సాధారణంగా సిటింగ్ ఎమ్మెల్యేలు బాగా పనిచేస్తే వారికి మళ్ళీ టికెట్ ఇవ్వడం, లేకపోతే పక్కన పెట్టడం మాత్రమే పార్టీలు చేస్తుంటాయి. కానీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ సారి వెరైటీ మార్గం అనుసరించారు. సిటింగులనే నియోజకవర్గాలు మార్చి సుమారు 70 మందిలో అయోమయం సృష్టించారు. అనేక నిర్ణయాలపై ఆయన యూటర్న్ తీసుకున్నారు కూడా. తద్వారా నిర్ణయాల్లో స్థిరత్వం లేదని, ఒత్తిడులకు తలొగ్గుతున్నారని ముద్ర పడ్డారు. జగన్ ఆలోచనల్లో చంచలత్వం ఉన్నదని అందరూ అనుకున్నారు.
అయితే జగన్మోహన్ రెడ్డి లోని చంచలత్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇవాల్టి నుంచి నామినేషన్ల పర్వం మొదలు అవుతుండగా.. ఉపసంహరణలు కూడా ముగిసేలోగా కనీసం 30 మంది అభ్యర్థులను మార్చడానికి జగన్ కసరత్తు చేస్తున్నట్టుగా పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఒకవైపు ప్రచారపర్వం సగం ముగిసిపోయినప్పటికీ.. ఇంకా అభ్యర్థుల మార్పు గురించి జగన్ ఆలోచిస్తూ ఉన్నారంటే అందుకు ప్రధానంగా రెండు కారణాలు వినిపిస్తున్నాయి.
ఒకటి- ఇంకా చేయిస్తున్న సర్వేల్లో వైసిపి అభ్యర్థులు నెగ్గే అవకాశం లేదని తేలుతుండడం. చాలా చోట్ల కూటమి అభ్యర్థులు గెలుపు దిశగా ముందంజలో ఉన్నట్టు వైసీపీ సర్వేల్లో తేలుతోంది. అది తన అరాచక పాలన పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ప్రభావం అని ఒప్పుకోవడానికి ఈగో అడ్డు వస్తున్న జగన్.. అభ్యర్థుల మీదికి నెట్టేసి వారిని మార్చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.
రెండు – టికెట్ పుచ్చుకునే సమయంలో వైసీపీ అభ్యర్తులు పలువురు తాము ఎన్నికల్లో ఎంత ఖర్చు పెట్టుకోగలమో అధినేతకు ఒక హామీ ఇచ్చారు. వారి ధన వనరులను చెక్ చేసి కన్ఫర్మ్ చేసే బాధ్యతను జగన్ కొందరు కీలక నేతలకు అప్పగించారు.
అభ్యర్థిత్వం ప్రకటించినప్పటికీ కండిషన్ ఏంటంటే.. బి ఫాం లు ఇచ్చే లోగా వారు తమ ధన వనరులను ఆయా కీలక నేతలకు చూపించాలి. ఒక్కో అసెంబ్లీ నియోజక వర్గానికి 50 కోట్లు అనేది ఒక బెంచ్ మార్క్ గా నిర్ణయించారు. అందుకు ఒప్పుకున్న వారినే అభ్యర్తులుగా ప్రకటించారు. అయితే జాబితా వచ్చేసిన తర్వాత చాలామంది, సదరు కీలక నేతలకు తమ వద్ద డబ్బు రెడీగా ఉన్నట్లు రుజువులు చూపించలేక పోతున్నారని సమాచారం. అలాంటి వారి పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలని జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. వారికి నచ్చజెప్పి ఉపసంహరణ ముగిసేలోగా కొత్తవారిని ఎంపిక చేసి బరిలో మొహరిస్తారని తెలుస్తోంది.
కారణాలు ఏవైనప్పటికీ.. అభ్యర్థుల్లో ఇంకా మార్పుల గురించి ఆలోచిస్తుండడం జగన్ లోని భయానికి ప్రతీక అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.