‘‘దీని తలరాతే దీనికి తెలియదు.. ఇంకా ఇది ఇతరుల తలరాతను గురించి ఏం చెబుతుంది..’’ అంటూ ఒక సినిమాలో జోస్యం చెప్పే చిలక గురించి ఒక జోకు ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలోని గులాబీ దళం సారథులు, తండ్రీకొడుకులు ఇద్దరి గురించి ప్రజలు అలాగే అనుకుంటున్నారు. వీరిద్దరూ కలిసి చిలక జోస్యం తరహాలో వెల్లడించిన ఫలితాల అంచనాలన్నీ అత్యంత దారుణంగా తలకిందులు అయ్యాయి. ఏపీ ఫలితాల గురించి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాడనే సమాచారం తమకు ఉన్నదంటూ ఈ గులాబీ తండ్రీకొడుకులు చేసిన ప్రకటనలు ఇప్పుడు విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి. తమ పార్టీ ఏమైపోతుందో సొంత జాతకమే చెప్పుకోలేని వారు, పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల జాతకం చెబుతున్నారు అంటూ అందరూ ఎగతాళి చేస్తున్నారు.
భారత రాష్ట్ర సమితి సారథి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఎంతో ఆత్మీయమైన సత్సంబంధాలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. కేవలం కేసీఆర్ తో ఉన్న అనుబంధం, ఇతర అవసరాల కారణంగానే.. పదేళ్లపాటు హైదరాబాదులో రాజధానిగా కొనసాగగల హక్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి తాను సీఎం అయిన వెంటనే సెక్రటేరియట్ మీద ఉన్న వాటాహక్కులు అన్నిటినీ తెలంగాణకు ధారాదత్తం చేశారు. తొమ్మిదో షెడ్యూల్లో ఉండే ఆస్తుల పంపకం ఎటూ తేలకముందే ఆయన హక్కుల అప్పగింత సంతకాలు పెట్టేయడం అప్పట్లో వివాదాస్పదం అయింది. దీనివలన, ఇప్పటివరకు పెండింగ్ పనులు పెండింగ్లోనే ఉండిపోయాయి.
తాజా ఎన్నికల సమయంలో అటు తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గానీ, కొడుకు తారక రామారావు గాని.. ఏపీ ఎన్నికల గురించి తమ అంచనాలను పలు సందర్భాలలో వెల్లడించారు. అక్కడ జగన్ మళ్ళీ గెలుస్తాడని జోస్యం చెప్పారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో భారత రాష్ట్ర సమితికి దక్కిన పరాజయం కంటే, అత్యంత ఘోరమైన రీతిలో జగన్మోహన్ రెడ్డి పరాజయం నమోదు అయింది.
తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో తమ పార్టీ భారాస 15 సీట్లు గెలుస్తుందని కూడా ఇదే తండ్రీ కొడుకులు చెప్పుకున్నారు. అక్కడ వారి పార్టీ సున్న స్థానాలు సాధించిన విధంగానే.. ఏపీలో జగన్ రెడ్డి పార్టీ 11 స్థానాలకు పరిమితమైంది. పార్టీల పరువు మాత్రమే కాదు.. ప్రజల నాడిని పసిగట్టి ఫలితాలను అంచనా వేసే సామర్థ్యం విషయంలో కూడా ఈ తండ్రీకొడుకుల పరువు పోయిందని ప్రజలు నవ్వుకుంటున్నారు.
గులాబీల చిలకల జోస్యం తప్పి పరువు పోయెనే!
Friday, December 6, 2024