సుదీర్ఘమైన బెంగుళూరు యలహంక ప్యాలెస్ విశ్రాంతిని ముగించుకున్న తర్వాత.. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతున్నదో గమనినంచడానికి కాస్త ఖాళీ దొరికినట్టుగా ఉంది. అదానీ నుంచి తాను ముడుపులు తీసుకున్నట్టుగా అమెరికాలో నమోదైన కేసులకు సంబంధించి.. ఇన్నాళ్లుగా తన అనుచరులందరూ వివరణలు ఇస్తూనే ఉన్నప్పటికీ.. తాను కూడా మీడియా ముందుకు వచ్చి.. మాట్లాడడానికి, అదే డప్పును మళ్లీ తాను కొట్టడానికి ఆయన సాహసించారు. మొత్తానికి ప్రెస్ మీట్ పెట్టి.. బోలెడు వివరాలు గంటల కొద్దీ మాట్లాడడం ద్వారా.. జగన్మోహన్ రెడ్డి తనను తానే అడ్డంగా బుక్ చేసుకున్నారు. సెల్ఫ్ గోల్ వేసుకున్నారు.
జగన్ ఎంతసేపూ.. తాను డీల్ చేసుకున్న దానికి కొన్ని సంవత్సరాల ముందు .. సోలార్ విద్యత్తు వచ్చిన కొత్తల్లో చంద్రబాబునాయుడు ప్రభుత్వం కుదుర్చుకున్న డీల్ లోని ధరతో పోలుస్తూ.. తాను 2.49 రూపాయలకు ఒప్పందం చేసుకోవడం ద్వారా రాష్ట్రానికి లక్షల కోట్లు మిగిల్చాను అన్నట్టుగా బిల్డప్ ఇచ్చారు. అయితే జగన్ సెకితో ఒప్పందం చేసుకున్న సమయానికి ఇతర ఒప్పందాల ధరలు ఎలా ఉన్నాయో గమనిస్తే.. జగన్ తన మాయమాటలతో జనాన్ని ఎంతగా మోసం చేయాలని అనుకుంటున్నారో ఇట్టే అర్థమైపోతుంది.
అదే సమయంలో అదానీ కంపెనీల నుంచి గుజరాత్ కేవలం రూ.1.99 కే యూనిట్ వంతున ఒప్పందం చేసుకుంది. దానికంటె జగన్ చేసుకున్న ఒప్పందం యాభై పైసలు ఎక్కువ. కేవలం అదొక్కటే కాదు. నిజానికి జగన్ 2021 డిసెంబరులో సెకితో ఒప్పందం చేసుకున్నారు. అదే ఏడాది మే నెలలో సెకి సౌరవిద్యుత్తు వేలం నిర్వహిస్తే ఒక యూనిట్ కు గరిష్టంగా పలికిన ధర రూ.2.14 మాత్రమే. అది జరిగిన ఆరునెలల తర్వాత.. 50 పైసలు ఎక్కువకు జగన్ అదే సెకితో ఒప్పందం చేసుకున్నారు. పోనీ అప్పటికి ధర పెరిగిందని అనుకోవడానికి కూడా వీల్లేదు. 2022 జనవరిలో సెకి సౌరవిద్యుత్తును విక్రయించిన ధర రూ.2.17 మాత్రమే. ఏ రకంగా చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి రాష్ట ఖజానాకు భారీగా లక్ష కోట్లకు పైగానే నష్టం చేకూర్చినట్టుగా తెలుస్తోంది.
జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ తనను తానే అడ్డంగా బుక్ చేసుకున్నారని, ఈ గణాంకాలను లోతుగా గమనించిన ఎవ్వరికైనా ఇట్టే అర్థమవుతుంది. ఇంకా తన మాయమాటలతో జగన్ రాష్ట్రాన్ని బుకాయించగలననే భ్రమల్లోనే ఉన్నారేమో తెలియదు.
తనను తానే అడ్డంగా బుక్ చేసుకున్న జగన్!
Wednesday, January 8, 2025