జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అరాచక వ్యవహారాలపై లోతైన అధ్యయనం ఇంకా సాగుతూనే ఉంది. తవ్వే కొద్దీ కొత్త అక్రమాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. వైసీపీ అగ్రనేతలు మాత్రమే కాదు.. కొత్త కొత్త పేర్లు, కొత్త కొత్త యవ్వారాలు కూడా వెలుగు చూస్తున్నాయి. ఎన్ని అకృత్యాల్లో, అవినీతి కార్యకలాపాల్లో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాత్ర ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉన్నదో తెలియదు. ముందు ముందు ఎన్ని వ్యవహారాల్లో ఆయన మీద కేసులు నమోదు అవుతాయో తెలియదు. కానీ.. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత.. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని పోలీసు విచారణకు రప్పించే తొలి క్రెడిట్ మాత్రం ఉండి ఎమ్మెల్యే రఘురామక్రిష్ణ రాజు ఖాతాలో పడనుంది. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మరికొందరు పోలీసు ఉన్నతాధికారులు కలిసి తనమీద హత్యాయత్నం చేశారంటూ ఆయన పెట్టిన కేసులో జగన్ విచారణకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
నరసాపురం వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామక్రిష్ణ రాజు అప్పట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేసినందుకు ఆయన మీద రాజద్రోహం కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఆయన్ను హైదరాబాదులో అరెస్టు చేసి గుంటూరు సీఐడీ కార్యాలయానికి తీసుకువచ్చి తీవ్రంగా హింసించారు. అప్పట్లోనే తనను హింసించిన సంగతి రఘురామ కోర్టుకు నివేదించారు. తన మీద హత్యాయత్నం జరిగిందని పేర్కొన్నారు. తీరా ఎన్నికల సమయంలో తెలుగుదేశంలో చేరి.. ఉండి ఎమ్మెల్యేగా గెలిచారు.
గెలిచిన వెంటనే.. జగన్ ప్రోద్బలంతో తన మీద పోలీసు అధికారులు హత్యాయత్నం చేశారంటూ గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నిందితులుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సీఐడీ పూర్వపు డీజీ సునీల్ కుమార్, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, గుంటూరు సీఐడీ ఏఎస్పీ విజయపాల్ తదితరులపై ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ప్రస్తుతం పోలీసులు విచారణ ప్రారంభించారు. విజయపాల్ కు ఆల్రెడీ నోటీసులు పంపి.. నాటి సంఘటనకు సంబంధించి సాక్ష్యాలు అందించాలని కోరడం జరిగింది. సునీల్ కుమార్, ఆంజనేయులు లకు కూడా నోటీసులు పంపబోతున్నారు. ఇదే కేసులో మాజీ సీఎం జగన్ కు కూడా నోటీసులు పంపి విచారణకు పిలుస్తారని తెలుస్తోంది.
కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. గత అయిదేళ్ల జగన్ అరాచకాలపై నమోదు అయిన తొలికేసు ఇదే. ఈ కేసులోనే జగన్ తొలి విచారణ ఎదుర్కోవాల్సి రావొచ్చు. ముందు ముందు ఆయన మీద ఇంకా ఎన్ని కేసులు నమోదు అవుతాయో.. ఎన్ని విచారణలు ఎదుర్కోవాలో అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.