తప్పుడు పనులు చేసినప్పుడు.. తమ పార్టీ అధికారంలో ఉన్నంత కాలమూ దబాయించి బతికేయవచ్చు. కానీ.. తమ హవా పడిపోయిన తర్వాత.. తమను ప్రజలు తిరస్కరించిన తరువాత.. బుకాయించుకుంటూ బతకాలి. అలాంటి బుకాయింపులు ఎంతకాలం కాపాడుతాయి? ఏదో ఒకనాటికి సత్యం వెలుగులోకి వస్తుంది కదా? జనం ముందు జవాబుదారీతనం చూపించాల్సి వస్తుంది కదా? కేసులుగట్రా నమోదు అయితే.. చేసిన పాపాలకు శిక్షలు అనుభవించక తప్పదు కదా..? సరిగ్గా ఇలాంటి సంక్లిష్ట స్థితిలోనే ఉన్నారు ఇప్పుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా చక్రంతిప్పిన ఈ కీలక మంత్రి అరాచకాలు అన్నీ ఇప్పుడు ఒక్కటొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. తిరుపతిలో బుగ్గమఠంకు చెందిన భూములను ఆయన ఆక్రమించిన సంగతి కూడా దాదాపుగా నిర్ధారణ అవుతోంది. అయినా సరే ఆయన మాత్రం మెట్టు దిగడం లేదు. కనీసం విచారణకు కూడా సహకరించడం లేదు. అంగుళం భూమి కూడా తాము ఆక్రమించలేదు అంటున్నారే తప్ప.. అందుకు సంబంధించి రికార్డులు చూపించమంటే ముందుకు రావడం లేదు.
తిరుపతిలో బుగ్గమఠంకు 14.5 ఎకరాల భూమి ఉంది. తమ భూమికి హద్దులు తెలియజేయాలంటూ.. బుగ్గమఠం ఈవో వెంకటేశ్వర్లు గతనెల 17న రెవెన్యూ వారికి వినతిపత్రం ఇఛ్చారు. సర్వే అధికారులు రోవర్ ద్వారా ఈ స్థలం హద్దులు గుర్తించారు. తమ నివేదికతోపాటు, గూగుల్ మ్యాప్ లను కూడా మఠం అధికారులకు అందించారు. ఈ 14.5 ఎకరాల్లో 3.88 ఎకరాలు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమణలో ఉన్నట్టుగా గతంలోనే విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఈ ఆక్రమించిన స్థలానికి సంబంధించి.. తమ వద్ద రికార్డులు ఉంటే ఇవ్వాలని బుగ్గమఠం వారు పెద్దిరెడ్డికి నోటీసులు ఇచ్చినా కూడా ఆయన ఇప్పటిదాకా స్పందించనేలేదు.
బుగ్గమఠం భూములను ఆక్రమించి నిర్మించుకున్న నివాసంలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న రోజుల్లో ఆయన 9.51 లక్షల ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టించి.. తన నివాసానికి సిమెంటు రోడ్డు వేయించుకున్నారు. స్థానికుల కోసం రోడ్డు వేస్తున్నట్టు రికార్డుల్లో రాసుకున్నారు గానీ.. ఆ రోడ్డు మీద వేరే నరమానవులు ప్రయాణించకుండా.. కట్టుదిట్టమైన ఏర్పాట్లు గతంలో చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో బుగ్గమఠం సర్వే పూర్తయిన తర్వాత.. అసలు వారికి ఉన్న భూమి ఎంత? లీజుకు ఇచ్చింది ఎంత?కబ్జాలు అయినది ఎంత? రెవెన్యూవారు లెక్కతేలుస్తున్నారు. భూకబ్జాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోనున్నారు. అదే జరిగితే.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నదంటూ.. గగ్గోలు పెట్టడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటినుంచే సిద్ధంగా ఉంటుందనడంలో సందేహం లేదు.
బుగ్గమఠం భూకబ్జాల్లో పెద్దిరెడ్డికి చిక్కులు తప్పవా?
Monday, December 8, 2025
