గుండమ్మ కథ (విడుదల 1962)

Friday, April 26, 2024

విజయా వారి నుండి వచ్చే ఆణిముత్యాలాంటి అన్ని సినిమాల్లాగే వచ్చిన మరో ఆణి ముత్యం గుండమ్మ కథ. విజయావారికి ఈ సినిమా వారి చివరి విజయవంతమైన నలుపు తెలుపుల చిత్రం. ఆకాలంలో ఇది అగ్రశ్రేణి నటులతో నిర్మించిన సినిమా అయినా, ఈ సినిమాకు ”గుండమ్మ కథ” అని సూర్యకాంతం పాత్ర పేరుమీద సినిమా పేరు పెట్టడమే గొప్ప వైవిద్యం.

సినిమా విశేషాలు

జానపద బ్రహ్మగా పేరొందిన విఠలాచార్య కన్నడంలో మనె తుంబిద హెణ్ణు పేరిట కుటుంబ కథాచిత్రాన్ని తెరకెక్కించారు. చిత్ర నిర్మాణానికి విఠలాచార్య నిర్మాత, వాహినీ స్టూడియోస్ అధినేత బి.నాగిరెడ్డి సహకారం పొందారు. ఆ కృతజ్ఞతతో విఠలాచార్య గారు సినిమా హక్కుల్ని నాగిరెడ్డి గారు అడగగానే ఆయనకి ఇచ్చేశారు. మనె తుంబిద హెణ్ణు సినిమాలో గుండమ్మ అనే గయ్యాళికి, నోరుమెదపలేని భర్త ఉంటాడు. ఆమె తన సవతి కూతురుని ఓ పిచ్చివాడికి ఇచ్చి పెళ్ళిచేస్తుంది. సవతి కూతురు మేనమామకు ఆ విషయం తెలిసి, గుండమ్మపై పగబడతాడు. అతను గుండమ్మ స్వంత కూతురికి నేరాలకు అలవాటుపడ్డ జైలుపక్షికి ఇచ్చి పెళ్ళిజరిగేలా పథకం ప్రకారం చేయిస్తాడు. ఇలా సాగుతుంది ఆ సినిమా. అయితే ఇందులో గుండమ్మ కుటుంబ వ్యవహారాలు నాటకీయంగా సాగుతూ, నాగిరెడ్డికి చాలా తమాషాగా అనిపించాయి. దాంతో విజయా ప్రొడక్షన్స్ చరిత్రలోనే తొలిసారి ఓ రీమేక్ చేసేందుకు సిద్ధపడి, కధలో చిన్న, చిన్న మార్పులను చేసి, డి.వి.నరసరాజుతో ట్రీట్మెంట్, మాటలు రాయించేశారు నాగిరెడ్డి. సినిమాకు దర్శకునిగా నాగిరెడ్డి సోదరుడు బి.ఎన్.రెడ్డిని అనుకున్నారు. అయితే బి.ఎన్.రెడ్డి కళాత్మక చిత్రాల తరహా దర్శకుడు కావడమూ, ఇది ఆయన తరహా సినిమా కాకపోవడంతో పాటు బి.ఎన్.రెడ్డి లాంటి అగ్ర దర్శకుడు ఓ రీమేక్ సినిమా చేస్తే బాగోదన్న అనుమానం రావడంతో నాగిరెడ్డే వేరే దర్శకునితో చేద్దామని నిర్ణయించుకున్నారు. పి.పుల్లయ్య దర్శకత్వం వహిస్తే బావుంటుందని, ఆయనకు నరసరాజు సిద్ధం చేసిన డైలాగ్ వెర్షన్ ఆయనకు పంపారు. అది చదివిన పుల్లయ్య ఈ కథ, ట్రీట్మెంట్ నాకు నచ్చలేదు అని ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. దాంతో సినిమా నిర్మాణం మళ్ళీ వెనుకబడింది.

ఈ స్క్రిప్ట్ తన సన్నిహితుడు, సహ నిర్మాత, రచయిత అయిన చక్రపాణికి ఇచ్చారు నాగిరెడ్డి. చక్రపాణికి వికలాంగులు, పిచ్చివాళ్ళతో హాస్యం చేస్తూ సీన్లు నడపడం అంతగా నచ్చదు. దాంతో హీరో పిచ్చివాడు కావడమే ప్రధానమైన పాయింట్ అయిన ఈ సినిమా స్క్రిప్ట్ ఆయనకు నచ్చలేదు. కానీ గుండమ్మ కుటుంబ వ్యవహారాలు, ఆ పాత్రలు బాగా నచ్చిన నాగిరెడ్డి మాత్రం ఎలాగైనా సినిమా తీయాల్సిందేనన్న పట్టుదలతో ఉన్నారు. దాంతో చక్రపాణి మొత్తం స్క్రిప్టును తిరగరాసే పనిలో పడ్డారు. విలియం షేక్‌స్పియర్ వ్రాసిన ద టేమింగ్ ఆఫ్ ద ష్రూ నాటకంలో కథానాయికల పాత్రలను, వారి స్వభావాలను ఆధారం చేసుకుని చక్రపాణి కథను తిరగరాశారు.

సినిమాకు దర్శకునిగా చివరకు కమలాకర కామేశ్వరరావుని ఎంచుకున్నారు నాగిరెడ్డి. తర్వాత చక్రపాణి తిరగరాసిన కథకు ట్రీట్మెంట్, సీనిక్ ఆర్డర్ కోసం కథాచర్చలకు చక్రపాణితో, కమలాకర కామేశ్వరరావు, డి.వి.నరసరాజు కూర్చున్నారు. ఆ చర్చల్లో భాగంగా అప్పటివరకూ ఉన్న గుండమ్మ భర్త పాత్రను తీసేసి గుండమ్మను వైధవ్యం అనుభవిస్తున్నదానిగా చూపిద్దామని నిర్ణయించారు చక్రపాణి. అయితే కళకళలాడుతూ, నగలతో పసుపుకుంకుమలతో గుండమ్మను చూపిద్దామనుకున్న దర్శకుడు కామేశ్వరరావు ఆశాభంగం చెందారు. కానీ చక్రపాణి స్క్రిప్ట్ రచయితగా కథకు ఉపయోగపడని, కథలో మలుపులకు కారణం కాని పాత్ర వ్యర్థమన్న దృష్టితో “పెళ్ళానికి సమాధానం చెప్పలేని వాడు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఆ పాత్ర మన కథకు అనవసరం” అంటూ తేల్చి, పాత్రను తొలగించేశారు. అయితే మిగతా గుండమ్మ కుటుంబాన్నంతా యధాతథంగా తీసుకున్నారు.

విమర్శలు

సినిమా విడుదలకు ముందే విమర్శలు చెలరేగాయి. సినిమా రిలీజ్ కి ఇంకా పదిరోజుల సమయం ఉందనగానే, ఎల్వీ ప్రసాద్ ఇంట్లో జరిగిన పెళ్ళివేడుకల్లో గుండమ్మ కథ సినిమాను ప్రదర్శించారు. సినిమా చూసిన సినిమా వర్గాలు సినిమాలో కథే లేదని, సూర్యకాంతం గయ్యాళితనాన్ని సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదని విమర్శలు ప్రచారం చేశారు. హరనాథ్-విజయలక్ష్మి చేసిన పాత్రలు అనవసరమని, జమున పాత్ర చిత్రణ సరిగా లేదని మరికొందరు విమర్శించారు. చివరికి విజయా వారి నిర్మాణంలో మాయాబజార్ సహా ఎన్నో విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు కె.వి.రెడ్డిగారు కూడా సినిమా బాగోలేదని అన్నారు. ప్రివ్యూ తర్వాత నరసరాజుకు తన అభిప్రాయాన్ని చెప్తూ-“అదేం కథండీ! కృష్ణా, గుంటూరు జిల్లాల సంపన్న వర్గాల కథలా వుంది. చక్రపాణి గారే రాయగలరు అలాంటి కథలు. మీరు రాసిన డైలాగులు బాగున్నాయనుకోండి. ఒక్క డైలాగులతోనే పిక్చర్ నడుస్తూందా” అన్నారు. సినిమా విడుదలై హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తున్నప్పుడు- విజయా వారి సినిమా, పెద్ద నటీనటులు నటించారు. మొదట్లో హౌస్ ఫుల్ అవుతాయి. పోగాపోగా చూద్దాం అనేవారు. సినిమా ఘన విజయమని స్థిరపడిపోయాకా కూడా ఆయన సమాధాన పడలేదు, ఏంటోనండి. జనం ఎందుకు చూస్తున్నారో అర్థంకావట్లేదు అంటూ గుండమ్మకథ ప్రస్తావన వచ్చినపపుడల్లా అనేవారు.

సినిమా విడుదల ముందు విమర్శలు రావడంతో విడుదల సమయంలో చిత్రవర్గాలు ఉత్కంఠతో ఎదురుచూశారు. గుండమ్మ కథ ప్రివ్యూ చూసినప్పుడు ఎన్టీఆర్ నిక్కర్లో తెరపై కనిపించగానే ప్రివ్యూ చూస్తున్న చిన్నపిల్లలంతా ఒక్కపెట్టున నవ్వారు. అది చూసిన చక్రపాణి ఆ అంచనాతోనే ప్రివ్యూ అవగానే “ఎవరెన్ని అనుకున్నా సినిమా సూపర్ హిట్” అని తేల్చేశారు. ఆయన అంచనాలు నిజం చేస్తూ సినిమా అప్రతిహత విజయాలను సాధించింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles