్యటించాలని ఆయన కోరారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు.. సీబీఐను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అయితే గురువారం దాఖలు చేసిన కౌంటర్లో సీబీఐ మాత్రం, జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వవద్దని పేర్కొంది. ఈ పిటిషన్ ను సీబీఐ కోర్టు ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది.
సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో, పైగా ఎన్నికలు కూడా పూర్తయిన తరుణం గనుక.. జగన్ కు కోర్టు అనుమతి లభిస్తుందా లేదా అనేది సందేహంగా ఉంది. ఆయన విదేశీ పర్యటన ఉండకపోవచ్చునని.. ఆయన ఫలితాలు వెలువడే వరకు, పార్టీనాయకులకు ఎప్పటిలా అపాయింట్‌మెంట్లు ఇవ్వకుండా ఆంతరంగికుల మధ్య కూర్చుని టెన్షన్ తో ముళ్ల మీద కూర్చున్నట్టుగా గడపాల్సిందేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
జగనన్న లండన్ యాత్ర డైలమాలో పడినట్టే!
Wednesday, December 18, 2024