స్టోన్ క్రషర్స్ యజమానులను బెదిరించి.. 2.2 కోట్ల రూపాయల ముడుపులు స్వీకరించిన కేసులో మాజీ మంత్రి విడదల రజని ముదస్తు బెయిలు పిటిషను ఇంకా విచారణలోనే ఉంది. ఈలోగా అదే కేసులో అరెస్టు అయిన ఆమె మరిది, ఏ3, విడదల గోపీ బెయిలు కోసం పిటిషన్ వేసుకోవడమూ.. కోర్టు ఆ విజ్ఞప్తిని తిరస్కరించడమూ కూడా జరిగిపోయింది. అయితే ఈ బెయిలు పిటిషన్ విచారణ సందర్భంగా జరిగిన వాదప్రతివాదనలు, న్యాయమూర్తుల వ్యాఖ్యలు గమనిస్తే.. ఈ ముడుపుల కేసులో వదినమ్మ విడదల రజని పాత్రను మరిది స్పష్టంగా చెప్పేస్తే తప్ప.. అతనికి బెయిలు దక్కడం కూడా కష్టమే అనే అభిప్రాయం కలుగుతోంది.
విడదల రజని తాను ఎమ్మెల్యేగా గెలిచిన నాటినుంచే చిలకలూరిపేట నియోజకవర్గంలో వసూళ్లు, దందాలు విచ్చలవిడిగా ప్రారంభించారు. లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్స్ యజమానులను పిలిపించి..తనకు అయిదు కోట్ల రూపాయలు ముడుపులు ఇస్తే తప్ప.. నియోజకవర్గంలో వ్యాపారం చేసుకోలేరంటూ బెదిరించారు. ఆ తర్వాత రీజినల్ అధికారి ఐపీఎస్ జాషువాను పురమాయించి తనిఖీలకు పంపారు.
పెద్దసంఖ్యలో సిబ్బందిని తీసుకువెళ్లి క్రషర్స్ ను తనిఖీ చేసిన జాషువా.. మేడంతో సెటిల్ చేసుకోకుంటే 50 కోట్లు జరిమానా తప్పదని వారిని బెదిరించారు. దాంతో వారు ఆమెనే సంప్రదించి.. రెండుకోట్లకు బేరమాడి ముడుపులకు సిద్ధమయ్యారు. పురుషోత్తపట్నంలోని తన మరిది విడదల గోపీ ఇంటికి తీసుకువెళ్లి ఆ సొమ్ము ఇవ్వాలని ఆమె పురమాయించారు. ఆ మేరకు గోపీ చేతికి మేడం కోసం 2 కోట్లుకు, గోపికి, జాషువాకు చెరి పది లక్షల వంతున వారు చెల్లించుకున్నారు.
ఈ మొత్తం బాగోతంలో విడదల గోపీ పాత్ర కేవలం వదిన తరఫున రెండుకోట్ల రూపాయలు పుచ్చుకుని.. మళ్లీ ఆమెకు అప్పగించడం మాత్రమే. కాకపోతే అదనంగా తనో పదిలక్షలు పుచ్చుకున్నారు. కానీ బెయిలు పిటిషన్ వాదనల విషయానికి వచ్చేసరికి.. కేసు సంబంధిత మెటీరియల్ అతని నుంచి ఇంకా స్వాధీనం చేసుకోవాల్సి ఉందని పోలీసులు వాదనలు వినిపించారు. అలాగే.. లంచం తీసుకున్న సొమ్ము అతని నుంచి రికవరీ చేయాల్సి ఉందని కూడా వారు కోర్టులో చెప్పారు. ఈ దశలో బెయిలు ఇస్తే దర్యాప్తు ముందుకు సాగదని కోర్టు కూడా అభిప్రాయపడింది. బెయిల్ పిటిషన్ కొట్టేశారు.
అంటే.. తీసుకున్న లంచం సొమ్ము రికవరీ అయితే తప్ప.. ఆయన బెయిలు విజ్ఞప్తిని కూడా కోర్టు పరిశీలించే అవకాశం లేదన్నమాట. ఆ లంచం వదినకోసం తీసుకున్నది కావడం వల్ల.. సొమ్ము రికవరీ అంటే ఆమెనుంచే రావాలి. అంటే ఆమె పాత్రను విడదల గోపీ బయటపెట్టక తప్పదు. కేసు నుంచి విముక్తి తర్వాత.. కనీసం బెయిలు పొందాలంటే కూడా.. వదిన పాత్రను బయటపెట్టకుండా కష్టమేనని నిపుణులు వాదిస్తున్నారు.
