బెల్టు షాపుల్లో ప్రమాదం పెద్దాయనకు తెలుసు గనుకనే..

Friday, November 1, 2024
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దీపం-2 పథకాన్ని దీపావళి పర్వదినం నాడు చాలా ఘనంగా ప్రారంభించారు. ఎన్నికలకు ఏడాది ముందుగానే.. ఏ సూపర్ సిక్స్ హామీలనైతే ప్రజలకు చంద్రబాబునాయుడు కానుకగా అందించారో.. వాటిని కార్యరూపంలోకి తీసుకురావడం ప్రారంభించారు. పేద మహిళలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే విధానం ప్రారంభం అయింది. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మహిళాలోకానికి ఈ కానుకతో పాటు.. దీపావళి బోనస్ గా మరొక తియ్యటి కబురు కూడా చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడగానీ లిక్కర్ బెల్టు షాపులు కనిపిస్తే వారి తాటతీస్తాం అని హెచ్చరించారు.

మద్యం వ్యాపారుల పట్ల ఖచ్చితత్వంతో ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ బెల్ట్ షాపులను కొనసాగనిచ్చేది లేదని చంద్రబాబునాయుడు అంటున్నారు. తొలినుంచి కూడా ఆయన ప్రభుత్వం ఈ స్పష్టతతోనే ఉంది. అలాగే ఇసుక, లిక్కర్ వ్యాపారాల్లో తమ పార్టీకి చెందిన ఎవ్వరూ జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు హెచ్చరిస్తున్నారు. బెల్ట్ షాపులు నడుపుతున్నట్టుగా తెలిస్తే.. ఆయా మద్యం దుకాణాల లైసెన్సులు రద్దు చేయడానికి కూడా పూర్తి అధికారాలు ఇచ్చేస్తూ చంద్రబాబు  మంచి నిర్ణయం తీసుకున్నారు. బెల్టుషాపుల వల్ల సమాజానికి జరిగే నష్టం, ప్రభుత్వానికి జరిగే చేటు రెండింటిమీద చంద్రబాబుకు అవగాహన ఉన్నదని, అందుకే ఆయన వాటి విషయంలో అంత కఠినంగా స్పందిస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మహిళల్లో పదిలమైన ఓటు బ్యాంకును తయారు చేసుకోవడానికి ఏ ప్రభుత్వమైనా పాటుపడుతుంది. మహిళల్లో చెడ్డపేరు తెచ్చుకున్న ప్రభుత్వం ఖచ్చితంగా మనుగడ సాగించడం కష్టం. జగన్మోహన్ రెడ్డి కూడా మహిళలకు అనేక విధాలుగా వారి ఖాతాల్లోకి డబ్బులు నేరుగా పంపించే పథకాలను అమలు చేశారు. అయినా సరే.. లిక్కర్ ధరలు విపరీతంగా పెంచేసి ఆ వ్యసనం ఉన్న పేదకుటుంబాలు గుల్లయిపోయేలా వక్రనీతి అమలు చేశారు. జగన్ ఒక చేత్తో పేద కుటుంబాలకు డబ్బులు ఇస్తూ.. మరో చేత్తో వారి సంపాదనతో సహా తిరిగి లాగేసుకుంటున్నాడనే చెడ్డపేరు బాగా వచ్చింది. చవకరకం, నాణ్యతలేని మద్యం కోసం తమ ఇళ్లలోని మగవాళ్లు పెద్దమొత్తాల్లో డబ్బులు తగలేస్తూ.. అదే సమయంలో ఆరోగ్యం పాడు చేసుకుంటూ ఉంటే.. మహిళల్లో పెల్లుబికిన ఆగ్రహం జగన్ పతన కారణాల్లో ఒకటి.

చంద్రబాబునాయుడుకు ఆ సంగతి తెలుసు. తమ ప్రభుత్వం మహిళల ఆదరణ చూరగొనేలాగా ఎన్ని మంచి పథకాలు అమలులోకి తెచ్చినాసరే.. బెల్టుషాపుల రూపంలో.. అడ్డూ అదుపూలేని వ్యసనానికి లోబడేలా పేద కుటుంబాలను దిగజార్చేస్తే.. అదే మహిళల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని ఆయన గ్రహించారు. అందుకే బెల్టుషాపుల విషయంలో చాలా ఖచ్చితంగా ఉండాలని ఆయన తమ ఎమ్మెల్యేలను, అధికార్లను హెచ్చరిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles